మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 మే 2015 (18:06 IST)

టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేయాలి?

చేపల్ని తీసుకోవడం ద్వారా గుండెను, మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రక్తపోటు, గుండెపోటును నియంత్రించవచ్చు. అల్జీమర్స్‌, డయాబెటిస్‌ను నిరోధిస్తుంది. అలాంటి సీ ఫుడ్ అయిన ఫిష్‌తో టేస్టీ కర్రీ ఎలా చేయాలంటే.. 
 
కావలసిన పదార్థాలు : 
చేపల ముక్కలు : అర కేజీ 
జీలకర్ర - ఒక టీ స్పూన్ 
ధనియాలు - ఒక టీ స్పూన్ 
ఎండు మిరపకాయలు - రెండు 
కొబ్బరి తురుము - అర కప్పు 
మెంతులు - పావు స్పూన్ 
ఉల్లిపాయలు - అర కప్పు 
టమోటాలు - అర కప్పు 
చింతపండు గుజ్జు - అర కప్పు 
కొత్తిమీర తరుగు - పావు కప్పు
నూనె, ఉప్పు - రుచికి తగినంత 
 
నానబెట్టేందుకు .. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్- తలా అర స్పూన్.. ఉప్పు-తగినంత
 
తయారీ విధానం :
ముందుగా ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, అల్లం పేస్ట్ శుభ్రం చేసిన చేపల ముక్కలకు పట్టించి 20 నిమిషాలు పక్కన వుంచుకోవాలి. మూకుడులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేడిచేసి, జీలకర్ర, ధనియాలు, ఎండు మిరపకాయలు, కొబ్బరి తురుము ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. వీటిని కప్పు నీరు పోసి రుబ్బుకోవాలి. మూకుడులో మిగతా నూనె వేసి కరివేపాకు, మెంతులు వేసి తాలింపు పెట్టి ఉల్లిపాయలు కలిపి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. 
 
టమేటో ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించి, రుబ్బుకున్న పేస్ట్, అరకప్పు నీరు, చింతపండు గుజ్జు, ఉప్పు కలిపి ఉడికించాలి. తర్వాత చేపల ముక్కలు వేసి మెత్తబడేవరకు సుమారు ఐదు నిమిషాలు ఉడికించి కొబ్బరిపాలు పోయాలి. మరో రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసి.. వేడి వేడి రైస్‌తో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.