గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2015 (17:05 IST)

సుగ్రీవుని మైత్రి: హనుమంతుడి సన్యాసి రూపం ఎందుకు? సీత ఆభరణాలను లక్ష్మణుడు గుర్తుపట్టాడా?

సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణుల ఋష్యమూక పర్వతానికి చేరుకున్నారు. అక్కడ సుగ్రీవుడు, హనుమంతుడు రామలక్ష్మణులను చూసి వాలి పంపిన మనుష్యులుగా తలంచారు. మొదట హనుమంతుని మారువేషంలో వారివద్దకు వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకురమ్మని సుగ్రీవుడు హనుమంతుని పంపాడు. 
 
హనుమంతుడు సుగ్రీవుని మాటలు విని, ఋష్యమూకపర్వతము నుండి రామలక్ష్మణులున్న చోటికి ఎగిరివెళ్లెను. అప్పుడు, వాయు కుమారుడు, వానరుడు అయిన హనుమంతుడు, కొత్తవారైన రామలక్ష్మణుల విషయమున పూర్తి విశ్వాసము లేకపోవుట చేత, కపటబుద్ధితో తన వానరూపమును విడిచి, సన్యాసిరూపమును ధరించెను. పిమ్మట హనుమంతుడు సవినయముగా రామలక్ష్మణులను సమీపించి, నమస్కరించి, మృదువైన, చాలా మనోహరమైన వాక్కుతో ఆ వీరులను పలకరించెను. తగు రీతిలో వారిని ప్రశంసించెను. 
 
"మీరు రాజర్షులవలె, దేవతలవలె ఉన్నారు. తీవ్రమైన వినయములను పాటించు మునుల వేషములో ఉన్నారు. మీ శరీరచ్ఛాయ చాలా శ్రేష్ఠముగా ఉన్నది. మిమ్ములను చూసి ఈ అరణ్యములో ఉన్న మృగాలు, ఇతర ప్రాణులు భయపడుచున్నవి. మీరు ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చినారు? బలశాలులైన మీరిద్దరూ పంపాతీరమునందున్న వృక్షములను నలువైపులా చూచుచూ మీ సన్నిధిచేత ఈ మంగళప్రదమైన జలముగల పంపాసరస్సును ప్రకాశింపచేయుచున్నారు. 
 
ధైర్యవంతులు, మంచి శరీరచ్ఛాయ, కాంతీ గలవారు, నారచీరలు ధరించి వున్నవారు, శ్రేష్ఠములైన భుజాలు గలవారు అయిన మిమ్ములను చూసి ఇక్కడ నున్న ప్రజలందరూ భయపడుచున్నారు. మీరెవ్వరు? వీరులు, గొప్ప బలపరాక్రమములు గలవారు అయిన మీ చూపులు సింహము చూపులవలె ఉన్నవి. మీరు ధరించిన ధనుస్సులు ఇంద్రధనుస్సు వలె ఉన్నవి. మీరు శత్రు సంహారము చేయగలవారు. మంచి శోభ, సౌందర్యముగలవారు, శ్రేష్ఠమైన వృషభమువంటి పరాక్రమము గలవారు. మీ బాహువులు ఏనుగు తొండము వలె వున్నవి. మంచి కాంతి గల మానవశ్రేష్ఠులైన మీరు ఎవరు? (5-10)
 
మీ ఇద్దరి కాంతిచేత ఈ పర్వతము ప్రకాశవంతమైనది. రాజ్యానికి తగినవారు, దేవతాతుల్యులూ అయిన మీరు ఇప్పుడు ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చినారు? మీ నేత్రముల పద్మముల రేకల వలె ఉన్నవి. వీరులైన మీరు జటామండలమును ధరించియున్నారు. ఒకరిని ఒకరిని పోలి వున్నారు. దేవలోకము నుంచి వచ్చిన వీరులవలె, తలవని తలంపుగా భూలోకానికి దిగివచ్చిన చంద్రసూర్యునివలె ఉన్నారు. 
 
విశాలమైన వక్షస్థలములు గల వీరులైన మీరు దేవతలరూపము వంటి రూపము గల మనుష్యులు. సింహము మూపువంటి మూపులతో, మంచి ఉత్సాహముతో ఉన్న మీరు మదించిన ఆబోతుల వలె ఉన్నారు. మీ బాహువులు దీర్ఘములై, బలిసి గుండ్రముగా ఉండి పరిఘల వలె (కోట తలుపులకు వేసే పెద్ద ఇనుపగడియలవలె) ఉన్నవి. అన్ని విధముల అలంకారములచే అలంకరింపదగిన ఈ భుజములను అలంకరించుకొనలేదేమి? (11-14).
 
