గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (17:00 IST)

శ్రీనివాసుని ఆకలి తీరదు.. వేంగమాంబ నిత్యాన్నదాన సత్రం వైపు చూస్తూ..?

తెనాలి రామకృష్ణుడు భోజనప్రియుడైన శ్రీనివాసుడిని వ్యంగ్యంగా తిండి మెండయ్య అని సంబోధించాడు. రామావతారంలో శబరిమాత ఎంగిలి పండ్లతో కడుపునింపినట్టు, కృష్ణావతారంలో కుచేలుడు అటుకులతో ఆతిథ్యం ఇచ్చినట్టు.. కలియుగంలోనూ నరపతులూ గజపతులూ వేంకటపతికి రకరకాల నైవేద్యాలు సమర్పించుకున్నారు. కృష్టదేవరాయల అల్లుడైన అళియ రామరాయలవారికి తిరుమలరాయలు అనే సోదరుడు ఉండేవాడు.
 
ఆయన తన పేరు తిరుమలరాయని పొంగలి అనే ప్రత్యేకమైన ప్రసాదాన్ని నివేదించే ఏర్పాటు చేశాడు. తెల్లదొర థామస్‌మన్రో నైవేద్యాలు శాశ్వత నిధిని ఏర్పాటు చేశాడు. ఓ గంగాళాన్నీ ఇచ్చాడు. సంపంగి ప్రదక్షిణ మార్గంలోనే ఉగ్రాణానికి ఆనుకుని ఉన్న మండపం పడిపోటు. ఇది వేంకటాచలపతి వంటశాల. లడ్డు, వడ, అప్పం, దోసే, పోళీ, జిలేజీ, తేన్‌తొళ.. ఇక్కడే తయారవుతాయి. శ్రీవారికి ఏఏ రుచుని ప్రాణమో, ఎలా వండితే ఇష్టమో.. అమ్మవారికి కాక ఇంకెవరికి తెలుస్తుందీ.. కాబట్టే ఆ తల్లి పోటు తాయార్ పేరుతో భోజన వ్యవస్థను పర్యేవేక్షిస్తూ ఉంటుంది. 
 
ఆదేం చిత్రమో, అని నైవేద్యాలు సమర్పించినా ఆనందనిలయవాసుడి ఆకలి తీరదట. ఆశగా.. వేంగమాంబ నిత్యాన్నదాన సత్రం వైపు చూస్తుంటాడట. భోజనం ముగించుకుని బ్రేవ్ మంటూ భక్తులు తేన్చే తేన్పులు విన్నాకే, కడుపునిండుతుందట. ఆలయ పరిసరాల్లో ఎవరు ఆకలితో అలమటించినా.. అందుకు బాధ్యులైనవారిని శ్రీనివాసుడు క్షమించడు. ఆ అపరాధానికి.. ఆంతరంగిక సేవకుడైన తొండమాన్ చక్రవర్తినీ శిక్షించాడు. 
 
కూర్ముడనే పండితుడు కాశీయాత్రకు వెళ్తూ.. తాను తిరిగి వచ్చేంత వరకూ భార్యాపిల్లల్ని సంరక్షించమని తొండమాన్ చక్రవర్తిని అభ్యర్థించాడు. కాదనడానికి ఏముంది, సరేనన్నాడు తొండమానుడు. వారికోసం ఓ భవనాన్ని కూడా కేటాయించాడు. రాచకార్యాల్లో పడిపోయి అతిథుల అన్నపానాల గురించి మరిచిపోయాడు. అంతలోనే ఏడాది గడిచిపోయింది. ఆకలికి అలమటించి ఆ తల్లీపిల్లలు ప్రాణాలు వదిలారు. 
 
పండితుడు యాత్ర ముగించుకుని తిరిగొచ్చాడు. తన భార్యాపిల్లల్ని అప్పగించమని అడిగాడు. అప్పటికి కానీ, తొండమానుడికి తాను చేసిన పొరపాటు గుర్తుకురాలేదు. పరుగుపరుగున వెళ్లాడు. తలుపులు తెరిచి చూసేసరికి.. ఆస్తికలు కనిపించాయి. బోరున ఏడ్చాడు. స్వామీ.. ఇదీ నా అపరాధం అంటూ శ్రీచరణాల్ని ఆశ్రయించాడు. తొండమానుడి విన్నపాన్ని మన్నించి.. ఆ కుటుంబాన్ని బతికించాడు ఆశ్రితవత్సలుడు. 
 
ఎంత ఆత్మీయుడైనా తప్పు తప్పే.. శిక్ష అనుభవించాల్సిందే. దేవుడికి దూరం కావడమే భక్తుడికి అతిపెద్ద శిక్ష. అందుకే, ఇక నుంచి నీతోనే కాదు, ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడేది లేదని ప్రకటించి సాలగ్రామ స్వరూపాన్ని ధరించాడు శ్రీనివాసుడు. ఎన్ని సేవలున్నా.. తిరుమలేశుడి అభిమాన సేవ నిత్యాన్నదానమేనంటారు. రోజూ ఉదయం స్నపన మండపంలో కొలువు శ్రీనివాసుడు కొలువుదీరుతాడు. 
 
నాటి తిథీ నక్షత్రాల్నీ, ఉత్సవ విశేషాల్నీ ఆచార్యులు విన్నవిస్తారు. దాంతోపాటుగా ఆరోజు నిత్యాన్నదాన పథకం దాతల పేర్లు కూడా చదువుతారు. ఆ వివరాలు వింటున్నప్పుడు కొలుపు శ్రీనివాసుడి మోములో కొత్త మెరుపు.. వడ్డీకాసులవాడు.. కోరినవారికంతా, కాదనకుండా సిరిసంపదల్ని ప్రసాందిచేది.. పెంచుకోవడానికి కాదు.. తన ప్రసాదంలా నలుగురితో.. పంచుకోవడానికి.. అదే, శ్రీనివాసతత్వం.