గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (16:20 IST)

హనుమంతుడిని స్మరించి.. సింధూరాన్ని ధరిస్తే?

మహాశక్తిమంతుడైన హనుమంతుడు ఎక్కడ కొలువై వుంటే అక్కడ మానసిక, శారీరక రుగ్మతలు వుండని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. హనుమంతుడు వివిధ ముద్రలతో... నామాలతో అనేక ప్రదేశాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. 
 
దూరప్రాంతాల్లో పుణ్యక్షేత్రాల్లో కొలువైన హనుమంతుడిని స్మరించడం వీలుకాకపోతే.. తమకు వీలైన.. సమీపంలోని ఆలయాల్లో హనుమంతుడిని పూజించడం ఉత్తమం. అందుకు కూడా సమయం లేకపోతే శనివారం పూట ఇంటిని శుభ్రం చేసుకుని.. శుచిగా.. హనుమంతునికి పూజచేసి.. ఆయనకు ఇష్టమైన సింధూరాన్ని నుదుటన ధరిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
ఇంకా నల్గొండ జిల్లా పరిధిలో గల హాలియా క్షేత్రంలో సంజీవని ఎత్తుకెళ్లే ముద్రలో గల స్వామిని దర్శించుకుంటే ఈతిబాధలు, దిష్టి, దోషాలు నశింపబడతాయి. ఈ క్షేత్రంలో ప్రతి మంగళవారం స్వామివారికి సింధూర అభిషేకం ... ఆకుపూజలు జరుగుతూ ఉంటాయి. 
 
ఈ పూజల ఫలితంగా ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సాధారణంగా పిల్లలకి 'దిష్టి' తగిలితే పెద్దలు తమకి తెలిసిన విధంగా ఆ దిష్టిని తీసేస్తుంటారు. అయినా ఆ ప్రభావం నుంచి పిల్లలు బయటపడలేకపోతే, ఈ క్షేత్రానికి తీసుకుని వస్తుంటారు. 
 
స్వామిని దర్శించి అభిషేక సింధూరాన్ని నుదుటున ధరించడంతో పిల్లలు వెంటనే ఆ ప్రభావం నుంచి బయటపడతుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక గ్రహ పీడల వలన కూడా కొంతమంది నానా ఇబ్బందులు పడుతుంటారు. 
 
అలాంటి వాళ్లు ఇక్కడి స్వామిని దర్శించుకుని సేవిస్తే మంచి ఫలితం కనిపిస్తుందని అంటారు. ఈ ఆలయంలో స్వామివారిని తలచి ప్రదక్షిణలు చేస్తే న్యాయబద్ధమైన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.