గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2016 (12:40 IST)

తిరుమల శ్రీవారి ఆలయంలో అతి పురాతన అంకురార్పణ మండపం...

తిరుమల శ్రీవారి వంటశాలకు ఎదురుగా బంగారు బావికి దక్షిణంగా ఉన్నదే అంకురార్పణ మండపం. మండపంలోనే శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి సంవత్సరం పదినాళ్ల పాటు జరిగే బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అంకురార్పణ జ

తిరుమల శ్రీవారి వంటశాలకు ఎదురుగా బంగారు బావికి దక్షిణంగా ఉన్నదే అంకురార్పణ మండపం. మండపంలోనే శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి సంవత్సరం పదినాళ్ల పాటు జరిగే బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అంకురార్పణ జరుగుతుంది.
 
అంకురార్పణ అంటే బీజావాపం అని అంటారు. నవధాన్యాలు విత్తులుగా చల్లి వాటిని మొలకెత్తింపజేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి శుభకార్యానికి ఉత్సవానికి నాందిగా జరిగే వైదిక ప్రక్రియ అంకురార్పణం. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి ముందురోజు అనగా బంగారు ధ్వజస్థంభంపై ధ్వజారోహణ జరిగే రోజుకు ముందురోజు సాయంత్రం శ్రీస్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారి ఆధ్వర్యంలో ఈ మండపంలో అంకురార్పణ జరుగుతుంది.
 
ముందుగా బంగారు వాకిలిలోపల ఉన్న రాముల వారి మేడలోని విష్వక్సేన, గరుడ, అనంతుల పంచలోహ ఉత్సవ మూర్తులను ఈ మండపంలో వేంచేస్తారు. తర్వాత విష్వక్సేనుల వారి ఆధ్వర్యంలో మత్సగ్రహణ యాత్ర జరుగుతుంది. శ్రీవారి ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంతోత్సవ మండపానికి శ్రీ విష్వక్సేనుల వారు, శ్రీ సుదర్శన, అనంత, గరుదులతో కలిసి ఛత్ర చామర బాజా భజంత్రీలతో వేదపారాయణాలతో ఊరేగింపుగా వెళతారు. వసంత మండపంలో మృత్సంగ్రహణ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా గుద్దలి, పార వంటివి ఆయుధపూజ, పుట్టకు పూజ తదితరాలు వైదిక శాస్త్రోక్తంగా జరిగిన తర్వాత పుట్టమన్నును సేకరిస్తారు. తర్వాత ఆ పుట్టమన్నుతో విష్వక్సేనుల వారి ఊరేగింపు ప్రదక్షిణంగా మహాప్రదక్షిణ మార్గంలో సాగి శ్రీవారి ఆలయంలో ప్రవేశించడంతో పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ అంకురార్పణ మండపంలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నవధాన్యాల భీజావాపం జరుగుతుంది.
 
ఈ కార్యక్రమం జరిగిన తర్వాత బ్రహ్మోత్సవాలు జరిగే పదిరోజుల పాటు అనంత గరుడ విష్వక్సేనుల వారు ఈ అంకురార్పణ మండపంలోనే కొలువై ఉంటారు. ఇలా బ్రహ్మోత్సవాలలో మాత్రమే కాకుండా సంవత్సరానికి ఒకసారి జ్యేష్ట మాసంలో మూడురోజుల పాటు జరిగే జ్యేష్టాభిషేకానికి ముందు శ్రావణ మాసంలో శ్రవణానక్షత్రం రోజున జరిగే శ్రీవారి పుష్పయాగోత్సవానికి ముందురోజు సేన మొదలియార్‌ అయిన విష్వక్సేనుల వారి పర్యవేక్షణతో పైన వివరించ విధంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. అందువల్లే అది అంకురార్పణ మండపంగా పేరొందింది.
 
మరో ప్రధానమైన విశేషమేమిటంటే బంగారు వాకిలి లోపల రాముల వారి మేడలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి నిత్యసూరులన అనంత, విష్వక్సేన గరుడుల విగ్రహమూర్తులు, అలాగే శ్రీరాముల వారి పరివార దేవతలైన సుగ్రీవుడు, అంగదుడు, ఆజ్ఞాపాలక ఆంజనేయస్వామి విగ్రహూర్తులు ప్రస్తుతం ఈ అంకురార్పణ మండపంలోనే భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు.