శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (14:42 IST)

శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెళ్ళొచ్చాక.. ఇతర ఆలయాలకు వెళ్ళకూడదు.. ఎందుకో తెలుసా?

తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అందరూ శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెళ్తుంటారు. అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇతర ఆలయాలకు వెళ్లకూడదనే ఆచారం ఉంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయా

తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అందరూ శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెళ్తుంటారు. అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇతర ఆలయాలకు వెళ్లకూడదనే ఆచారం ఉంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఇతర దేవుళ్లను పూజించడం లేదా దర్శించుకోవడం అరిష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
ఇందుకు కారణం లేకపోలేదు. కాళహస్తీశ్వర ఆలయంలోని వాయులింగాన్ని దర్శించుకున్నాక.. నేరుగా ఇంటికే వెళ్ళాలి. ఇతర ఆలయాలకు గానీ, బంధువుల ఇంటికి కానీ వెళ్లకూడదంటారు. ఎందుకంటే.. పంచభూతాలకు ఈ విశ్వం నిలయం లాంటిది. గాలి, నింగి, నేల, నీరు, నిప్పు.. వీటినే పంచభూతాలుగా పిలుస్తారు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి. అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఇక్కడ స్వామివారు వాయులింగంగా ఉద్భవించారు. 
 
అందుకే ఈ ఆలయంలోని గాలి పీల్చిన తర్వాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడదనే ఆచారం ఉంది. సర్పదోషం.. రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా తొలగిపోతుంది. శ్రీకాళహస్తిలోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో సర్పదోషం పూర్తిగా తొలగిపోతుంది. అందుకే ఇక్కడ ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని పూజారులు చెప్తుంటారు.
 
కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లిన దోష నివారణ ఉండదని ఐతిహ్యం. గ్రహణాలు.. శని బాధలు.. పరమశివుడుకి ఉండవని.. మిగిలిన అందరి దేవుళ్లకి శని ప్రభావం, గ్రహణ ప్రభావం వుండటమే ఇందుకు కారణమని పండితులు అంటున్నారు. 
 
దీనికి మరోక ఆధారం కూడా ఉందని వారు చెప్తున్నారు. చంద్రగ్రహణం రోజున కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపి అప్పుడు పూజలు ప్రారంభిస్తారు. కానీ గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచే ఉంటుంది. అంతేకాదు రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. అందుకే వాయులింగాన్ని దర్శించుకున్నాక ఇతర దేవతల ఆలయాలను దర్శించకపోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.