బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (18:26 IST)

హనుమంతునిచే రాముడి వర్ణన : రాముడిని తప్ప మరే పురుషుడిని స్పృశించను..!

అశోక వనములో సీతాదేవిని గాంచిన హనుమంతుడు రాముడిని ఈ విధంగా వర్ణించాడు. ''రాముని కండ్లు పద్మముల రేకుల వలె విశాలమైనవి. సమస్తమైన ప్రాణుల మనస్సును ఆకర్షించు సౌందర్యము రాముడిది. పుట్టుకతోనే మంచి రూపంతోను, దాక్షిణ్యముతోను జన్మించినాడు. తేజస్సుచేత సూర్యునితోను, ఓర్పుచేత భూమితోను, బుద్ధిచేత బృహస్పతితోను, కీర్తిచేత దేవేంద్రునితోను సమానుడు. 
 
శత్రుసంహారకుడైన రాముడు ప్రపంచములోని ప్రాణులందరినీ, విశేషముగా తనవారిని, తన నడవడికను, ధర్మమును బాగుగా రక్షించుచుండును. రాముడు ఈ సమస్త ప్రపంచమును, నాలుగు వర్ణములవారిని రక్షించుచుండును. ఏ పనిచేసినా ఎట్టి ఫలితము కలుగునో ఊహించగలడు. రాజనీతిని చక్కగా అభ్యసించినవాడు. విద్యాశీల సంపన్నుడు. వినయవంతుడు. అన్ని వేదములు చక్కగా అధ్యయనము చేసినవాడు అని రాముని గుణాలు వర్ణించిన తర్వాత హనుమంతుడు రాముని శరీర సౌందర్యాన్ని వర్ణిస్తాడు. 
 
రాముని శరీర సౌందర్య వర్ణన : 
రాముని భుజములు విశాలమైనవి. బాహువులు దీర్ఘమైనవి. కంఠము శంఖాకారములో వుండును. ముఖము మంగళప్రదమైనది. మూపుసంధి ఎముకలు పైకి కనబడవు. సుందరమైన అతని నేత్రములు ఎర్రగా నుండును. రాముని కంఠధ్వని దుందుభి ధ్వనివలె గంభీరముగా వుండును. రంగు నిగనిగలాడుచుండును. అతని అవయవములన్నీ సమముగా విభక్తములై వుండును. అతని శరీరచ్ఛాయ శ్యామము (చామన), రాముని వక్షస్థలము, ముంజేయి, పిడికిలి విస్తారముగా వుండును. అతని కనుబొమ్మలు, ముష్కములు, బాహువులు దీర్ఘములు, కేశములు, చేతులు, మోకాళ్ళు హెచ్చుతగ్గులు లేకుండా వుండును. నాభి కడుపు క్రింది భాగముస వక్షస్థలము పొడవుగా నుండును. నేత్రాంతములు, గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు ఎర్రగా వుండును. పాదరేఖలు, కేశములు నున్నగా వుండును. కంఠధ్వని, నడక, నాభి గంభీరముగా ఉండును. రాముని ఉదరముపై మూడు ముడతలున్నవి. అతని తలపై మూడు సుళ్లు ఉండును. అతడు తొంభైయారు అంగుళముల ఎత్తు వుండును. అతని పెదవులు, గడ్డము, ముక్కు చాలా అరుదుగా ఉండును.'' (V. 35, 15-20) 
 
రాముని గుణగణాలను, శరీర సౌందర్యమును, ఇంకా ఎన్నో విధములుగా వర్ణించి, సుగ్రీవుని మైత్రి, వాలిని వధించిన విషయము, సీతాన్వేషణ కార్యము, తను ఎలా లంకకు చేరినది వివరంగా సీతకు చెప్పాడు హనుమంతుడు. అంతే కాకుండా రాముడు సీత కొరకు ఎంత శోకిస్తున్నాడో, ఏ విషయములోను ఆనందమును పొందక సీతనే ఎలా తలచుకుంటున్నాడో చెప్పాడు. ఆ మాటలు విన్న సీత ''హనుమంతుడా! రాముడు ఇతర దృష్టి లేకుండా ఉన్నాడని, శోకముతో నిండి ఉన్నాడని చెప్పినావు. అందుచే నీ మాటలు విషము కలిపిన అమృతము వలె వున్నవి'' అన్నది (V. 37.2)
 
తన భర్త సుఖంగా వుండాలి. సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. ఏ భార్యయైనా. కాని భార్యకు భర్త దూరంగా ఎక్కడో వున్నప్పుడు ఎవరైన భర్త ప్రదేశము నుండి వచ్చినప్పుడు అతన్ని నా భర్త యెలా వున్నాడని అడిగినప్పుడు ''అతనికి ఏమీ లోటులేదు. అతను సంతోషముగా వున్నాడు. భోగభాగ్యాలు అనుభవిస్తూ సుఖంగా వున్నాడు'' అనే సమాధానము ఆ వ్యక్తి నోటివెంట వస్తే, నిజంగా భార్య సంతోషించాలి కదా!' కానిపైకి కనబడకపోయినా లోలోపల చాలా బాధపడుతుంది. ఎందుకని? తను లేకుండా భర్త ఎలా సుఖంగా వున్నాడు? అని.
 
అయితే ''నీ భర్త నువ్వు లేకపోవడం వల్ల చాలా బాధపడుతున్నాడు. ఎప్పుడూ నిన్నే తలచుకుంటున్నాడు'' అని విన్నదంటే.. ''అయ్యో! అలాగా!'' అంటుంది. కాని మనస్సులోపల చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే భర్త తనను ఎల్లప్పుడూ తలచుకుంటున్నాడు. తనను మరిచిపోలేదు అనే తృప్తితో ఆనందపడుతుంటే కాని తన భర్త కష్టాలు అనుభవిస్తున్నాడని కాదు. అలాగే సీత కూడా రాముడు తను లేకుండా దిగులుతో ఉన్నాడనే హనుమంతుడి మాటలు ''విషము కలిపిన అమృతము'' వలె వున్నాయి అని పేర్కొన్నది. 
 
రాముడు ఎప్పుడూ తననే తలచుకుంటున్నాడు అన్నది అమృతమైతే.. కష్టాలు పడుతున్నాడు శోకంలో వున్నాడు అన్నది విషము. సంతోషము, దుఃఖముతో మిశ్రమమైన విషయము అని అర్థము. రామునకు ఎంత శోకము ఉండెనో, సీత కూడా అంతే శోకముతో వుండెను. కాని హనుమంతునిచే రాముని వర్ణనము విన్న తర్వాత ఆమె శోకము తగ్గెను. హనుమంతునితో సీత, ''సముద్ర మధ్యలో బ్రద్ధలైనప్పుడు ఈది ఈది అలసిపోయిన వాడి వలె వున్న రాముడు ఈ కష్టాల ముగింపు ఎప్పుడు చూస్తాడో కదా! లంకా పట్టణానికి వచ్చి అందరిని హతమార్చి నన్ను ఎప్పుడు చూస్తాడో కదా!
 
రావణుడు నాకు ఇచ్చిన 12 మాసముల గడువులో పదవమాసము జరుగుచున్నది. ఇంక రెండు మాసములు మాత్రమే మిగిలివున్నవి. నేను అంతవరకే జీవించి ఉండగలను. రాముని తొందరముగా వచ్చి నన్ను తీసుకుపొమ్మని చెప్పుము. ఎవరు ఎంత చెప్పిననూ రావణాసురుడు నన్ను వదులుకొనుట ఇష్టపడుట లేదు'' అని చెప్పెను. రాముని కొరకు శోకముతో కృశించి కన్నీళ్ళతో నిండిన నేత్రములతో సీత ఈ విధముగా పలుకుచుండగా హనుమంతుడు :
 
''తల్లీ నిన్ను ఇప్పుడే ఈ దుఃఖమునుండి విముక్తురాలిని చేసెదెను. నా వీపుపై ఎక్కుము. నిన్ను ఇప్పుడే రాముని వద్దకు చేర్చెదను'' అని సీతను వేడుకొనెను. ఆ మాటలు విన్న సీత '' ఓ హనుమంతుడా! ఇంత చిన్న శరీరము గల నీవు నన్ను ఇక్కడి నుండి అంతదూరము ఎలా మోసికొని పోగలవు?" అని ప్రశ్నించింది. అది విన్న వెంటనే వానరశ్రేష్టుడు అయిన హనుమంతుడు తన శరీరమును పెంచుతూ మేరు పర్వతమువలె ఉన్నతమైన శరీరముతో, ప్రజ్వలించుచున్న అగ్నిలాగ ప్రకాశించుతూ సీతకు కనబడ్డాడు. మహా తేజస్సుతో తన ఎదుట గంభీరంగా నిలిచిన హనుమంతుని చూసి సీత.. 
 
''నువ్వు నన్ను తీసుకొని పోగలవని నమ్మకము కలిగినది. కాని మార్గమధ్యములో నాకు కళ్ళు తిరిగి కిందపడి పోవచ్చు. అంత ఎత్తున వెళ్తున్నప్పుడు మా మనస్సు వికలము చెందవచ్చు. రాక్షసులు నిన్ను అడ్డుకొనవచ్చును. నీపై కత్తులు, బాణములు విసరవచ్చును. నన్ను కాపాడాలని నువ్వు ఆ బాణాలను ఎదుర్కొనవలసి వచ్చును. అలా వారితో యుద్ధము చేయునప్పుడు నేను జారిక్రిందపడిపోవచ్చును. నా వలన నీకు ప్రాణహాని కలుగవచ్చును. అదియునుగాక ముఖ్యముగా పాతివ్రత్య ధర్మమును అనుసరించి నేను రాముడు తప్ప మరి యే పురుషుని శరీరమును నా అంతట నేను స్పృశించను.
 
కాని రావణుడు నన్ను బలవంతంగా వచ్చుచున్నప్పుడు, నన్ను రక్షించే నాధుడు లేక, రక్షించుకునే శక్తి లేక, రావణుని శరీరస్పర్శ నాకు కలిగినది. పరాధీనురాలైన నేను ఏమి చేయగలను. కాబట్టి రాముడు వచ్చి రాముణ్ణి చంపి నన్ను తీసుకొని పోవుటయే ఉత్తమము. అదియునుగాక నేను నీతో వస్తే రాముని బలాపరాక్రమములు లోకానికి ఎలా తెలుస్తాయి. రామునిచే జరగవలసిన కార్యము ఎలా జరుగుతుంది. నువ్వు వెళ్ళి రామలక్ష్మణులను, వానర సేనా నాయకులను శీఘ్రముగా ఇక్కడికి తీసుకుని వచ్చి, ఈ చెర నుండి విముక్తి చేయించి నాకు ఆనందాన్ని కలుగజేయుము'' అని చెప్పెను. రామునకు నమ్మకము కలుగుట కొరకు సీత హనుమంతునికి కాకాసురుని వృత్తాంతమును చెప్పి చూడామణిని ఇచ్చినది. - ఇంకా వుంది.. దీవి రామాచార్యులు (రాంబాబు).