గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 27 అక్టోబరు 2016 (19:50 IST)

కార్తీక మాసం అక్టోబరు 31, పుణ్యం, ఆరోగ్యం, ఫలప్రదం.. ఏమేమి చేయాలంటే...?

ఈ నెల 31వ తేదీ నుండి పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కానుంది. కార్తీకమాసం కమనీయమైన ఆధ్యాత్మిక మాసం. అద్భుత మహిమలను అందించి ఆరోగ్యాన్ని అందిస్తుంది. దీపావళి తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసానికి చాలా ప్రత్యేకతలున్నాయి. స్కంద పురాణంలో

ఈ నెల 31వ తేదీ నుండి పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కానుంది. కార్తీకమాసం కమనీయమైన ఆధ్యాత్మిక మాసం. అద్భుత మహిమలను అందించి ఆరోగ్యాన్ని అందిస్తుంది. దీపావళి తర్వాతి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసానికి చాలా ప్రత్యేకతలున్నాయి. స్కంద పురాణంలో కార్తీకమాసం గురించి “స కార్తీక నమో మాసః నదేవం కేశవాత్పరమ్.. నబవేద సమం శాస్త్రం.. నతీర్థం గంగయాస్సమమ్..” అని పేర్కొన్నారు. అంటే కార్తీక మాసానికి సమానమైన నెల, కేశవునికి సమానమైన దేవుడు, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేదు అని దీనర్థం. దీనిని బట్టి కార్తీక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జీవులకు కల్యాణ శక్త్యాధికారి- ఆత్మపరాయణత్వమును - సర్వవిధ కల్యాణశక్తులను అందించి ఆపదలనుంచి రక్షించే పరమ శివుడు ఆరాధింపబడడమేగాక, పాలనా శక్తికి అధిష్ఠాత- సకల జీవులను సంరక్షించి, ప్రాణాలను అందించే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీకమాసం. ఈ మాసం శివకేశవులకు ప్రీతిపాత్రమై జన్మజన్మాంతర పాపాలను దహింపజేస్తుంది. స్నానాలకు- దీపాలకు- దానాలకు ప్రసిద్ధి చెందిన దీప పవిత్రమాసం.
 
ఈ శరదృతువులో చంద్రుడు పుష్టితో వుండి తన చల్లని కిరణాల ద్వారా సకల జీవులకు ధీశక్తిని ప్రసాదిస్తాడు. ఈనెల అంతా చల్లని నీటితో స్నానాలు- దీపదానాలు- పలు ఇతర దానాలూ జపం- ఉపవాసం వనభోజనాలవంటివి సంప్రదాయ బద్ధంగా చేస్తూ వుంటారు. ఈనెలలో శ్రీమహావిష్ణువును తులసి – జాజి పూవులతోను, మహాదేవుడైన పరమ శివుని మారేడు దళాలతోనూ- జిల్లేడు పూవులతోనూ పూజించాలని శాస్త్రం చెబుతుంది.  మహేశ్వరునికి సోమవారం అత్యంత ప్రీతికరంగా వున్న ఈ నెలలోని అన్ని సోమవారాలు ఉపవసించడం మేలనీ, వనభోజనాలు చేయాలనీ శాస్త్రం చెబుతుంది. రకరకాల వృక్షాలున్న ప్రాంతంలో ఉసిరిక చెట్టును పూజించాలనీ, దాని క్రిందనే కూర్చుని, పనస ఆకులలోగానీ, పనస ఆకుల విస్తర్లలోగానీ భోజనం చేయాలి. సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానాలు ఆచరించాలి. నదీ స్నానం లభ్యం కాకుంటే అందుబాటులోనున్న జలాలతో స్నానం చేయాలి. 
 
ఈ నెలలో ఏ సత్కార్యం చేసినా సరే ‘కార్తీక దామోదర ప్రీత్యర్థం’ అని ఆచరించాలని శాస్త్రం. ఋతు పరివర్తనలవల్ల వాతావరణంలో వచ్చే మార్పులను దృష్టిలో వుంచుకొని శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాలకూ- వాటికీ వున్న సంబంధం ఎంతో వైజ్ఞానిక దృష్టితో పరిశీలించి తెలుసుకోవాలి. ఈ మాసం మానసిక శారీరక రుగ్మతలను పోగొట్టి ఆయుష్షును - ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం కార్తీకంలో ప్రముఖ స్థానం పొందినది. 
 
