శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (17:53 IST)

రావణుడు సీతకు రెండు మాసముల గడువు ఇచ్చుట: నీవు నా శయనము పైకి రావలెను!!

రావణుడు పరుషములైన సీత మాటలు విని, పైకి ప్రియములుగా ఉన్నట్లు కనబడు అప్రియములైన మాటలు రావణుడు ఈ విధముగా పలికెను : ''స్త్రీలను బుజ్జగించిన కొలదీ పురుషుడు వాళ్ళకు స్వాధీనుడగును. ఇతడు మనకు దాసుడని వాళ్ళు భావింతురు. మంచిమాటలు చెప్పినకొలదీ అతనిని వాళ్ళు తిరస్కరించుచుందురు. నాకు నీయందున్న కామము, చెడు మార్గమునందు పరిగెత్తుచున్న గుర్రములను సారథి నిగ్రహించినట్లు, నా కోపమును అణచివేయుచున్నది. నిజముగా కామము ప్రతికూల స్వభావము కలది. ఎందుచేతననగా ఏ వ్యక్తిపై కామము కలుగునో ఆ వ్యక్తిపై జాలి, స్నేహము కూడా కలుగుచుండును. 
 
''సీతా! కపటవనవాసము చేయు రామునియందు ఆసక్తురాలవై అవమానించుటకూ, చంపుటకూ తగిన దానివైన నిన్ను ఈ కారణము చేతనే చంపించలేకుండా ఉన్నాను. నీవు నాతో పలికిన పరుషమైన ఒక్కొక్కమాట నిన్ను క్రూరముగా వధించవలసి ఉన్నది.'' రాక్షసరాజైన రావణుడు సీతతో ఈ విధముగా పలికి కోపముతోను, తొందరతోను కూడినవాడై ఆమెతో మరల ఈ మాట పలికెను: 
 
''నేను నీకు రెండు మాసములు గడువు ఇచ్చుచున్నాను. ఆ గడువును నేను పాలింపవలసియున్నది. ఆ గడువు దాటిన వెంటనే నీవు నా శయనము పైకి రావలెను. ఈ గడువులోగా నీవు నన్ను భర్తగా అంగీకరించకపోయినచో, రెండు మాసముల పిదప నిన్ను ప్రాతఃకాల భోజనార్థము వంటింటికి తీసుకెళ్లి చంపివేయగలరు.''  
 
రావణుడు ఆ విధముగా సీతను భయపెట్టుటను చూసి, దేవగంధర్వ కన్యలు కన్నీళ్ళు ఎర్రబడుట మొదలైన వాటితో (వారి) కండ్లు వికారము చెందగా దుఃఖించిరి. ఆ రాక్షసునిచేత భయపెట్టబడుచున్న సీతను పెదవులు కదిల్చి కొందరు, ముఖములు నేత్రములు కదల్చి మరి కొందరు ఓదార్చిరి. దేవగంధర్వ కన్యల చేత ఆ విధముగా ఊరడించబడిన సీత, పాతివ్రత్య బలము, దర్పము ఉట్టిపడునట్లు, ఆ రాక్షసరాజుతో తనకు హితమైన వాక్యము పలికెను. 
 
" నీ క్షేమమును కోరి నిన్ను ఈ విధమైన నింద్యమైన పనినుండి నివారించు వారెవ్వరూ ఉన్నట్లు లేదు. ఇది నిశ్చయము. శచీదేవి దేవేంద్రుని భార్య అయినట్లు, నేను ధర్మాత్ముడైన రాముని భార్యను. అట్టి నన్ను ఈ మూడులోకములలో నీవు తప్ప మరెవ్వడైనా, మనస్సులో కూడా కోరుకొనునా!
 
ఓ రాక్షసాధమా! అమితమైన తేజస్సు గల రాముని భార్యనైన నాతో ఈవిధముగా పాపపు మాటలు పలికినందుకు, నీవెక్కడికి పోయినను ఈ అపరాధమునుండి తప్పించుకొనజాలవు. నీవు రామునితో యుద్ధమునకు తలపడుట, వనములో చెవులపిల్లి మదించిన ఏనుగును ఎదురించునటువంటిది. రాముడు మహాగజము. నీవు చెవుల పిల్లివి. ఈ లంకాపట్టణములో కూర్చుండి, సిగ్గులేక ఇక్ష్వాకువంశ ప్రభువైన ఆ రాముని నిందించుచున్నావు. అతని కంటికి కనబడుటకు మాత్రము భయపడుచున్నావు. 
 
ఓ! రావణా! నీవు భస్మముగా చేయదగినవాడివైనను నాకు రామాజ్ఞలేకపోవుటచేతను, తపస్సును రక్షించుకొనుట చేతను నా పాతివ్రత్యమహిమచే నిన్ను భస్మము చేయుటలేదు. బుద్ధిశాలియైన రామునకు చెందిన నన్ను నీవు అపహరించజాలవు. అయినను ఈ విధముగా నా అవమానము జరిగినదనగా ఇది నీ మృత్యువు కొరకే వచ్చినది. సందేహము లేదు. 
 
