శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 20 మే 2019 (20:38 IST)

చింతచిగురు-పచ్చిరొయ్యల కూర భలే టేస్ట్... ఎలా చేయాలి?

మాంసాహారంలోని సీ పుడ్ మన ఆరోగ్యానికి మంచిది అనే విషయం మనందరికి తెలిసిందే. మాంసాహార ప్రియులు పచ్చిరొయ్యలని అమితంగా ఇష్టపడతారు. అయితే.... రొయ్యలని ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీ పద్ధతులలో చేసుకుని తింటే ఆ రుచే వేరు. మరి చింతచిగురుతో పచ్చిరొయ్యలను కలిపి వండితే ఆ రుచి అద్బుతంగా ఉంటుంది. అదెలాగో చూద్దాం.
   
కావలసిన పదార్థాలు:
పచ్చి రొయ్యలు - అరకేజీ,
చింతచిగురు - పావుకేజీ,
ఉల్లిపాయలు - రెండు,
పచ్చి మిర్చి - నాలుగు, 
నూనె - మూడు టీస్పూన్లు,
పసుపు - టీస్పూన్‌,
అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూను,
కారం - టీస్పూన్‌,
ఉప్పు - రుచికి తగినంత
 
తయారుచేయు విధానం:
ముందుగా పచ్చి రొయ్యలను శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి. చింతచిగురును పేస్టు మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని కాస్త నూనె వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించుకొని అల్లంవెల్లుల్లిపేస్టు వేసి కాసేపు వేగాక పచ్చి రొయ్యలు వేసి, కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. పదినిమిషాల తరువాత చింతచిగురు వేయాలి. కారం, ఉప్పు వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరగా గ్లాసు నీళ్లు పోసి ఉడికించి చిక్కగా అయ్యాక స్టౌ ఆపేయాలి. ఎంతో రుచికరమైన చింతచిగురు పచ్చిరొయ్యల కూర రెడీ.