శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By chj
Last Modified: శనివారం, 8 అక్టోబరు 2016 (13:50 IST)

శ్రీ మహా సరస్వతీ దేవి అలంకారం... నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని(Video)

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ.

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ.
 
నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం ఆశ్వయుజ శుద్ధ సప్తమీ నాడు అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారంతో దర్శినిమిస్తుంది. చైతన్య స్వరూపిణిగా పురాణాలు సరస్వతీ దేవిని వర్ణిస్తున్నాయి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి, అంతరిక్ష మహా సరస్వతులుగా సప్త నామాలతో పూజలందుకునే ఈ వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని. 
 
బుద్ధిని, విద్యను, జ్ఞానమును ప్రసాదించి తనను పూర్తి శరణాగతితో ఆరాధించే వారికి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని వివేచనా శక్తిని, జ్ఞాపక శక్తిని, కల్పనా నైపుణ్యాన్ని, కవితా స్ఫూర్తిని, రచనా శక్తిని, ధారణా శక్తిని ప్రసాదించే కరుణామయి సరస్వతీ దేవి. మూల నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా అమ్మవారిని ఆరాధిస్తారు. సరస్వతీ అమ్మవారు నెమలి వాహనం మీద, ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాల ధరించి, అభయముద్రతో, వీణను రెండు చేతులతో ధరించి, చందన చర్చిత దేహంతో దర్శినమిస్తుంది. 
 
వాల్మీకి మహర్షి, కాళిదాసు మున్నగు లోకోత్తర కవులకు, పురాణ పురుషులకు సరస్వతీ అమ్మవారు వాగ్వైభవమును వరముగా అందజేసింది. సరస్వతీ రూపంలో అమ్మవారిని దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. అటుకులు, బెల్లం, సెనగపప్పు, కొబ్బరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.