గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (13:27 IST)

కవిత-బ్రాహ్మణి రావచ్చు..నేను రాకూడదా? చంద్రబాబు దమ్మున్న మగాడేనా?: రోజా ప్రశ్న

వైకాపా ఎమ్మెల్యే రోజాకు అవమానం జరిగింది. మహిళా పార్లమెంటేరియన్ సమావేశానికి ఆహ్వానించి, ఆమెను నిర్భంధించారు. ఈ ఘటనపై రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గన్నవరం విమానాశ్రయంలో తనను పోలీసులు అదుపులోకి తీ

వైకాపా ఎమ్మెల్యే రోజాకు అవమానం జరిగింది. మహిళా పార్లమెంటేరియన్ సమావేశానికి ఆహ్వానించి, ఆమెను నిర్భంధించారు. ఈ ఘటనపై రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గన్నవరం విమానాశ్రయంలో తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై రోజా తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను రానివ్వకుండా మహిళా సదస్సులు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు.
 
ఈ సందర్భంగా ఓ వీడియోను రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూతురు, సీఎం చంద్రబాబునాయుడు కోడలు, తెలంగాణ సీఎం కూతురులను ఆహ్వానించుకునేందుకు ఇదేమైనా రాజకీయ సమావేశమా? అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబుకు భయం పట్టుకుందని... చంద్రబాబు దమ్మున్న మగవాడే అయితే.. బృందా కారత్ లాంటి మహిళా నేతలతోపాటు తనలాంటి వారిని పిలిపించి సదస్సులో మాట్లాడనివ్వాలని అన్నారు. ఇలాంటి పిరికివాళ్లు, భయపడేవాళ్లను తాను చూడలేదని.. కోట్లు ఖర్చు చేసి సమావేశాలు ఏర్పాటు చేసింది మహిళల కోసమేనా? అని ప్రశ్నించారు. 
 
కానీ పోలీసులు రోజాను అడ్డుకున్నందుకు గల కారణాన్ని వెల్లడించారు. రోజాను గన్నవరం విమానాశ్రయంలో శనివారం పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇందుకు బౌద్ధ గురువు దలైలామా అక్కడకు వస్తున్నారన్న కారణమని పోలీసులు తెలిపారు. అయితే వైకాపా నేతలు మాత్రం పోలీసుల వైఖరిని తప్పుబడుతున్నారు. 
 
చంద్రబాబుకు రోజాను ఎదుర్కొనే ధైర్యం లేదని వైయస్సార్ కాంగ్రెస్ మహిళా నేతలు ఈశ్వరీ, తదితరులు ఆరోపించారు. చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదని, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ ఘటనపై డీజీపీని నిలదీస్తామని చెప్పారు.