శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : సోమవారం, 9 నవంబరు 2015 (09:59 IST)

ధనత్రయోదశి నేడే.. బంగారం కొనండి.. లక్ష్మీదేవిని పూజించండి

ధనత్రయోదశి నాడు.. బంగారం కొనడం శుభప్రదం.. లక్ష్మీదేవిని పూజించండి. ధనత్రయోదశి అయిన ఈరోజు (సోమవారం) బంగారం కొనడం శుభప్రదమని పండితులు అంటున్నారు. డబ్బు సంపాదించాలి.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనుకునేవారు.. ధనత్రయోదశినాడు మహాలక్ష్మీని పూజించడం ఉత్తమ ఫలితాలనిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
పాలకడలిలో శేషతల్పంపై మహావిష్ణువు సరసన ఉండే మహాలక్ష్మి భూమిపైకి వచ్చిన రోజే ధన త్రయోదశిగా పురాణాలు చెప్తున్నాయి. భువిపైకి వచ్చిన ధనలక్ష్మి ఇంటికి రావాలంటే ఏం చేయాలి? తనను భక్తులు ఎలా పూజించాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.  
 
కలియుగం ప్రారంభమైన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారన్న విషయాన్ని తెలుసుకునేందుకు భృగు మహర్షి విష్ణునివాసమైన వైకుంఠానికి వెళతాడు. అక్కడ తనను గమనించని లక్ష్మీ, విష్ణువులను చూసి కోపోద్రిక్తుడై, శ్రీహరి వక్షస్థలంపై తంతాడు. విష్ణువు ఆయన్ను క్షమించమని అడుగుతూ, కాళ్లు పట్టుకుని, ఆపై భృగువుకు అరికాలులో ఉన్న కంటిని చిదిమేసి ఆయన కోపాన్ని, అహంకారాన్ని హరిస్తాడు.
 
తన భర్త ఓ ముని పాదాలు పట్టుకోవడం, అంతకుముందు తన నివాసమైన విష్ణువు గుండెలపై కాలితో తన్నడం నచ్చని లక్ష్మీదేవి అలికి భూమిపైకి వచ్చేస్తుంది. ఆశ్వీజ బహుళ త్రయోదశి నాడు ఆమె భూమిపై ఉన్న కరవీరపురానికి (అది నేటి కొల్హాపూర్) చేరుకుందట. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన విషయాన్ని గమనించిన కుబేరుడు ఆ వెంటనే ఆమెను పూజించి, లక్ష్మీదేవి కరుణను పొందాడు.
 
లక్ష్మి వచ్చిన త్రయోదశి కాబట్టి, అది ధన త్రయోదశి అయింది. బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినాల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. అందుచేత సోమవారం శుచిగా స్నానమాచరించి.. ఏమీలేని పేదలకు భోజనమో వస్త్రమో.. ధనమో దానం చేయాలి. ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీ స్వరూపులుగా భావించి వారికి కానుకలు ఇవ్వాలి. లక్ష్మీదేవిని తామర పూవులతో అర్చించాలని పండితులు అంటున్నారు. అలాగే ఇంటికొచ్చిన మహిళలకు పసుపు, కుంకుమలు, వస్త్రములతో కూడిన వాయనమివ్వాలని పండితులు అంటున్నారు.