శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (18:40 IST)

ఇతరుల ధనాన్ని కాజేశారో.. గోవిందా గోవిందా..!

కలికాలం అన్నట్లు.. భారీ స్థాయిలో అవినీతి సర్వసాధారణమైపోయింది. ఇతరుల నగదును, ఆభరణాలను దోచేసి తమ వరకు సంతోషంగా ఉంటే సరిపోతుందనే భావన చాలామందిలో ఉంది. అయితే ఇతరుల ధనాన్ని కాజేస్తే ఆధ్యాత్మిక పరంగా తీవ్రనష్టాలు.. కష్టాలు తప్పవని ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
జీవితంలో చాలా అవసరాలు ... విలాసాలు ధనంతోనే ముడిపడి ఉంటాయి. ధనాన్ని కలిగినవాళ్ల అవసరాలు చకచకా తీరిపోతుంటాయి. అయితే కష్టం విలువ తెలిసినవాళ్లు తమ అవసరాల పరిధిని తగ్గించుకుంటూ ఉన్నదాంట్లోనే సంతృప్తికరంగా జీవిస్తుంటారు. 
 
మరికొందరైతే.. తాము కోరుకున్న విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి దగ్గర మార్గాలను అన్వేషిస్తారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే వాళ్లు ఇతరుల ధనాన్ని అపహరించడానికి సిద్ధపడతారు.
 
ఒక్కో పాపానికి ఒక్కో ఫలితం ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతరుల ధనాన్ని అపహరించినందుకు కూడా తగిన ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది.
 
ఇతరుల సొమ్ము ఏ రూపంలో ఉన్నా అది లక్ష్మీదేవి స్వరూపంగానే చెప్పబడుతోంది కాబట్టి, అపహరించినవారిని ఆ దోషం వెంటాడుతూ ఉంటుంది. ఆ దోషం కారణంగా వాళ్లు లక్ష్మీదేవి కనికరానికి దూరమవుతారు. 
 
అనేక జన్మలపాటు దారిద్ర్యంతో నానాబాధలను అనుభవించవలసి వస్తుంది. అందుకే జీవితంలో ధర్మబద్ధమైన మార్గాన్నే ఎంచుకోవాలని అంటారు. ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా కష్టాన్నే నమ్ముకోవాలనీ ... దాని ఫలితాన్నే అనుభవించాలని పండితులు సూచిస్తున్నారు.