గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2015 (14:44 IST)

శ్రావణమాసం.. శుభప్రదం.. మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం

మహిళలు అత్యంత పవిత్రంగా భావించే మాసం శ్రావణమాసం. ఈ మాసంలో వ్రతాలు, పూజలు, ఉపవాసాలు నిష్ఠగా చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయని నమ్మకం. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం, గౌరీవ్రతం, నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్ణమి వంటి పర్వదినాలు ఉన్నాయి. ఈ నెలంతా మాంసాహారం భుజించరు. మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం.


ఈ మాసంలో పూజలు, వ్రతాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని ప్రతి ఒక్కరూ నమ్మకం. ఈ మాసంలోనే ఎక్కువ శుభకార్యాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు మంగళ, శుక్రవారాల్లో మంగళగౌరీ నోములు చేస్తుంటారు. సోమ, గురు, శనివారాల్లో ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణమాసానికి ముందు వివాహం చేసుకున్న నూతన దంపతులు పుట్టకు పాలుపోసి పూజలు చేస్తారు. 
 
శ్రావణ మాసంలోనే అనేక పర్వదినాలు వస్తుంటాయి. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన మంగళగౌరీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తారు. దాంపత్య జీవితం నిండు నూరేళ్ళు సౌభాగ్యవంతంగా ఉండాలని, మంచి సంతానం కలగాలని, నూతన వధూవరులు ఈ వ్రతాన్ని చేస్తారు. 19న నాగుల పంచమి. దీన్ని శ్రావణశుద్ధ పంచమిరోజున నిర్వహిస్తారు. ఈ రోజన పుట్టలో పాలుపోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
 
ఆగస్టు 28వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చేది. అష్టైశ్వర్యాలు ప్రసాదించి సౌభాగ్యంతో వర్థిల్లాలని కోరుకునే వారు శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆగస్టు 29వ తేదీన రక్షాబంధన్. సోదరీ.. సోదరీమణుల బంధానికి ప్రతీకగా ఈ పండుగ నిర్వహిస్తారు.