శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 18 జులై 2016 (13:14 IST)

శివయ్య ఆలయం సెంట్రలైజ్డ్ ఏసీ - సాధ్యమేనా..?

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో సెంట్రలైజ్డ్ ఎసీ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శివయ్యను దర్శించుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్ధేశంతో ఆలయం లోపల చల్లగా ఉంచేందుకు చర్యలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో సెంట్రలైజ్డ్ ఎసీ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శివయ్యను దర్శించుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్ధేశంతో ఆలయం లోపల చల్లగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం స్వామి, అమ్మవార్ల అంతరాయాల్లో మాత్రమే శీతలీకరణ సౌకర్యం ఉంది. క్యూలైన్లలో వెళ్ళేటప్పుడు ఉక్కపోతతో కాస్త అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2 కోట్ల రూపాయలతో వ్యయంతో ఆలయంలో పలుచోట్ల ఎసీలు అమర్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆలయం అంతటా ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించకుండా ఉండేలా, అవసరమైన చోట ఎసిలు అమర్చనున్నారు. 
 
శ్రీకాళహస్తి ఆలయ ఆదాయం ఏటా పెరుగుతోంది. ఇప్పటికే రూ.80 కోట్లుగా ఉన్న వార్షిక ఆదాయం రూ.100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నది అధికారులు యోచనగా ఉంది. అందుకే ఆలయం లోపల ఉన్నప్పుడు ఉక్కపోతతో అసౌర్యం కలుగకుండా ఉండేందుకు ఎసిలు ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్‌ ఛార్జీల భారం పెరిగిపోతుంది కదా అని అడిగితే భక్తుల సౌకర్యం కోసం కాస్త భారమైనా భరించడంతో తప్పులేదని చెబుతున్నారు. అయితే ఈ సెంట్రలైజ్డ్ ఎసి పూర్తిస్థాయిలో అమర్చడం సాధ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
మరోవైపు పలు చర్యలతో విద్యుత్‌ను పొదుపు చేసేందుకు గతంలోనే ప్రణాళికలు సిద్థం చేశారు. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో విద్యుత్‌ పొదుపు చేయాలని, ఇందుకు ఎల్‌ఈడి బల్బులు వంటివి వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. శ్రీకాళహస్తి దేవస్థానం - ఆలయం , కాటేజీలు, దుకాణాలు.. అన్నింటికీ కలిపి నెలకు 1,50,000 యూనిట్లు విద్యుత్‌ వినియోగిస్తోంది. నెలకు రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల రూపాయల బిల్లు చెల్లిస్తోంది. శివరాత్రి జరిగే నెలలో విద్యుత్‌ బిల్లు రూ.15 లక్షల రూపాయల దాకా ఉంటోంది. అదే విధంగా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా తాత్కాలికంగా చేసే విద్యుత్‌ దీప అలంకరణలకు వాడే విద్యుత్‌ కోసం గుంగగుత్తగా రూ.4 లక్షల దాకా ఎస్‌పిడిసిఎల్‌కు విద్యుత్‌ బిల్లు చెల్లిస్తోంది. ఏడాది మొత్తంగా చూస్తే ఒకటిన్నర కోట్ల రూపాయల దాకా విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారు. 
 
ఆలయం మొత్తానికి ఎల్‌ఈడీ బల్లులు అమర్చడం ద్వారా విద్యుత్‌ పొదుపు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని బల్బులు మార్చారు. దాదాపు రూ.40 లక్షల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుత విద్యుత్‌ వినియోగంలో దాదాపు 40 శాతం ఆదా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎల్‌ఈడీ బల్బుల అమరికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఇంటికీ ఎల్‌ఈడీ బల్బులను రాయితీతో పంపిణీ చేస్తోంది. దేవాలయాలు, పెద్ద పెద్ద సంస్థలతో పాటు వ్యక్తిగతంగాను సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోమని ప్రోత్సహిస్తోంది.
 
ఆలయం ఆధ్వర్యంలో ఒక మెగావాట్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం చాలా నెలల క్రితమే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. భక్తకన్నప్ప గుడి వద్ద దీన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేవదాయ కమిషనర్‌  నుంచి అవసరమైన అనుమతులు వస్తే సోలార్‌ కంపెనీలు దీనిపై అధ్యయనం చేసి అంచనాలు రూపొందిస్తాయి. ప్రస్తుతం దేవస్థానం ఏడాదికి 18 లక్షల యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తోంది. ఒక మెగావాట్‌ అంటే 10 లక్షల యూనిట్లు సొంతంగా తయారు చేసుకుంటే 8 లక్షల యూనిట్లు మాత్రమే ఎస్‌పిడిసిఎల్‌ బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. 
 
అంటే విద్యుత్‌ బిల్లు సగానికిపైగా తగ్గిపోతుంది. అంటే యేటా 75 లక్షల దాకా మిగులుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది కూడా అదే. ఇలా ఆదా అయ్యే నిధులతో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం సూచిస్తోంది. పొదుపు చర్యలు పూర్తిచేయగలిగితే ఆలయంలో ఎసీలు ఏర్పాటు చేసినా విద్యుత్‌ ఛార్జీలు పెద్ద భారం కాబోవు. అందుకే సెంట్రల్‌ ఎసీ ఏర్పాటు చేసే ముందు ఎల్‌ఇడి బల్బుల అమరిక, సోలార్‌ విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుపై దృష్టి పెట్టాలి.
 
అయితే భక్తులు మరో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు ఏ పని మొదలుపెట్టినా సంవత్సరాల తరబడి చేస్తూనే ఉంటారన్న విమర్సలు లేకపోలేదు. కనీసం ఈ పనైనా సరిగ్గా చేస్తారన్న నమ్మకం కూడా లేదు.