గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శనివారం, 17 జనవరి 2015 (15:40 IST)

సౌభాగ్యం స్థిరంగా నిలిచి వుండాలంటే.. స్త్రీలు ఎం చేయాలి?

స్త్రీలు వట సావిత్ర వ్రతాన్ని 'జ్యేష్ఠ పౌర్ణమి' రోజున ఆచరిస్తుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే యమధర్మరాజుని ఎదిరించి సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకోగలిగిందని చెప్పబడుతోంది. వట వృక్షం మూలంలో బ్రహ్మదేవుడు ... మధ్య భాగంలో విష్ణువు ... పై భాగంలో శివుడు ఉంటాడని పండితులు చెబుతున్నారు. 
 
వట వృక్షాన్ని పూజిస్తూ సావిత్రి ఈ వ్రతాన్ని ఆచరించినది కాబట్టే, ఈ వ్రతానికి 'వట సావిత్రి' అనే పేరు వచ్చింది. ఈ వ్రతాన్ని త్రయోదశి రోజున ఆరంభించి పౌర్ణమి వరకూ, అంటే మూడు రోజులపాటు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. వివాహిత స్త్రీలు ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మర్రిచెట్టు దగ్గరికి చేరుకొని అక్కడ శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టాలి.
 
పసుపు కుంకుమలతో వట వృక్షాన్ని పూజించి, నైవేద్యాలు సమర్పించాలి. పసుపు దారాన్ని వట వృక్షానికి చుడుతూ ... 'నమో వైవస్వతాయ 'అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత ముత్తయిదువులకు దక్షిణ తాంబూలాలతో పాటు పండ్లను దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన వైధవ్య దోషాలు తొలగిపోయి సౌభాగ్యం స్థిరంగా నిలిచి ఉంటుందని చెప్పబడుతోంది