బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 25 జనవరి 2018 (21:10 IST)

శ్రీకృష్ణ పరమాత్మనే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన కర్ణుడి దానం....

ఒకసారి కర్ణుడు తన ఇంటి ఆవరణలో నూనెతో తలంటుకుంటున్నాడు. వజ్రవైఢూర్యాలు పొదిగిన పాత్రలో నూనె ఉంది. అదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడి ఇంటికి వచ్చాడు. కృష్ణడి రాకను గమనించి ప్రణామాలు తెలిపాడు కర్ణుడు. అతడి పక్కనే ఉన్ననూనె ఉంచిన పాత్రను చూడగానే.... కృష్ణడిక

ఒకసారి కర్ణుడు తన ఇంటి ఆవరణలో నూనెతో తలంటుకుంటున్నాడు. వజ్రవైఢూర్యాలు పొదిగిన పాత్రలో నూనె ఉంది. అదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడి ఇంటికి వచ్చాడు. కృష్ణడి రాకను గమనించి ప్రణామాలు తెలిపాడు కర్ణుడు. అతడి పక్కనే ఉన్ననూనె ఉంచిన పాత్రను చూడగానే.... కృష్ణడికి ముచ్చటేసింది. కర్ణా నాకు ఈ నూనె పాత్ర ఎంతో నచ్చింది. దానిని నాకు దానమివ్వు అని అడిగాడు కృష్ణుడు. 
 
పరమాత్మా... మీరు అడగాలే కానీ, ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధం అంటూ వెంటనే నూనె పాత్రను కృష్ణడికి దానం ఇచ్చేశాడు. కుడి చేతికి నూనె ఉండటం వల్ల ఎడమ చేతితో దానమిచ్చాడు కర్ణుడు. ఇది గమనించిన కృష్ణుడు కర్ణా.. ఇలా వామ హస్తంతో దానం ఇవ్వడం మంచి పద్ధతి కాదని నీకు తెలియదా అని ఆక్షేపించాడు. దానికి కర్ణుడు కృష్ణా... ఈ జీవితం క్షణభంగురం. లిప్తపాటులో మృత్యువు దాపురించవచ్చు. పైగా ఈ చిత్తం మాయామోహ వలయంలో చిక్కుకుని ఉంటుంది. ఈ క్షణంలో అనుకున్నది మరుక్షణంలో మాయ చేసి మార్చివేస్తుంటుంది.
 
నా కుడి చెయ్యి నూనెతో ఉంది. కడుక్కొని వచ్చి దానమిచ్చేలోపు ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు. పైగా ఈలోపు దానమివ్వాలన్న నా ఆలోచన కూడా మారిపోవచ్చు. నా సంకల్పంలో మార్పు రాకముందే దానమివ్వాలనుకున్నా. అందుకు మీరడిగిన వెంటనే నూనె పాత్ర దానం చేశాను. అంతేగాని ఎడమ చేతితో దానం ఇవ్వకూడదని తెలియక కాదు అన్నాడు. కర్ణుడి దానశీలతకు కృష్ణ పరమాత్మ ఆశ్చర్యపోయాడు. అతణ్ణి మనసారా ఆశీర్వదించి దానం తీసుకున్నాడు.
 
దానధర్మాలు, మంచిపనులు అనుకున్న వెంటనే చేయాలి. జీవితం క్షణభంగురమని గుర్తెరిగి ధర్మకార్యాలను వాయిదా వేయకుండా సంకల్పం అయిన వెంటనే ఆచరించాలి. అప్పుడే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది.