గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2016 (13:40 IST)

ఫిబ్రవరి 20న శనిత్రయోదశి... శనికి ఇష్టమైన ఆ నక్షత్రాల వారు ఇలా చేయండి...

ఈ నెల 20వ తేదీ శనివారం, పుష్యమి నక్షత్రము నందు శని త్రయోదశి ఏర్పడుతుంది. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైనది. శనికి ఇష్టమైన నక్షత్రాలు పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాలను శని నక్షత్రాలు అంటారు. శనివారం శని త్రయోదశినాడు శనికి తైలాభిషేకం చేయించి శనిని పూజించి, ఆరాధించినట్లయితే శనిదోషం కొంతవరకు నివారణ జరుగుతుంది. ఈ శని ఉత్తర భాగంలో సంచరించడం వల్ల ఉత్తరం వైపు తిరిగి శని భగవానునికి నమస్కరించడం వల్ల దోషాలు తొలగిపోతాయి.
 
మేష రాశి వారికి అష్టమ శనిదోషం ఉన్నందువల్ల తలపెట్టిన పనిలో ఆటంకాలు, ఒడిదుడుకులు, అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఈ రాశివారు శనికి 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి శనికి తైలాభిషేకం చేయించి జిల్లేడు పూలతో పూజించినా శుభం కలుగుతుంది. 
 
సింహరాశి వారికి అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఈ రాశివారు 9సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపుశంఖు పూలతో శనిని పూజించి, తైలాభిషేకం చేయించిన సర్వదోషాలు తొలగిపోతాయి. 
 
తుల, వృశ్చిక, ధనుర్ రాశులవారికి ఏల్నాటి శనిదోషం ఉన్నది. తులా రాశివారు 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని శంఖు పూలతో శనిని పూజించి శనికి తైలాభిషేకం చేయించినా శుభం కలుగుతుంది. 
 
వృశ్చిక రాశివారు 9 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి శనిని తైలాభిషేకం చేయించి డిసెంబరు పూలతో కానీ, నూపువ్వులతో శనిని పూజించి, ఆరాధించినా సర్వదోషాలు తొలగిపోతాయి.
 
ధనుర్ రాశి వారు వ్యయస్థానము నందు శని సంచారం వల్ల అధికమైన ఖర్చులు అవుతాయి. ఆరోగ్యములో సమస్యలు తలెత్తుతాయి. ఈ రాశివారు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి పాండవుల పూలతో కానీ, నీలపు శంఖుపూలతో కానీ శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి. ఈ రాశివారు పిప్పలి, పొగడ, వేప వంటి మొక్కలను ఉద్యానవనాల్లో నాటిన సర్వదోషాలు తొలిగిపోతాయి. 
 
సాయిబాబా దేవాలయంలో ఉండే ధునిలో 19 జమ్మి సమిధలను వేసినా సర్వదా శుభం కలుగుతుంది. అలాగే ఒక బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు, చెప్పులు, నల్లగొడుగు, నల్ల వస్త్రము ఇచ్చినట్లయితే దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్యము బాగుగా లేనివారు చిటికెడు కళ్లుఉప్పును, నల్లనువ్వులను, శని పాదాల యందు ఉంచి నమస్కరించినా దోషాలు తొలగిపోయి శుభం కలుగుతుంది. 
 
శని గాయత్రి..." ఓం రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నః శని ప్రచోదయాత్"
 
శని శ్లోకం.... ''నీలాంజనసమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం"

- శ్రీమతి ప్రసూనా రామన్, జ్యోతిష్య విజ్ఞానభారతి.