బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: శనివారం, 31 డిశెంబరు 2016 (21:59 IST)

ప్రతి సంక్రాంతికి శ్రీవారు సన్నిధిగొల్లల ఇంటికి వెళతారు

తిరుమల వెంకన్న లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారి లీలలు చెప్పుకుంటూ పోతే ఒక చరిత్ర సరిపోదని మన పెద్దలే చెబుతుంటారు. స్వామివారికి గొల్లలు (యాదవులు) అంటే ఎంతో ఇష్టం. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే స్వామివారి ఆలయం ముందు గొల్లమండపం ఉందంటే ఆయ

తిరుమల వెంకన్న లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారి లీలలు చెప్పుకుంటూ పోతే ఒక చరిత్ర సరిపోదని మన పెద్దలే చెబుతుంటారు. స్వామివారికి గొల్లలు (యాదవులు) అంటే ఎంతో ఇష్టం. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే స్వామివారి ఆలయం ముందు గొల్లమండపం ఉందంటే ఆయనకు వారంటే ఎంత ఇష్టమో ఇట్టే అర్థమైపోతుంది.
 
స్వామివారు ప్రతియేటా సంక్రాంతికి సన్నిధి గొల్లల ఇంటికి వెళ్ళేవారని పురాణాలే చెబుతున్నాయి. స్వామివారు సంక్రాంతి అయిందంటే చాలు పంచాయుధాలు ధరించి పారువేటకు బయలుదేరి ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న పారువేట మండపానికి వెళ్ళి వేటలో పాల్గొంటాడు. మరొక పల్లకీపై తానే క్రిష్ణుణ్ణి అంటూ వెన్నెముద్ద క్రిష్ణునిగా వూరేగుతూ పారువేట మండపానికి స్వామి వేంచేస్తాడు. అక్కడ పారువేట వేడుకలన్నీ అయిన తరువాత ఆ దగ్గరలోనే ఆ తోటలోనే విడిది చేసిన సన్నిధి గొల్ల స్థావరానికి శ్రీనివాసుడు స్వయంగా వెళ్ళి ఆ గొల్లలు నివేదించిన పాలు, వెన్నె పండ్లు స్వీకరించి వారికి తాంబూలాన్ని చందన శటారులను స్వామి అనుగ్రహిస్తాడు.
 
ఇలా శ్రీనివాసుడు ఎప్పుడు పారువేటకు వచ్చినా ఆ అన్ని సమయాల్లనూ సన్నిధి గొల్లను సత్కరిస్తూ ద్వాపరయుగంలో ఆ గొల్లలతో తనకున్న స్నేహబంధాన్ని, ప్రేమ బంధాన్ని చాటుకొంటూ ఉన్నాడు. ఆనాటి అమాయక గొల్లల ప్రేమపాశానికి బద్ధుడైన స్వామి ఎంతటి భక్త ప్రియుడో..ఎంత భక్త వత్సలుడో..మనకు సుస్పష్టమవుతుంది.