శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2016 (12:07 IST)

తితిదే ఛైర్మన్‌ కార్యాలయంలో సేవా టిక్కెట్ల మాయాజాలం

తితిదే పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తాను ఛైర్మన్‌గా ఉన్నంతవరకు ఎలాంటి అపకీర్తి మూటకట్టుకోకుండా, వివాదాలకు తావు లేకుండా పదవీకాలం ముగించుకోవాలని ఎంతగానో తాపత్రపడుతున్నారు. ఆ మేరకు జాగ్రత్తగానూ ఉంటున్నారు. ఛైర్మన్‌ అయిన తరువాత ఎంతో ఓర్పుతో, నేర్పుతో వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన ఆశయం నెరవేరాలా లేదు. తన కార్యాలయ అధికారులే ఛైర్మన్‌కు కావాల్సినంత చెడ్డపేరు తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆయనకు అత్యంత దగ్గరగా ఉంటూనే ఏ మాత్రం అనుమానం రాకుండా దర్శనాల దళారులుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఛైర్మన్‌కు సన్నిహితుడైన ఓ ఐపీఎస్ అధికారి పేరు చెప్పి వందల కొద్దీ దర్శనాల టికెట్లు, సేవా టికెట్లు యధేచ్ఛగా మంజూరు చేయించుకున్న వైనంపై ప్రత్యేక కథనం.
 
తితిదే ఛైర్మన్‌కు ఐపిఎస్‌ అధికారి ఒకరు చాలా సన్నిహితుడు. ఆయన దర్శనానికి వచ్చినపుడు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తుంటారు. ఆయన చాలా సంతోషంగా వెళుతుంటారు. దీన్ని గమనించిన ఛైర్మన్‌ కార్యాలయ ఉద్యోగి ఒకరు తరచూ ఆయన పేరు చెప్పి టికెట్ల మంజూరు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఛైర్మన్ కార్యాలయం నుంచి వెళ్ళే సిఫారసు లేఖలకూ జెఈఓ కార్యాలయం నుంచే టికెట్లు కేటాయిస్తారు. సాధారణంగా ఛైర్మన్‌ కార్యాలయం నుంచి వచ్చిన అన్ని సిఫార్సు లేఖలకూ టికెట్లు మంజూరవుతుంటాయి. 
 
ఛైర్మన్‌ ఆఫీసులో కీలకంగా ఉండే ఉద్యోగి ఒకరు.. తరచూ ఆ ఐపిఎస్‌ అధికారి పేరు చెప్పి.. ఆయన సిఫార్పు చేసిన వాళ్ళంటూ టికెట్లు మంజూరు చేయించుకున్నట్లు సమాచారం. ఈ విధంగా ఎల్‌-1, ఎల్‌-2 టికెట్లు మాత్రమే వందల సంఖ్యలో తీసుకున్నట్లు తెలుస్తోంది. తోమాల, అర్చన టికెట్లు కూడా పెద్ద సంఖ్యలో మంజూరు చేయించుకున్నారని సమాచారం. ఇదంతా ఛైర్మన్‌కు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా సాగించారని చెబుతున్నారు. ఆ ఉద్యోగి ఛైర్మన్‌కు దగ్గరగా ఉండి పనిచేసే వారు కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు.
 
ఇటీవల ఛైర్మన్‌ కార్యాలయంలో కొన్ని బదిలీలు జరిగాయి. ఈ క్రమంలోనే ఛైర్మన్‌ కార్యాలయంలో జరుగుతున్న తంతును బాగా గమనించిన వారు ఎవరో అసలు విషయాన్ని ఐపిఎస్‌ అధికారి దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో హడావిడిగా ఆయన చదలవాడకు ఫోన్‌ చేసి మీ కార్యాలయంలో ఫలానా వ్యక్తి నా పేరు చెప్పి టికెట్లు తీసుకుంటున్నారట. కాస్త చూసుకోండి అని చెప్పారట. అప్పుడు రికార్డులన్నీ తనిఖీ చేయగా అది వాస్తవమేనని తేలింది. ఏయే తేదీల్లో ఎవరెవరి పేర్లతో ఏయే టికెట్లు మంజూరు చేయించుకున్నదీ జాబితా తయారు చేస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత ఛైర్మన్‌ కార్యాలయ ఉద్యోగులు ఛీ.. ఛీ... ఎంతపని చేశావురా అనుకుంటున్నారు.
 
ఇంటి దొంగలా వ్యవహరించిన ఆ ఉద్యోగిపై ఏమి చేయాలన్నదానిపై ఛైర్మన్‌ కార్యాలయం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. అతని వ్యవహారాన్ని విజిలెన్స్ అధికారుల దాకా తీసుకెళ్లి విచారణ జరిపించాలా.. అలా జరిపిస్తే తమకు చెడ్దపేరు వస్తుందా..అలాగని వదిలేయడం సమంజసమా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తర్భనభర్జనల వల్ల ప్రయోజనం లేదు. విజిలెన్స్‌తో లోతుగా విచారణ జరిపించి, అక్రమాలను బయటకు తీయాలి. బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పడు ఛైర్మన్‌గా చదలవాడకు మంచిపేరు కూడా వస్తుంది. తన కార్యాలయంలో జరిగిన అక్రమాలను కూడా సహించేది లేదన్న ఉన్నతమైన కీర్తి లభిస్తుంది. కేసు విచారణ బాధ్యతను విజిలెన్స్ కు అప్పగిస్తే టికెట్లు పొందిన వారి వివరాలు దీని ద్వారా ఎంత డబ్బులు చేతులు మారాయి. ఏయే టికెట్లకు ఎంత డబ్బులు ఇచ్చారు ఇలాంటి వివరాలన్నీ బయటకు రానున్నాయి.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో నమ్మకంతో చదలవాడకు పదవీకాలాన్ని మరో యేడాది పొడిగించారు. దీనికి రాజకీయ కారణాలు ఎన్ని ఉన్నా.. ఛైర్మన్‌గా ఆయన పనితీరు కూడా ఒక ప్రధాన కారణం. ఏడాది కాలంలో చదలవాడపై ఎలాంటి విమర్సలు, ఆరోపణలూ రాలేదు. నాకు ఇన్ని టికెట్లు కావాలి. అన్ని టికెట్లు కావాలి ని ఏ రోజూ అధికారులతో వివాదాలకూ పోలేదు. తాను చెప్పిందే జరగాలని భీష్మించి కూర్చోలేదు. అధికారులతోనూ సఖ్యతగా ఉంటూ సర్దుకుపోయేందుకు ప్రయత్నించారు చదలవాడ. 
 
ఈ నేపథ్యంలో ఇంటి దొంగలు టికెట్లు అమ్ముకున్న సంగతి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం దాకా చేరితే అప్పుడైనా ముఖ్యమంత్రికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావచ్చు. ఈ పరిస్థితి అవకాశం లేకుండా ఉండాలంటే అధికారికంగా విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఛైర్మన్‌ కార్యాలయమంతా గుప్పుమంటున్న ఈ వ్యవహారం ఇప్పటికే ఈఓకు, విజిలెన్స్‌కు చేరినట్లు సమాచారం. అయితే అధికారికంగా ఛైర్మన్‌ కార్యాలయం తీసుకునే నిర్ణయం బట్టే ఈఓ, విజిలెన్స్ చర్యలు ఉంటాయి. మరి చదలవాడ ఆ వ్యక్తిని వదిలేస్తారా...? శిక్షిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.!