శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 2 జులై 2015 (12:23 IST)

20వ తానా మహాసభలకు అతిథుల ఆగమనం.. వేడుకల సన్నాహాలు పూర్తి

20వ తానా ద్వైవార్షిక మహాసభల వేడుకలకు రంగం సిద్ధమైంది. అతిథుల కోలాహలం మొదలైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. కోర్ కమిటీ సభ్యులు, కమిటీ చైర్మెన్లు, వాలంటీర్లు మహాసభల ఏర్పాట్లులో పూర్తిగా నిమగ్నమైనారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్, సుప్రీమ్‌కోర్టు న్యాయమూర్తి రమణ, ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్ తదితరులు వచ్చారు. 1వ తేది సాయంత్రం తానా మహాసభల సందర్భంగా సినీ తారలతో డిట్రాయిట్ వారియర్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్  మీడియా విస్తృత ప్రచారం జరిపాయి. 
 
డిట్రాయిట్లో తెలుగువారు ఈ మ్యాచ్ చూడటానికి ఉత్సాహపడుతున్నారు. ఆహ్వాన కమిటి, ట్రాన్సుపోర్ట్ కమిటీల వారు విమానాలలో వస్తున్న అతిథులకు స్వాగతం పలుకుతున్నారు. కోబో సెంటర్‌కు దగ్గరగా ఉన్న హోటల్లో వారి సదుపాయాలు చూస్తున్నారు. తానా మహాసభల ప్రధాన నిర్వాహకులు నాదెండ్ల గంగాధర్, తానా అధ్యక్షులు మోహన్ నన్నపనేని, తానాకు కాబోయే అధ్యక్షులు జంపాల చౌదరి, వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ వేమన, రిజిస్ట్రేషన్ చైర్మెన్ రఘు రావిపాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రిస్ట్ బ్యాండ్లు, టికెట్లతో కూడిన ప్యాకట్‌ను అతిథులకు అందచేయడంతో మహాసభల కార్యక్రమం మొదలైంది.  రెండు బాన్కేట్ రిజిస్ట్రేషన్లు ఫుల్ అయిపోయాయి.
 
తానా మహాసభల వేదిక కోబో సెంటర్‌కు అన్ని కమిటీలవారు చేరుకొని అలంకరణ, హాలులో వసతులు, ప్రధాన వేదిక, ధింతానా వేదిక, బాన్కేట్ హాలు, భోజన సదుపాయాల ఏర్పాటులో ఉన్నారు. ఎక్జిబిషన్ కమిటీ విక్రయదారులకు కేటాయించిన స్థలాల ఏర్పాట్లు చూస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత, సమాచార , NRI, భాష , సంస్కృతికి సంబంధించిన మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి వస్తున్నట్లు వర్తమానం అందుకున్నారు. సినీ నటీనటుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మీడియా వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన అతిథులతో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. 2వ తేది సాయంత్రం ప్రధాన అతిథులు, దాతల విందు భోజనం, అతిథుల పరిచయాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
పదివేలకు మందిపైగా ఈ మహాసభలకు విచ్చేస్తున్నారు. ప్రధానవేదికపై ప్రారంభోత్సవ నృత్యాలు, అతిథుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహింపనున్నారు. ధింతానా ఫైనల్స్ TV9, తానా సంయుక్తంగా నిర్వహింపనున్నారు. వ్యవసాయ వేదిక, మహిళా చర్చా వేదిక, సాహితీ సదస్సు, సినీ తారల కార్యక్రమం, మణిశర్మ సంగీత విభావరి, TV5 పేరిణి నృత్యం, ఇంకా ఎన్నో వినోద కార్యక్రమాల సన్నాహాలు పూర్తవుతున్నాయి. తానా కార్యవర్గం మహాసభలకి వచ్చిన అతిథులందరికి స్వాగతం పలుకుతోంది.