గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2014 (18:55 IST)

రొయ్యలతో టేస్టీ గోంగూర గ్రేవి ఎలా చేయాలి?

రొయ్యలలో ఒకే విధమైన వంటలతో బోర్ కొట్టేసిందా? వెరైటీగా మటన్ గోంగూర వంటి రొయ్యలతో గోంగూర కర్రీ ఎలా చేయాలో ట్రై చేయండి. రొయ్యలు తినడానికి రుచికరంగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సీ ఫుడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందుచేత రొయ్యలతో టేస్టీ గోంగూర గ్రేవి ఎలా చేయాలో చూద్దాం... 
 
కావలసిన పదార్థాలు : 
గోంగూర: ఒక కప్పు 
రొయ్యలు: రెండు కప్పులు 
నెయ్యి: పావు కప్పు 
ధనియాలపొడి: ఒక టీ స్పూన్ 
పసుపు: పావు టీ స్పూన్ 
కారం: 2 టీ స్పూన్లు 
ఉప్పు: రుచికి తగినంత
కరివేపాకు, కొత్తిమీర తరుగు : కొద్దిగా
టమోటో తరుగు : అరకప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్: రెండు టేబుల్ స్పూన్లు 
ఉల్లిపాయ తరుగు : అర కప్పు 
పచ్చిమిర్చి-ఎండుమిర్చి పేస్ట్: రెండు టీ స్పూన్లు 
పోపుదినుసులు (అన్నీ కలిపి) : వేపుడుకు తగినంత 
 
తయారీ విధానం :
స్టౌ వేడయ్యాక నెయ్యి వేసి.. అందులో రొయ్యలను దోరగా వేపుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి వేగాక ఉల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి బ్రౌన్‌గా వేపుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టిన రెండు కప్పుల గోంగూరను చేర్చి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు కారం వేసి మూత పెట్టాలి. 
 
కాసేపయ్యాక ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని చేర్చి బాగా కలపాలి. రొయ్యలు ఉడికాక కొత్తిమీర తరుగు, కరివేపాకు చేర్చి దించేయాలి. అంతే నోరూరించే గోంగూర రొయ్యల గ్రేవీ రెడీ.. ఈ కూర చపాతీల్లోకి లేదా వేడి వేడి రైస్‌లోకి సైడిష్‌గా యూజ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.