గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (11:33 IST)

శ్రీకాళహస్తి శివయ్య అన్నప్రసాదం - ఇక బహుదూరం

శ్రీకాళహస్తి ఆలయ అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో యాత్రికులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తితిదే నిధులతో చేపట్టిన యాత్రికుల వసతి సముదాయాన్ని

శ్రీకాళహస్తి ఆలయ అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో యాత్రికులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తితిదే నిధులతో చేపట్టిన యాత్రికుల వసతి సముదాయాన్ని ఆలయానికి దూరంగా కొండల్లో నిర్మిస్తున్నారు. ఇప్పట్లో అంతదూరం భక్తులు వెళ్లిరావడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమైనా పట్టించుకోలేదు. ఇప్పుడు అలాంటి నిర్ణయమే మరొకటి చేశారు. అన్నప్రసాద కేంద్రాన్ని ఆలయానికి దూరంగా మార్చాలని నిర్ణయించారు.
 
శ్రీకాళహస్తి ఆలయంలో అన్నదానం పథకంలో అమల్లో ఉంది. మంగళ, బుధ, గురువారాల్లో 1600 మందికి, రద్దీ ఎక్కువగా ఉండే శుక్ర, శని, ఆది, సోమవారాల్లో 2 వేల మందికి మధ్యాహ్నం భోజనం పెడతారు. ఇటీవల రాత్రిపూట కూడా 150 మందికి భోజనం వడ్డిస్తున్నారు. రోజూ 4 వేల మందికైనా భోజనాలు వడ్డించాలన్నది ఆలోచనగా ఉంది. దాదాపు దశాబ్దకాలంగా అన్న ప్రసాద వితరణ కేంద్రం అమల్లో ఉంది. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే  శ్రీకాళహస్తి ఆలయ అన్నప్రసాదానికి మంచి పేరు ఉంది. రుచిగా, శుచిగా ఉంటుందన్న పేరుంది. భక్తులు వేచి ఉండి భోజనం చేసి వెళుతుంటారు. ప్రస్తుతం ఆలయ ఆవరణలోనే భోజనశాల ఉంది. దర్శనం చేసుకుని, సుపథం మండపం వైపు బయటకు వచ్చేదారిలో ఈఓ కార్యాలయం పక్కనే ఉన్న అన్నప్రసాద కేంద్రం భక్తులకు అందుబాటులో ఉంది.
 
అన్నప్రసాద కేంద్రాన్ని లోబావికి సమీపంలో ఉన్న శివసదన్‌లోకి మార్చుతున్నట్లు ఈఓ భ్రమరాంబ ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటనతో మీడియా కూడా విస్తుపోయింది. అన్నప్రసాద కేంద్రాన్ని అంతదూరం తరలిస్తే ఎంతమంది వెళ్ళి భోజనం చేయగలరన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. భిక్షాల గాలిగోపురం వద్ద పాదరక్షలు వదిలి గుడిలోకి అడుగుపెట్టే బక్తులు దర్శనానంతరం భోజనం కోసమే దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరం నడిచివెళ్ళి, మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా శ్రమ అవుతుంది. వృద్ధులు, చిన్నపిల్లలు అసలు వెళ్ళలేరు. వాహనాల్లో వచ్చేవారైతే ఫర్వాలేదుగానీ బస్సుల్లో వచ్చే భక్తులకు శివయ్య అన్నప్రసాదం స్వీకరించడం శ్రమతో కూడుకున్నపనే. 
 
పాలకమండలి సభ్యులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేవదాయశాఖ ఉన్నతాధికారులు చెప్పారనే పేరుతో, పాలకమండలి నిర్ణయంతో నిమిత్తం లేకుండానే అన్నప్రసాద కేంద్రాన్ని మార్చడానికి అధికారులు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అన్నప్రసాద కేంద్రాన్ని తరలిస్తే అంతదూరం వచ్చి భోజనం చేసేవారు రోజుకు 300 నుంచి 400 మంది కూడా ఉండబోరని సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈఓ మాత్రం ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటే మార్పు తప్పదని, ప్రస్తుత అన్న ప్రసాద కేంద్రంలో ప్రసాదాల తయారీ పోటు ఏర్పాటు చేస్తామని అంటున్నారు.
 
ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమేగానీ ఆ పేరుతో ఇప్పుడే లోబావిదాకా అన్నప్రసాద కేంద్రాన్ని తరలించాల్సిన అవసరం కనిపించడం లేదు. ఆలయ ఆవరణలోనే ఇంకా స్థలం ఉంది. అవసరమైతే అద్దె గదులు వంటివి కాస్త దూరంగా నిర్మించినా ఫర్వాలేదు కానీ, అన్నప్రసాద కేంద్రాన్ని ఆలయానికి దగ్గరగానే ఉంచాలని పలువురు సూచిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే మాట చెబుతున్నారు. 10 రోజుల్లోనే తరలించడానికి తహతహలాడుతున్న అధికారులు దీనిపై పునరాలోచన చేస్తారా.. లేకుంటే మంత్రి దీనిపై స్పందింస్తారా? అనేది వేచి చూడాల్సిందే.