గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2015 (17:08 IST)

మటన్ ఖీమా కర్రీ ఎలా చేయాలి?

మటన్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువని.. తద్వారా బరువు పెరిగిపోతామని భయపడతారు. అయితే న్యూట్రీషన్లు ఏమంటున్నారంటే.. 85 గ్రాముల మటన్‌లో 2.6 గ్రాముల వరకే ఫ్యాట్ ఉంటుందని చెప్తున్నారు. కానీ మటన్‌ను మాసానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. మటన్ తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని హార్వర్డ్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. అలాంటి మటన్‌తో ఖీమా కర్రీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
మటన్ ఖీమా - అర కేజీ 
ఉల్లి తరుగు - ఒక కప్పు 
టమాటో తరుగు - ఒక కప్పు  
అల్లం వెల్లుల్లి పేస్ట్ - మూడు టీ స్పూన్లు 
గరం మసాలా - ఒక టీ స్పూన్ 
కరివేపాకు - మూడు రెబ్బలు 
కొత్తిమీర తరుగు- పావు కప్పు 
పసుపు- చిటికెడు. 
కారం, ఉప్పు, నూనె - తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా ఖీమాను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక అందులో ఉల్లి తరుగును చేర్చి దోరగా వేయించాలి. తర్వాత కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి కొద్దిగా వేపుకోవాలి. కడిగి పెట్టుకున్న ఖీమ వేసి అందులో కాసింత ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టాలి.

అందులోని నీరంతా ఇగిరిపోయాక చిన్న ముక్కలుగా చేసుకున్న టమోటా, గరం మసాలా వేసి కలియబెట్టి.. రెండు కప్పులు నీరు చేర్చి ఖీమా మెత్తగా ఉడికేంతవరకు ఉంచారు. నీరంతా ఇగిరిపోయాక కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుని దించేయాలి. అంతే మటన్ ఖీమా కర్రీ రెడీ అయినట్లే. దీన్ని రోటీల్లోకి లేదా అన్నంలోకి సైడిష్‌గా వాడుకోవచ్చు.