బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (12:07 IST)

శ్రీకాకుళంలో మహోదయ పుణ్యస్నానాలు: పాండవుల అజ్ఞాత వాసానికి మహోదయానికి ఏంటి సంబంధం?

శ్రీకాకుళం జిల్లాలో నదీ సాగర సంగమ ప్రాంతాల్లో మహోదయ ఘడియలు ప్రారంభమయ్యాయి. అరుదుగా సంభవించే ఈ పుణ్యకాలం 33 సంవత్సరాల తర్వాత వచ్చింది. మహేంద్రగిరులపై పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో మహోదయం రోజు నిర్వహించాలని పురాణాల ప్రస్తావన.

గుప్తకాశీగా గుర్తింపు పొందిన బారువ తీరంలో మహేంద్ర తనయ నదీ సాగర సంగమ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. ఇప్పటివరకు అర్దోదయ, సాధారణ మహోదయం లాంటి పుణ్యకాలాలే సంభవించాయి. ద్వాపర యుగంలో ఇలాంటి అరుదైన పుణ్యకాలంలోనే మహోదయం సంభవించింది. ఆదివారం రాత్రి 10.19 గంటలకు మహోదయ పుణ్యకాలం ప్రారంభమైందని పండితులు చెబుతున్నారు. 
 
బారువ తీరంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌, ఆర్డీవో వెంకటేశ్వరరావు హారతితో పుణ్యస్నానాలు ప్రారంభించారు. ఈ తీరానికి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు పోటీపడుతున్నారు. వంశధార నదీ సాగర సంగమ ప్రాంతమైన కళింగపట్నంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఈ పుణ్యస్నానాలను ప్రారంభించారు. అమావాస్య కారణంగా సముద్ర పోటు అధికంగా ఉండటంతో ఆదివారం రాత్రి స్నానాలు చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
 
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అమావాస్య ఘడియలు ఉండటంతో పాటు శ్రవణా నక్షత్రం కలిసి వస్తే అదే మహోదయ పుణ్యకాలమని పండితులు తెలిపారు. కాబట్టి భక్తులు ఈరోజంతా పుణ్యస్నానాలు చేయొచ్చని చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని ప్రాంతాల నుంచి ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.