శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (20:38 IST)

సీతాపహరణం: రావణుడిపై కుంభకర్ణుడి కోపం..!

సీతను లంకకు తీసుకురావడంతో ఎన్నో అనర్ధాలు ఉత్పన్నమయ్యాయని రావణుడు ఆందోళన చెందాడు. మూడు లోకాల్లోనూ సీతవంటి సుందరిలేదు.. కాని ఆమె నన్ను అంగీకరించడంలేదు. ఆమె తన భర్త అయిన రాముడు వస్తాడని ఎదురు చూస్తుంది. సముద్రాన్ని వానరుడు హనుమంతుడు దాటాడు. ఆ రాజ్యపుత్రులు, రామలక్ష్మణులు ఎలా దాటుతారు.. అని రావణుడు కుంభకర్ణుడితో చెబుతాడు. 
 
రామలక్ష్మణులు సీత వుండిన చోటు తెలుసుకొని సుగ్రీవునితోనూ గొప్ప వానరసేనతోనూ వచ్చి సముద్రం ఉత్తరపుగట్టు విడిది వున్నారు. సీతను ఇవ్వడానికి వీలులేదు. రామలక్ష్మణులను సంహరించాలి. ఇదీ యిప్పుడు మనం నెరవేర్చవలసింది. దీనికి మీరు అపాయం లేని ఉపాయం ఆలోచించండి. వానరులను వెంటబెట్టుకొని సముద్రం దాటి యిక్కడికెవడూ రాలేడు. విజయం నాకే, తప్పదు" అని చెప్పాడు. 
 
అయితే కామపరీతుడైన రావణుని మాటలు విని కుంభకర్ణుడు చాలా కోపించి యిలా అన్నాడు. "అన్నా! మొదటే మాతో ఆలోచించి నువ్వు సీతను తీసుకువచ్చి వుండవలసింది. ఇప్పుడీ ఆలోచన గతజలసేతుబంధనం వంటిదయింది. 
 
ముందే బాగా ఆలోచించి నిర్ణయం చేసే రాజు నీవలె తరువాత పరితాపం చెందడు. మంచిపనులైనా ఉపాయంగా చెయ్యాలి. లేకపోతే అపాత్రులకు అన్నం పెట్టినట్టవుతుంది. ఎవడు ముందు చెయ్యవలసిన పనులు వెనకా, వెనుక చెయ్యవలసిన పనులు ముందూ చేస్తాడో వాడికి నీతి ఎంతమాత్రమూ తెలియదన్నమాట. 
 
ఏమీ ఆలోచించకుండా నువ్వు అసాధ్య కార్యం చేశావు. అయితే, మించిపోయింది లేదు. నువ్వు చేసింది చెయ్యనే చేశావు. నీ శత్రువులను సంహరించి నేను నీ కార్యం సమీకరణ చేస్తాను. సందేహపడకు. నేను నీ శత్రువులనందరినీ చంపేస్తాను. 
 
ఇంద్రుడు వచ్చినా, సూర్యుడు వచ్చినా, అగ్ని వచ్చినా, వాయుదేవుడు వచ్చినా, కుబేరుడు వరుణుడు కూడా వచ్చినా, నేను వారిని చంపేస్తాను. నేను రాముణ్ణి చంపి నీకు విజయం సంపాదించి యిస్తాను. రామలక్ష్మణులను చంపి నేను వానరులందరినీ నమిలేస్తాను. కనుక నువ్వు యథేచ్చగా వుండు. నీ యిష్టం వచ్చిన పని చేయి. నేను రాముణ్ణి చంపెయ్యగానే సీత నీకు వశపడిపోతుంది." అన్నాడు.