శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 30 జూన్ 2014 (13:35 IST)

గృహనిర్మాణం ఎప్పుడు చేపట్టాలి...? శుక్లపక్షంలో ..?

"గృహమేకదా స్వర్గసీమ" అన్నారు పెద్దలు. ఆ స్వర్గసీమ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? ఇలాంటి సందేహాలు తలెత్తుతుంటాయి. అలాంటి సందర్భంలో గ్రహాలకు ఆద్యుడైన సూర్యుడు వివిధ రాశులలో సంచరిస్తుంటాడు. సూర్య గ్రహం వివిధ రాశులలో సంచరిస్తుంటే ఆయా మాసాలకు ఆయా పేర్లు పెట్టడం జరిగింది. ప్రస్తుతం గృహ నిర్మాణం ఎప్పుడు చేపట్టాలనే దానిపై జ్యోతిష్యులు తమ అభిప్రాయాలను ఇలాచెపుతున్నారు.  
 
1. సూర్యగ్రహం మేష రాశిలో ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే ఎంతో లాభదాయకం అంటున్నారు జ్యోతిష్యులు.
 
2. అదే వృషభరాశిలో సూర్యగ్రహం ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపడితే సంపద పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు.
 
3. మిథున రాశిలో సూర్యగ్రహం ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపడితే ఇంటి యజమానికి కష్టాలు తప్పవంటున్నారు జ్యోతిష్యులు.
 
4.కర్కాటక రాశిలో సూర్యగ్రహం ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే, ఆ ఇంట్లో నివసించేవారు ధన-ధాన్యాలతో తులతూగుతుంటారు.
 
5. సింహరాశిలో సూర్యగ్రహం ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపడితే కీర్తి ప్రతిష్టలతోపాటు సేవకులుకూడా మీకు తగినట్లు నడుచుకుంటారు. 
 
6** కన్యారాశిలో సూర్యగ్రహం ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే ఆ ఇంట్లో నివసించేవారు రోగాలబారినపడి, చికాకుతో జీవనం సాగిస్తుంటారని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. 
 
7. తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు గృహనిర్మాణం చేపడితే ఆ ఇంటి యజమాని, ఇంట్లో నివసించేవారు సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని గడుపుతుంటారు.
 
8. వృశ్చిక రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపడితే ఆ ఇంట్లో నివసించే వారికి ధనవృద్ధి కలుగుతుంది. 
 
9. ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే ఆ ఇంటి యజమానికి పూర్తిగా నష్టం వాటిల్లడమే కాకుండా వినాశనానికి దారితీస్తుందంటున్నారు జ్యోతిష్యులు.
 
10. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు గృహ నిర్మాణం చేపడితే ఇంటి యజమానికి, ఇంట్లో నివసిస్తున్నవారికి ధనం, వారి సంపదలో వృద్ధి కనపడుతుంది. 
 
11. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే ఆ ఇంట్లో నివసించేవారికి రత్నాలు, ఇతర ధాతువుల లాభం చేకూరుతుందంటున్నారు జ్యోతిష్యులు.
 
12. సూర్యుడు మీనరాశిలోనున్నప్పుడు ఇంటి నిర్మాణం చేపడితే ఇంటి యజమానికి నలువైపులా నష్టమే నష్టం అంటున్నారు జ్యోతిష్యులు.
 
 
ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలనుకుంటే శుక్లపక్షంలోనే ప్రారంభించాలి. ఫాల్గుణం, వైశాఖం, మాఘం, శ్రవణం, కార్తీక మాసాలలోనే ఇంటి నిర్మాణం చేపట్టాలి. దీంతో మంచి ఫలితాలను అందుకోవచ్చంటున్నారు జ్యోతిష్యులు.
 
చేయకూడనివి: గృహ నిర్మాణం చేపట్టాలనుకుంటే వీటిని కచ్చితంగా పాటించి తీరాలి. అవేంటంటే మంగళవారం, ఆదివారం రోజుల్లో, అమావాస్య వెళ్ళిన తర్వాత అలాగే పౌర్ణిమి మరుసటి రోజున, చతుర్థి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య రోజులలో గృహ నిర్మాణం చేపట్టకూడదు. అలాగే జ్యేష్ట్యా, మూల, రేవతీ నక్షత్రంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపట్టకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జీర్ణోద్ధారణకాని, పునాదులు వేసే కార్యక్రమాలుకాని చేపట్టకూడదు. ఇలా చేస్తే ఫలితం ఉండదంటున్నారు జ్యోతిష్యులు. 
 
శుభయోగాలను ఇచ్చేటివి : శనివారం, స్వాతి నక్షత్రం, సింహలగ్నం, శుక్లపక్షం, తిథి సప్తమీ, శుభయోగం, అలాగే శ్రావణమాసం ఇవన్నీకూడా ఒకే రోజులో వస్తే అలాంటి ముహూర్తంలో గృహనిర్మాణం చేపడితే ఆ ఇంట్లో దైవికం ఉట్టిపడటమే కాకుండా శుఖశాంతులకు నిలయంగా మారుతుంది. వీటితోబాటు ఈ ఇంట్లో నివసించే కుటుంబం ధనధాన్యాలతో తులతూగుతుందంటున్నారు జ్యోతిష్యులు.