శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By Selvi
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2015 (16:30 IST)

దుర్గాష్టమి విశిష్టత.. ఆయుధాలకు ఎందుకు పూజ చేస్తారు?

దుర్గాష్టమి రోజున ఆయుధాలకు ఎందుకు పూజ చేస్తారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. 
 
పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు.
 
మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు. 
 
తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు. 
 
వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతున్నారు.