శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By JSK
Last Modified: ఆదివారం, 26 జూన్ 2016 (13:05 IST)

ఇక శ్రీవారి తొలి ద‌ర్శ‌న భాగ్యం వారికి లేదా?

శ్రీవారి ఆలయంలో మొదటి దర్శన భాగ్యం వారిదే. కానీ ఇప్పుడు టిటిడి నిర్ణయంతో... అసలు దర్శనభాగ్యమే లేకుండా పోతుంది ఆ కుటుంబానికి. వారే తరతరాలుగా శ్రీవారి ఆలయ ద్వారాలను తెరిచే సన్నిధి గొల్ల కుటుంబీకులు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం సుప్రభాత సేవకు అర్చకులను

శ్రీవారి ఆలయంలో మొదటి దర్శన భాగ్యం వారిదే. కానీ ఇప్పుడు టిటిడి నిర్ణయంతో... అసలు దర్శనభాగ్యమే లేకుండా పోతుంది ఆ కుటుంబానికి. వారే తరతరాలుగా శ్రీవారి ఆలయ ద్వారాలను తెరిచే సన్నిధి గొల్ల కుటుంబీకులు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం సుప్రభాత సేవకు అర్చకులను తోడ్కోని వచ్చేది సన్నిధి గొల్ల కుటుంబీకులే. వంశపార్యంపరంగా కొనసాగుతున్న సంప్రదాయానికి చెక్ పెట్టేలా టిటిడి వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సన్నిధి గొల్ల కుటుంబీకులు.
 
టిటిడిలో మరో వివాదం మొదలైంది... శ్రీవారి ఆలయంలో వంశపార్యంపరంగా సేవలందిస్తున్న సన్నిధి గొల్లలను సాగనంపే దిశగా అడుగులు వేస్తోంది టిటిడి. దీంతో ఎన్నో ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో మొదట దర్శన భాగ్యం చేసుకుంటున్న తమ కుటుంబానికి టిటిడి అన్యాయం చేస్తోందని వాపోతున్నారు సన్నిధి గొల్ల వంశీయులు. ఈ వివాదంపై ఒకపక్క కోర్టును ఆశ్రయించడంతో పాటు మరోవైపు టిటిడిపై ఒత్తిడి తెచ్చేలా అడుగులు వేస్తున్నారు సన్నిధి గొల్ల వంశీకులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి కార్యక్రమం సంప్రదాయాలకు అనుగుణంగానే నిర్వహిస్తారు. 
 
ఇప్పటికీ పురాతన కాలంలో నిర్ధేశించిన విధంగా స్వామివారి ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణ జరుగుతుంది. ఆలయ పూజా కైకంకర్యాలకు సంబందింఛి అర్చకులు, జియ్యర్లు, ఆచార్య పురుషులు, అన్నమాచార్య వంశీకులతో పాటు సన్నిధి గొల్ల కుటుంబం పాత్ర ప్రతి నిత్యం ఉంటుంది. అసలు శ్రీవారిని ప్రతి నిత్యం ముందుగా దర్శించుకునే భాగ్యం సన్నిధి గొల్ల కుటుంబ సభ్యుడిదే. ఈ అవకాశం సన్నిధి గొల్ల కుటుంబీకులకు రావడానికి.. చారిత్రక ఆధారాలు వున్నాయి. స్వామివారు లక్ష్మి అమ్మవారిని వెతుక్కుంటూ... భూలోకాని విచ్చేసిన సమయంలో పుట్టలో వుంటారు. స్వామివారి ఆకలిని తీర్చడానికి బ్రహ్మ పరమేశ్వరులు ఆవు, దూడ రూపంలో వస్తారు. 
 
పశువుల కాపరి వీటిని అడవికి తీసుకువెళ్ళిన సమయంలో ఆవు తన పాలను శ్రీవారికి అందిస్తుంది. ఇది గమనించిన పశువుల కాపరి ఆవును కొట్టబోయి శ్రీవారిని గాయపరుస్తారు. భూలోకంలో శ్రీవారిని మొదటగా చూసింది యాదవుడే కాబట్టి..... అప్పటి నుండి ప్రతిరోజు తన మొదటి దర్శనం వారికే అన్న వరాన్ని ఇచ్చారని చెబుతారు. ఆ సంప్రదాయమే ఇప్పటికి శ్రీవారి ఆలయంలో కొనసాగుతోంది. అందులో భాగంగానే సన్నిధి గొల్లకుటుంబానికి వంశ పారంపర్యంగా ఈ అవకాశాన్ని కల్పించారు. రాజులు.. బ్రిటిష్... మహంతుల కాలం నుండి కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. 
 
శ్రీవారి ఆలయంలో వేకువజామున 2.30 నిముషాలకు అర్చకులను తీసుకుని ఆలయ ద్వారాలు తీస్తారు సన్నిధిగొల్ల. దివిటీలతో దీపాలను వెలిగించి ముందుగా స్వామివారిని దర్శించుకున్న తరువాత సుప్రభాత సేవ మొదలవుతుంది. దాని తర్వాత  శ్రీవారికి పూజా కైంకర్యాలును నిర్వహిస్తారు. తిరిగి ఉదయం, రాత్రి వేళల్లో నైవేద్య సమయంలోనూ అర్చకులను సన్నిధి గొల్ల తోడ్కోని వస్తారు. ఇక రాత్రి వేళ శ్రీవారి ఏకాంత సేవ పూర్తి అయిన తరువాత ఆలయానికి తాళాలు వేసి జియ్యంగార్లు భద్రపరుస్తారు. ఇలా శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు అను నిత్యం జరుగుతుంటాయి. 
 
కానీ  1996లో రాష్ట్ర ప్రభుత్వం మిరాసీ విధానాన్ని రద్దు చేసింది. అప్పటి వరకు అర్చకులు, సన్నిధి గొల్లకుటుంబాలకు ఉన్న హక్కులు కోల్పోయారు. దీంతో సన్నిధి గొల్లలను ఉద్యోగులుగా మార్చేసింది టిటిడి. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా... తాజాగా అర్చకులు తరహాలో 65 సంవత్సరాలు దాటింది కాబట్టి.... పదవీ విరమణ చెయ్యాలంటూ... వారిని ఆదేశించింది టిటిడి. వంశపార్యంపరంగా కొనసాగుతున్న తమను అనుకోని విధంగా నెల రోజులు కూడా గడువు ఇవ్వకుండా ఈ నెల చివరి నాటికి పదవీ విరమణ చెయ్యమని ఆదేశించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సన్నిధి గొల్ల కుటుంబీకులు. 
 
గతంలో అర్చకులకు సంబంధించి మిరాసీ వ్యవస్థ రద్దవడంతో వారు కోర్టుకెక్కారు. ఈ వివాదం కొనసాగుతూనే వుంది. ఈ  సమయంలో... రాష్ట్ర ప్రభుత్వం మధ్యే మార్గంగా 2006లో అర్చక కుటుంబీకులకు వంశపార్యంపర హక్కులు కల్పించింది. దీంతో  వివాదం సద్దుమణిగిందని  అనుకుంటున్న తరుణంలో... తిరిగి అర్చకులకు 65 సంవత్సరాల వయోపరిమితిని విధించారు. దీనిపైనా అర్చకులు కోర్టు కెళ్లడంతో తిరిగి వెనక్కి తగ్గిన టీటీడీ , చివరికి వారు సాగినన్ని రోజులు కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. తాజాగా సన్నిధి గొల్లలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. వంశపారంపర్యంగా కొనసాగుతున్న వారిని సాగనంపేలా టీటీడీ ప్రయత్నం చేస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.