శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (18:53 IST)

ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం కృష్ణుడితో అర్జునుడి యుద్ధం!

అర్జునుడు మాట తప్పనివాడు. ఒకసారి అర్జునుడు ధ్యానాన్ని పూర్తి చేసుకుని తన మందిరానికి బయలుదేరబోతూ వుండగా అక్కడికి 'గయుడు' అనే గంధర్వ రాజు వస్తాడు. వస్తూనే అనేక విధాలుగా అర్జునుడి శౌర్య పరాక్రమాలను, సుగుణాలను ప్రస్తుతిస్తూ పాదాలపై పడతాడు. తనకి రక్షణగా నిలుస్తానని మాట ఇస్తే తప్ప అక్కడి నుంచి కదిలేదిలేదని అంటాడు.
 
దాంతో తాను ఉండగా అతని ప్రాణాలకు వచ్చే భయమేమీ లేదని అర్జునుడు మాట ఇస్తాడు. తాంబూలం సేవిస్తూ తాను ఆకాశ మార్గాన పుష్పక విమానంలో ప్రయాణిస్తూ ఉన్నాననీ, ఆ తాంబూలాన్ని ఉమ్మివేయగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తోన్న శ్రీకృష్ణుడి దోసిట్లో పడిందని గయుడు చెబుతాడు. తనని సంహరిస్తానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేయగా భయంతో శరణు కోరి వచ్చానని అంటాడు.
 
అసలు విషయం తెలుసుకున్న అర్జునుడు నివ్వెరపోతాడు. బంధువు ... భగవంతుడు అయిన కృష్ణుడితో యుద్ధం చేయవలసి ఉంటుందనే విషయం ఆయనకి అర్థమై పోతుంది. అయినా ఇచ్చిన మాటకి కట్టుబడి గయుడి పక్షాన నిలుస్తాడు. అహంకారంతో ప్రవర్తించిన గయుడిని అర్జునుడు వెనకేసుకు రావడం కృష్ణుడికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది.
 
కృష్ణుడి పట్ల ప్రేమానురాగాలు ... గౌరవము ఉన్నప్పటికీ, గయుడికి ఇచ్చిన మాట కోసం అర్జునుడు యుద్ధరంగంలోకి దిగుతాడు. ఇద్దరి మధ్య యుద్ధం పతాకస్థాయికి చేరుకుంటూ వుండగా, బ్రహ్మాది దేవతలు వచ్చి వాళ్లని శాంతింపజేస్తారు. గయుడిని క్షమించిన కృష్ణుడు, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం కోసం, తనతో బంధుత్వాన్ని కూడా పక్కనబెట్టి యుద్ధం చేసిన అర్జునుడిని అభినందిస్తాడు.