సముద్రలతోను, వనములతోను కూడిన, వింధ్య మేరు పర్వత సహితమైన ఈ భూమినంతనూ పరిపాలించుటకు మీరు తగినవారని నా అభిప్రాయము. విచిత్రమైన పూతపూసి నున్నగా ఆశ్చర్యకరముగా ఉన్న ఈ ధనుస్సులు బంగారముతో అలంకరించిన ఇంద్రుని వజ్రాయుధము వలె ఉన్నవి. చూచుటకు అందముగా ఉన్న అంబుల పొదులు కూడా ప్రాణములు తీసే భయంకరమైన బాణాలతో నిండివున్నవి. ప్రజ్వలించుచున్న ఈ బాణములు సర్పముల వలె ఉన్నవి. శుద్ధమైన బంగారముతో అలంకరించబడినవై, చాలా పెద్దవిగాను, లావు (దళసరి) గాను ఉన్న ఈ ఖడ్గములు కుబుసము విడిచిన సర్పముల వలె ఉన్నవి (15-18).
 
నేనింతగా మాటలాడుచుండగా మీరు బదులు చెప్పరేమి? ధర్మాత్ముడు, వీరుడు అయిన సుగ్రీవుడనే ఒక వానరశ్రేష్ఠుడున్నాడు. అతనిని అన్నగారు అవమానము చేసి వెడలగొట్టగా అతడు దేశములో తిరుగాడుచున్నాడు. నేను వానరుడను, నా పేరు హనుమంతుడు. వానర నాయకుల రాజు, మహాత్ముడూ అయిన సుగ్రీవుడు పంపగా వచ్చినాను  (19-21). 
 
ధర్మాత్ముడు ఆ సుగ్రీవుడు మీతో స్నేహమును కోరుచున్నాడు. నేను అతని మంత్రిని, వాయుపుత్రుడును, వానరుడను. సుగ్రీవునకు ప్రీతి కలిగించుటకై సన్యాసి రూపములో ఋష్యమూకము నుండి ఇక్కడికి వచ్చినాను. ఇచ్ఛానుసారము రూపము ధరించి ఇష్టము వచ్చిన చోటుకు వెళ్లుటకు సమర్థుడను." (22, 23). 
మాటలు తెలిసినవాడు, మాటాలాడుటలో నేర్పరి అయిన ఆ హనుమంతుడు వీరులైన ఆ రామలక్ష్మణులతో ఇట్లు పలికి, ఇంక ఏమీ అనకుండా ఉండిపోయెను. (24). రాముడు హనుమంతుని మాటలు విని, ఆనందముచే వికసించిన ముఖముతో ప్రక్కనే ఉన్న సోదరుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను (25). 
 
వానరుల ప్రభువు. మహాత్ముడు అయిన సుగ్రీవుని మంత్రియైన ఇతడు, అతనినే వెదకుచూ వచ్చిన నా దగ్గరికే వచ్చినాడు. లక్ష్మణా! సుగ్రీవుని మంత్రియైన ఈ వానరుడు మాటలు తెలిసినవాడు. స్నేహము కలవాడు. శత్రువులను నశింపచేయువాడు. అట్టి ఈతనితో మధురమైన మాటలతో మాటలాడుము. ఋగ్వేదమును చదవనివాడు, యజుర్వేదమును చదవనివాడు, సామవేదమును చదవనివాడు ఈవిధముగా మాటలాడజాలడు. నిశ్చయముగా ఇతడు వ్యాకరణమును అంతా అనేక పర్యాయములు విని (చదివి) ఉన్నాడు. అందుచేతనే ఇన్ని మాటలు మాటలాడినా ఒక అపశబ్ధము కూడా ఉచ్చరించలేదు (26-29).
 
ముఖమునందు గాని, నేత్రములందుగాని, లలాటమునందు గాని, కనుబొమ్మలయందుగాని మరి ఏ అవయవమునందుగానీ ఏ మాత్రము దోము కనబడలేదు. ఈతని మాటలలో అవసరములేని విస్తారము లేదు. సందేహమునకు తావులేకుండా ఉన్నది. ఉచ్ఛారణలో ఆలస్యము లేదు. వినువారికి వ్యథ కలిగించుట లేదు. నాభి నుంచి పైకి వచ్చుచున్నప్పుడు ఇది ముందు (మాటలాడేవానికి మాత్రమే గోచరించే) మధ్యమాగ్రూపమున వక్షస్థలమును తాకుచు పైకివచ్చి వినేవాళ్లకు వినబడే వైఖరీ రూపమున కంఠమును చేరినది.
 
