శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (16:21 IST)

మంగళవారం వ్రతం ఎలా చేయాలి? దానం ఏమివ్వాలి?

నవగ్రహాలలో కుజునికి అధిపతి కుమార స్వామి. అందుచేత మంగళవారాల్లో వ్రతమాచరించే వారికి సకల సంపదలు చేకూరుతాయని పంచాంగ నిపుణులు అంటున్నారు. కుమార స్వామికి ఎంతో ప్రీతి గల మంగళవారం పూట నిష్ఠతో పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
ఇంట్లోనే కాకుండా.. మంగళవారం పూట ఏదైనా కుమారస్వామి ఆలయానికి వెళ్లి అక్కడ రాత్రి బస చేసి ప్రత్యేక అభిషేక ఆరాధనలు చేయిస్తే కుజగ్రహ ప్రభావంతో ఏర్పడే ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.  
 
మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి కుమారస్వామిని నిష్ఠతో పూజించాలి. తర్వాత పంచాక్షర మంత్రాన్ని 108 సార్లు ధ్యానించాలి. తర్వాత సూర్య నమస్కారం చేయాలి. తర్వాత చేతనైన విధంగా ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. 
 
అలాగే బియ్యం, నెయ్యి, మిరియాలు, జీలకర్రలతో అన్నం చేసి స్వామికి సమర్పించాలి. మంగళవారం సాయంత్రం శివాలయ దర్శనం చేసుకుని ఇంటికొచ్చి స్కంధపురాణం చదవాలి. ఆ రోజు రాత్రి నిద్రకు మంచంపై కాకుండా నేలమీదే నిద్రించాలి.   
 
కుజుని పూజకు ఆషాఢ మంగళవారం అన్నివిధాలా శుభఫలితాలుంటాయని పండితులు అంటున్నారు. మంగళవారం ఇంటి ముందు రంగవల్లికలు వేసి.. దీపమెలిగించి శ్రీ లలితా సహస్రనామాన్ని పఠించడం మంచిది. 
 
మహిళలకు తాంబూలం, గాజులు, కుంకుమ, దువ్వెన, అద్దం, గోరింటాకు, పసుపు వంటివి వాయనం ఇస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం పూట చేసే ఈ వ్రతం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం దక్కుతుంది. ఇంకా సంతానలేమి, వివాహంలో జాప్యం వంటి దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.