గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2014 (18:42 IST)

కాటుక పెట్టుకోండి.. కుజదోషాలను తొలగించుకోండి!

కాటుక ప్రాధాన్యమేమిటో అందరికీ బాగా తెలుసు. ఆడపిల్లలకు కాటుకకు విడదీయరాని బంధం ఉంది. పసిపిల్లలకి పాదాల్లోను ... చెక్కిలిపైన కాటుకతోనే 'దిష్టిచుక్క' పెడుతుంటారు. ఇక వాళ్లని పెళ్లికూతురుగా చేసినప్పుడు కూడా 'బుగ్గచుక్క'గా కాటుక ప్రధానమైన పాత్రను పోషిస్తుంది.
 
ఇక బాల్యం నుంచి ముత్తయిదు జీవితాన్ని గడుపుతున్నంత కాలం స్త్రీలు కళ్లకి కాటుకను ధరిస్తూనే వుంటారు. ఆధునీకత పేరుతో ఈ రోజుల్లో కాటుకను ధరించేవారి సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది.  
 
ప్రతిరోజు కాటుకను ధరించడం వలన, కళ్లు విశాలంగా అందంగా రూపుదిద్దుకుంటాయట. ముఖ సౌందర్యాన్ని కాటుక రెట్టింపు చేస్తుందని భావించేవాళ్లు. అంతే కాకుండా నేత్ర సంబంధిత వ్యాధులను కాటుక దూరంగా ఉంచుతుంది. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న కాటుక, గ్రహ సంబంధిత దోషాలను కూడా పోగొడుతుందని పురోహితులు అంటున్నారు. 
 
ముఖ్యంగా వివాహ విషయంలో ఆలస్యం కావడం... వివాహమైతే వైవాహిక జీవితం సాఫీగా సాగకపోవడం వంటివి మహిళలకు కుజగ్రహ ప్రభావంతో జరుగుతూ వుంటాయి. ఈ రెండు సమస్యలు స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవే. అందువలన కుజదోషం నుంచి బయటపడటానికి వాళ్లు వివిధరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
 
ఈ నేపథ్యంలో 'కుజదోషం'తో బాధలు పడుతోన్న అమ్మాయిలు కాటుక ధరించడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని పండితులు అంటున్నారు. కుజదోషముందని తెలియకుండా కాటుక ధరించినా కుజదోషం నుంచి విముక్తి పొందవచ్చును. కాబట్టి కాటుక ధరించండి.. కుజగ్రహ దోషాన్ని తొలగించుకోండి.