బిగ్గరగా గాని, మందముగా గాని లేక మధ్య స్వరములో ఉన్నది. ఈతడుచ్చరించిన మంగళప్రదమైన వాక్కు, వ్యాకరణ సంస్కారసంపన్నమై, క్రమము తప్పక ఆశ్చర్యకరముగా ఉన్నది. ఉచ్చారణలో తొందరలేదు. మనోహరముగా ఉన్నది. వర్ణములను ఉచ్ఛరించే వక్షస్థలము, కంఠము, శిరస్సు అను మూడు స్థానములందు చక్కగా నిలిచిన అందమైన ఇట్టి మాటలకు ఎవని మనస్సు సంతోషము పొందదు? కత్తి ఎత్తిన శత్రువు మనస్సు కూడా మారిపోవును దోషములు లేనివాడా! ఇట్టి దూతలేని రాజు తలపెట్టిన పనులు ఎట్లు సిద్ధించును? (30-34). 
 
ఇట్టి గుణములు గల కార్యసాధకులైన దూతలు ఏ రాజువద్ద నుందురో ఆతని కార్యములు ఆ దూతలచే నిర్వర్తింపబడి సిద్ధించును'' (35). మాటలలో నేర్పరియైన లక్ష్మణుడు రాముని మాటలు విని, సుగ్రీవుని మంత్రీ, మాటలలో నేర్పరీ, వాయుపుత్రుడూ అయిన హనుమంతునితో ఇట్లు పలికెను. (36). ఓ! బుద్ధిమంతుడా! మహాత్ముడైన సుగ్రీవుని గుణాలను గూర్చి మాకు తెలియును. వానరరాజైన ఆ సుగ్రీవుణ్ణే మేము వెదకుచు వచ్చినాము. సుగ్రీవుని మాటల ప్రకారం నీవు ఇప్పుడు చెప్పిన విధముగానే మేము చేసెదము" (37, 38). 
 
హనుమంతుడు లక్ష్మణుని మాటలు విని, వారి సద్భావనమును కూడా తెలిసికొని, సంతోషించి, మనసా సుగ్రీవుని సన్నిధి చేరెను. ఒక ప్రయోజనమును కోరి ఈ మహాపురుషుడు వచ్చినాడు. ఈ కృత్యము సుగ్రీవుడు చేయగలిగినదిగా కూడా ఉన్నది. అందుచేత మహాత్మ్యుడైన సుగ్రీవునకు రాజ్యము లభించే అవకాశమున్నది. (2)
 
పిమ్మట చాలా సంతోషించిన హనుమంతుడు మాటలలో నేర్పిరి అయిన రామునితో ఇట్లు పలికెను (3). "పంపాపరిసరాలలో ఉన్న ఈ అరణ్యము భయంకరమైనది. ప్రవేశింపశక్యము కానిది. ఇది అనేకవిధములైన సర్పములతోను, మృగములతోను నిండి వున్నది. అట్టి ఈ అరణ్యములోనికి నీవు, నీ తమ్ముడు ఎందుకు వచ్చినారు?" (4). 
 
లక్ష్మణుడు హనుమంతుని మాటలు విని, రాముడు ప్రేరేపింపగా రాముడి అరణ్యవాస వృత్తాంతముమంతయును హనుమంతుడికి చెప్పి పూర్వము ఏ రాముడు లోకాలకు ధనములు పంచిపెట్టి, గొప్పకీర్తి గడించి లోకాలకు సంరక్షకుడుగా ఉండెనో అతడు సుగ్రీవుని సహాయమును కోరుచున్నాడు. ఏ రాముని తండ్రియైన, ధర్మమునందు ఆసక్తిగల దశరథుడు శరణాగతరక్షకుడుగా ఉండేవాడో అట్టి దశరథుని కుమారుడైన రాముడు సుగ్రీవుని శరణుజొచ్చినాడు. ధర్మాత్ముడు, శరణాగత రక్షకుడు పూర్వము సకలలోకమును రక్షించినాడు. నా అన్నగారు అయిన అట్టి, ఈ రాముడు సుగ్రీవుని శరణు పొందినాడు. 
 
