బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: గురువారం, 13 అక్టోబరు 2016 (18:42 IST)

తిరుమల శ్రీవారి లడ్డూల వజ్రోత్సవ చరిత్ర తెలుసుకుందామా....

తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగింది లడ్డూ ప్రసాదం. క్రీ.శ.830సంవత్సరంలో పల్లవ రాజవంశీకుల కాలంలో సంధి నిషేదనల పేరుతో తిరుమలేవుని ప్రసాదాలను సమర్పించే ఆనవాయితీని ప్రవేశపెట్టిట్లు తిరుచానూరు, గోవిందరాజస్వామి వారి ఆలయాల్లో లభించిన శ

తిరుమలలో శ్రీవారి దర్శనం తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగింది లడ్డూ ప్రసాదం. క్రీ.శ.830సంవత్సరంలో పల్లవ రాజవంశీకుల కాలంలో సంధి నిషేదనల పేరుతో తిరుమలేవుని ప్రసాదాలను సమర్పించే ఆనవాయితీని ప్రవేశపెట్టిట్లు తిరుచానూరు, గోవిందరాజస్వామి వారి ఆలయాల్లో లభించిన శాసనాలు పేర్కొంటున్నాయి. అటవీ మార్గంలో తిరుమల కొండపైకి చేరిన భక్తులకు ఆహారం లభించే అవకాశాలు ఉండేవి కావు. మార్గమధ్యంలోని తిరుచానూరులో ఏర్పాటు చేసిన రామానుజ కూటాల ద్వారా అన్న సంతర్పణలు నిర్వహించేవారని ఆ శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అటు స్వామి నైవేద్యానికి, ఇటు భక్తుల ఆకలిని తీర్చడానికి వినియోగించే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనే పేరుతో పిలిచేవారని శాసనాధారాలు తెలియజేస్తున్నాయి. 
 
తరువాత కాలక్రమంలో క్రీ.శ.1444 సంవత్సరంలో సుఖీయం, క్రీ.శ.1455లో అప్పం, క్రీ.శ.1461లో వడ, క్రీ.శ.1469లో అత్తిరసం పేర్లతో తయారుచేసిన ప్రసాదాలను స్వామికి నివేదించారు. క్రీ.శ.1480లో మనోహరం పేరుతో తియ్యటి పిండి పదార్థాన్ని శ్రీవారి నిత్య నైవేద్యానికి  వినియోగించడం మొదలైంది. ఆ రోజుల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే వడలకే విశేష ప్రాచుర్యం ఉండేది. ఈ మేరకు క్రీ.శ.1803లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో శెనగపిండి పాకంతో తయారుచేసిన బూందిని ప్రసాదంగా వినియోగించే ఆచారం మొదలైంది. క్రీ.శ.1843, క్రీ.శ.1933 మధ్య కాలంలో తిరుమలేశుని ఆలయ పరిపాలన నిర్వహించిన మహంతుల కాలంలో ఆ బూంది ప్రసాదాన్ని మనోహరం పేరుతో చలామణిలోకి తెచ్చారు. 1933 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు తరువాత కూడా స్వామివారి నివేదనలతో చోటు చేసుకున్న వివిధ రకాల ప్రసాదాలతో పాటు బూంది నివేదన కొనసాగుతూ  ఉండేది.
 
1940 సంవత్సరంలో బూందిని లడ్డూ రూపంలో స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులకు అందించే విధానం తొలిసారిగా మొదలైంది. లడ్డూ ప్రసాదానికి పెరిగిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని లడ్డూల తయారీకి ప్రత్యేకంగా రూపొందించిన దిట్టాన్ని 1950లో తితిదే ధర్మకర్తల మండలి ఖరారు చేసింది. దాదాపు ఐదు శతాబ్ధాల తరువాత 2001 సంవత్సరంలో ప్రస్తుతం లడ్డూల తయారీకి వినియోగించే పదార్థాల దిట్టం సవరించారు. ఖరారైన దిట్టం ప్రకారం 5100 లడ్డూల తయారీకి దిట్టం ప్రకారం 804 కిలోల ముడిసరుకులు వినియోగిస్తుంటారు. ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయడం ప్రారంభించిన తొలిరోజుల్లో అర్చకులు, జియ్యంగార్లు కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారని తిరుమల క్షేత్ర ప్రాంత పరిపాలన కేంద్రమైన ఉత్తర ఆర్కాట్‌ జిల్లా అధికారి  జి.జె.స్టార్టస్‌ దొర రూపొందించిన సవాల్‌ ఏ జవాబ్‌ నివేదిక ద్వారా తెలుస్తోంది.
 
1933 సంవత్సరంలో తితిదే పరిపాలనా మొదలైన తరువాత పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అప్పటికే ఆలయ పేష్కార్‌ చెలికాని అన్నారావు లడ్డూలను తయారుచేసే మిరాశీదారులకు డబ్బులకు బదులుగా లడ్డూలు ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ విధానం ప్రకారం శ్రీవారి వంటశాలలో తయారుచేసే ప్రతి 51లడ్డూలకు 11లడ్డూలు మిరాశీదారులకు ఇస్తుండేవారు. ఈ విధానం కింద 1950లో రోజుకు వెయ్యి లడ్డూలను తయారుచేస్తుండే మిరాశీదారులు 1990 నాటికి సుమారు లక్ష లడ్డూలను తయారుచేసే స్థాయికి చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో 1996 మార్చి 16వతేదీన సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తిరుమలేశుని ఆలయంలో మిరాశీ వ్యవస్థ రద్దయ్యింది. తరువాత దశలో తితిదే స్వయంగా లడ్డూలను తయారు చేయించే విధానానికి శ్రీకారం చుట్టింది. తాజా లెక్కల ప్రకారం భక్తులకు అందించే  165 గ్రాముల లడ్డూ తయారీకి సుమారుగా 32.50లను తితిదే ఖర్చు చేస్తోంది.
 
లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు దృష్ట్యా భవిష్యత్తులో ఎవరూ కాపీ కొట్టకుండా ఉండేలా చూసేందుకు తితిదే 2006సంవత్సరంలో కృషి ప్రారంభించింది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి పేటెంట్‌ హక్కుల సాధన కోసం చెన్నైలోని జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌ రిజిస్ర్టీ విభాగానికి చెందిన నిపుణుల బృందం తిరుమలకు వచ్చి లడ్డూల తయారీ విధానాన్ని పరిశీలించింది. లడ్డూల రుచి, నిల్వ సామర్థ్యం వంటి అంశాలను పరిశోధించి ఆ విభాగం తిరుమలేశుని లడ్డూలను తమ జాబితాలో చేర్పింది. 2009, సెప్టెంబర్‌ 18వతేదీన తిరుమలేశుని లడ్డూ ప్రసాదానికి సంబంధించి మేధో సంపత్తి హక్కులు తితిదేకి మాత్రమే ఉండేలా చేసినట్లు ప్రకటించింది. ఈ విధంగా మేధోపరమైన హక్కులను పొందిన ఏకైక దేవాలయ ప్రసాదంగా తిరుమలేశుని లడ్డూ ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలిచింది. అధికారిక సమాచారం ప్రకారం 1940లో తిరుమలేశుని ప్రసాదంగా అమల్లోకి వచ్చిన లడ్డూ ప్రసాదం గత యేడాది 75యేళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.