నదీ జలస్నానం విశేషవంతమైనదిగాన ఈ మాసం ఉషఃకాలంలో చేసే స్నానం మంత్రపూతమైనది. “తూలారాశిం గత సూర్యే- గంగాత్రైలోక్య పావనీ, సర్వత్ర ద్రవరూపేణ సా - సంపూర్ణ భవేత్తదా” ఈ మంత్రం పఠిస్తూ ప్రవాహానికి ఎదురుగానూ, వాలుగానూ తీరానికి పరాజ్ఞఖంగా స్నానం చేయాలి. విష్ణు సంబంధంగా అరుణోదయ వేళలో విష్ణు సన్నిధిలో విష్ణువును కీర్తించే పాటలను చేయాలనీ శాస్త్రం. ఆ కీర్తనలకు వాయిద్యం వాయించేవానికి వాజపేయ యజ్ఞఫలం నర్తించేవానికి సకల తీర్థ స్నాన ఫలం అర్చనా ద్రవ్యాలనందించేవారికి అన్ని ఫలాలూ దర్శనాదులు చేసేవారికి ఎంతో ఫలం దక్కుతుంది. శివ విష్ణు ఆలయాలలో భగవద్ధ్యానం, స్తోత్రం, జపం చేయడం వేల గోవుల్ని దానం చేసిన ఫలం లభిస్తుంది. శివకేశవులకు ఇష్టమైన మాసంలో స్త్రీలు తులసి చెట్టు ముందు దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజ చేస్తారు. ఈ మాసంలో కృత్తికల్లో చంద్రుడు పూర్ణుడై వుంటాడు గాన చంద్రవౌళి అనుగ్రహాన్ని పొందుటకు అభిషేక ప్రియుడైన శివుణ్ణి ఆరాధించాలి.
 
ఏకాదశి, ద్వాదశి తిథులల్లో శివార్చన ఈతిబాధలను గ్రహదోషాలను పోగొడుతుంది. వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీకమాస మహిమను- తులామాస విశిష్టతను, పద్మనాభుడైన విష్ణువును ఉద్దేశించి కార్తీక వ్రతం చేయమని తెలిపాడు. పురాణ ప్రవచనం చేయాలని బోధించాడు. కార్తీక ఏకాదశి నుండి పూర్ణిమ వరకు ఐదు రోజుల దీక్షగా శివ విష్ణు ఆరాధన చేయడం సర్వశ్రేష్ఠం. దీనినే భీష్మ పంచకవ్రతం అని అంటారు. శివ-విష్ణు మంత్రములు పొందిజపంచేస్తే ఉత్కృష్ట ఫలాన్ని అందుకోవచ్చు. హరిసన్నిధిలో కార్తీకమాసాన దీపమాలికా సమర్పణము సర్వపాపహరణం. శివసన్నిధిలో దీపదాన పుణ్యముతో జ్ఞానాభివృద్ధి తద్వరా ముక్తి లభిస్తుంది.
 
శివనామస్మరణ చేస్తూ వత్తులను తయారుచేసి ఈ మాసంలో ఐదు రోజుల్లో ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు తులసీ వివాహం, వైకుంఠ చతుర్దశినాడు ఉసిరి చెట్టుకింద దీపారాధన చేస్తారు. విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా చెప్పుకునే పౌర్ణమిన భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. 
 
కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్లున్న వనంలో సమారాధన చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కార్తీకమాసంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తారు. ఊబకాయం నుంచి కాస్త ఊరట లభిస్తుందని చెబుతారు. శరీరంలో అన్ని అవయవాలూ చైతన్యవంతంగా పనిచేస్తాయంటారు. అన్నానికి బదులు పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కార్తీకమాసంలో శివుడు, అయ్యప్ప, ఆంజనేయ, వేంకటేశ్వర, భవానీ మాల ధరిస్తుంటారు. నియమనిష్టలతో గడుపుతారు. మంచి ఆహార నియమాలు పాటిస్తూ అర్చనలు, భజనలు చేస్తారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి వెళ్లి అర్చకులు ఇచ్చే తీర్థం సేవిస్తుంటారు. పచ్చకర్పూరం, స్పటిక, తులసి, కొబ్బరినీళ్లు, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిని ఈ తీర్థం తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
 
కార్తీకమాసంలో మహిళలు రోజూ అలుకు జల్లి, స్నానం చేసి, తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అలుకు కోసం వాడే పేడ యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రిస్తుంది. ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్య మున్న తులసిమొక్క చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు పీల్చేగాలి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, గొంతు వ్యాధులు దరి చేరకుండా చూస్తుంది. సూర్యోదయంలోగా స్నానం చేస్తే రక్తప్రసరణ మెరుగై, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చలికాలంలో సాధారణంగా మనిషిలో బద్దకం పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదై శరీరం మొద్దుబారుతుంటుంది. ఇలాంటి పరిస్థితులను తట్టుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు కార్తీకమాసంలో పాటించే అలవాట్లు దోహదపడుతాయి. మహిళలు తెల్లవారుజామునే లేచి, పసుపు రాసుకుని, చన్నీటి స్నానం చేసి, తులసిమొక్కకు పూజలు చేయడం ఓ రకంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్పాహారం, మధ్యాహ్నం మితభోజనం, రాత్రికి పండ్లు, పాలు తీసుకోవడం కూడా ఆరోగ్యదాయక నియమాలేనని పండితులు పేర్కొంటున్నారు.