ఏ రాముని అనుగ్రహము సంపాదించుకొని ఈ ప్రజలందూ సుఖముగా ఉందురో అట్టి రాముడు సుగ్రీవుని అనుగ్రహమును కోరుచున్నాడు (18-21). ఏ దశరథమహారాజు భూమియందున్న, సకలగుణములతో కూడిన రాజుల నందరిని తన సామంతులుగా ఎల్లప్పుడూ అనుగ్రహదృష్టితో సత్కరించుచుండెడివాడో అట్టి దశరథుని జ్యేష్ఠపుత్రుడు, మూడు లోకాలలో ప్రసిద్ధుడు అయిన రాముడు వానరరాజైన సుగ్రీవుని శరణు జొచ్చినాడు. ఓ! వానరయూథ నాయకా! శోకమునకు లొంగిపోయి, శోకముచేత పీడింపబడుచు, శరణుజొచ్చిన ఈ రామునిపై సుగ్రీవుడు అనుగ్రహము చూపవలెను. (22-24) దీనముగా కన్నీళ్లు కార్చుచు లక్ష్మణుడు పలికిన ఈ మాటలు విని హనుమంతుడు ఇట్లు పలికెను. (25)
 
''బుద్ధిమంతులు, క్రోధమును జయించినవారు. ఇంద్రియములను జయించినవారు అయిన మీవంటి వారి దర్శనము అదృష్టవశముచేతనే లభించును. అట్టి మిమ్ములను సుగ్రీవుడు తప్పకచూడవలెను. సుగ్రీవుడు వాలితో వైరము పెట్టుకొనినాడు. వాలి సుగ్రీవుని భార్యను అపహరించి చాలా అవమానించి రాజ్యభ్రష్టుని చేసినాడు. అతడు అరణ్యములో భయపడుచూ కాలము గడుపుతున్నాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి, సీతాన్వేషణము నందు మీకు సహాయము చేయగలడు.'' (26-28) 
 
హనుమంతుడు ఈ విధముగా మధురములైన మాటలు మృదువుగా పలికి '' మంచిది, సుగ్రీవుని వద్దకు వెళ్లెదము'' అని రామునితో అనెను. (29). "రామా! ఈ హనుమంతుడు సంతోషముతో మాటలాడుచున్న విధము చూడగా ఇతడు మనతో పని ఉండి వచ్చినట్లు కనబడుచున్నది. ఇక నీ (మన) కార్యము పూర్తియైనట్లే. ఇతడు ప్రసన్నమైన ముఖ వర్ణముతో, సంతోషపూర్వకముగా మాటలాడుచున్నాడనునది స్పష్టముగా కనబడుచున్నది. వాయుపుత్రుడైన హనుమంతుడు అసత్యము పలకడు'' (31. 32)
 
పిమ్మట హనుమంతుడు వీరులైన ఆ రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్లెను. హనుమంతుడు సన్యాసి రూపము విడిచి, వానర రూపము గ్రహించి, వీరులైన ఆ రామలక్ష్మణులను వీపుపై ఎక్కించుకొని వెళ్లెను. అధికమైన కీర్తి, గొప్ప పరాక్రమమూ, మంగళప్రదమైన బుద్ధీ గల వానరవీరుడైన హనుమంతుడు తన కార్యము సఫలమగుటచే సంతోషించుచు రామలక్ష్మణులతో కలిసి ఆ పర్వతము మీదకి వెళ్లెను. 
 
లక్ష్మణుడు రాముని గురించి తమ వంశాన్ని గురించి చెబుతూ తాము సీతను వెతుక్కుంటూ వస్తున్న సంగతి చెప్పెను. తర్వాత రామలక్ష్మణులను సుగ్రీవునికి పరిచయం చేసి వారి మధ్య మైత్రిని కలుగజేసెను హనుమంతుడు. సీత తన పట్టువస్త్రముతో కట్టి పడవేసిన బంగారు ఆభరణాలను సుగ్రీవుడు రామలక్ష్మణులను చూపించెను. వాటిని చూడగానే రాముని కళ్ళనిండా నీరు పెల్లుబికాయి. "లక్ష్మణా! ఇవి సీత నగలేనా చూసి చెప్పు'' అని అడిగెను రాముడు. 
 
''వదినె కాలి అందియలు తప్ప, నేను వేరే ఆభరణములు గుర్తు పట్టలేను రామా! ఎందుకంటే రోజూ వదినకు పాదాభివందనం చేసేటప్పుడు చూసే కాలిఅందియలు మాత్రము గుర్తుపట్టగలను'' అన్నాడు లక్ష్మణుడు. (ఇంకా వుంది)