శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (15:54 IST)

సీతానగరంలోని హనుమంతునికి పానకమంటే మహాప్రీతి!

లక్ష్మీ నరసింహ స్వామికి పానకం అంటే ప్రీతికరం. ఇదే విధంగా హనుమంతుడు పానకం తాగే ఆలయం కూడా సీతానగరంలో ఉంది. గుంటూరు జిల్లా కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ ఆలయం హనుమంతుడు ఆవిర్భవించిన విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా  అలరారుతోంది. ఈ ఆలయంలో హనుమంతుడు స్వయంభువుగా ఆవిర్భవించాడు.
 
సీతారాములకి ... ఈ ప్రదేశానికి ఏదో సంబంధం ఉండివుంటుందనీ, అందువల్లనే హనుమంతుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించాడని స్థానికులు అంటుంటారు
 
ఇక్కడి స్వామికి పానకమంటే ప్రాణమట. తమ కోరికలు నెరవేరితే స్వామివారికి పానకం సమర్పిస్తామని భక్తులు మొక్కుకుంటూ వుంటారు. అలా కోరికలు నెరవేరిన వారు స్వామివారికి శంఖంతో పానకం సమర్పిస్తూ వుంటారు. 
 
శంఖంతో స్వామివారికి పానకం సమర్పించిన ప్రతిసారి, అందులో సగం పానకాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తూ వుండటం విశేషం. అలా స్వామివారు వదిలిన పానకాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తూ వుంటారు. 
 
విశేషమైన పర్వదినాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. హనుమంతుడిని దర్శించడం వలన గ్రహ సంబంధమైన పీడలు ... అనారోగ్యం వలన కలిగే బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.