''నేను శూరుడను, కుబేరుని సోదరుడను, అనంత బలసంపన్నుడను'' అని చెప్పుకొనుచున్నావే! అట్టి నీవు రాముని దూరముగా పంపివేసి అతని భార్యనైన నన్ను ఎందువలన అపహరించినావు?" రాక్షసరాజైన రావణుడు సీత మాటలు విని, క్రూరములైన నేత్రములు పెద్దవి చేసి, సీతను చూసెను. ఆ రావణుడు నల్లని మేఘమువలె ఉండెను. అతని భుజముల, కంఠము చాలా పెద్దవిగా ఉండెను. అతని బలము నడక, సింహము బలము నడకవలె ఉండెను. శోభాయుక్తుడైన అతని జిహ్వాగ్రము, నేత్రములు కూడా మండుచునట్లుగా ఎర్రగా ఉండెను. అతడు కిరీటమును ధరించుటకే ఎత్తుగా ఉన్నట్లు కనబడుచుండెను. విచిత్రములైన మాలలను, ఎర్రని వస్త్రములను ధరించెను. అగ్నిలో కాల్చి శుద్ధము చేసిన బంగారముతో తయారు చేసిన బాహుపురులను అలంకరించుకొనెను. 
 
చల్లగా, నల్లగా ఉన్నత్రాడును నడుమునకు బిగించి ఆ రావణుడు, అమృతమునకై, సముద్రమథనము చేయు సమయమున వాసుకిని కట్టిన మందరపర్వతములె ఉండెను. పర్వతమువలె ఉన్న రావణుడు, బాగా బలిసిన భుజములతో, రెండు శిఖరములతో కూడిన మందర పర్వతము వలె ప్రకాశించెను. బాలసూర్యుడు వలె ఎర్రగా ఉన్న కుండలములు అలంకరించుకొని అతడు, ఎర్రని చిగుళ్ళూ, పుష్పములూ గల రెండు అశోకవృక్షములతో పర్వతము వలె ప్రకాశించుచుండెను. కల్పవృక్షమువలె ఉన్న అతడు మూర్తీభవించిన వసంతము వలె ఉండెను. అతడు చక్కగా అలంకరించుకొన్ననూ, శ్మశానమునందున్న మండపము వలె భయంకరముగా ఉండెను. 
 
అతడు, సీతను, కోపముచేత ఎర్రనైనా నేత్రములతో చూచుచూ, సర్పమువలె బుసలుకొట్టుచు, ఆమెతో - "చెడ్డ నీతిని అనుసరించువాడు, ధనము లేనివాడు అయిన రామునిపై మక్కువకలదానా! సూర్యుడు తన కాంతిచేత సంధ్యను నశింపజేయునట్లు నేను నిన్ను ఇప్పుడే నశింపచేసెదను." అని పలికి చూసేవారికి భయంకరముగా ఉన్న రాక్షసస్త్రీలందరినీ ఒకసారి చూశాడు. ఒకే కన్ను, ఒకే చెవిగల దానిని, చెవులు లేని దానిని, ఏనుగు పాదముల దానిని, గుర్రము పాదముల దానిని, ఆవు పాదముల దానిని, పాదాలమీద జుట్టు ఉన్నదానిని, పెద్ద పాదములదానిని, పెదాల మీద జుట్టు ఉన్నదానిని, ఒకే కన్ను ఒకే పాదము ఉన్నదానిని, పాదాలు లేనిదానిని, పెద్ద తలా కంఠమూ గల దానిని, పెద్దస్తనములు, పొట్టాకలదానిని, పెద్దనోరు, కళ్ళూ కలదానిని. పొడవైన నాలుక కలదానిని, నాలుక లేని దానిని. ముక్కులేనిదానిని, సింహముఖము దానిని, ఆవు ముఖముదానిని, పందిముఖము దానిని చూసి, 
 
''ఓ రాక్షసస్త్రీలలారా! మీరందరూ కలిసి ప్రయత్నించి సీత శీఘ్రముగా వశమగునట్లు చెయ్యండి. సామ-దాన-భేదోపాయములను ప్రయోగించి కాని, దండమును ప్రయోగించి గాని సీతను లొంగదీసుకొనండి'' అని ఆజ్ఞాపించెను. 
 
ఆ రాక్షస స్త్రీలను ఈ విధముగా అనేక పర్యాయములు ఆజ్ఞాపించి కామముతోను, కోపముతోను నిండిన మనస్సుతో సీతను భయపెట్టెను. (38) అప్పుడు ధాన్యమాలిని అను రాక్షస స్త్రీ తొందరగా రావణుని వద్దకు వచ్చి అతనిని కౌగిలించుకుని - "మహారాజా! నీవు హాయిగా నాతో విహరింపుము. రాక్షసాధిపా! చెడ్డ శరీరవర్ణముగల దీనురాలైన మనుష్య స్త్రీ- ఈ సీతతో నీకేమి సుఖము కలుగును? నీ బాహుబలముచేత సంపాదించిన దివ్యములైన ఉత్తమభోగములను బ్రహ్మదేవుడు ఈమెకు రాసి పెట్టలేదు. ఇది నిజము. ఏ పురుషుడైనను తనపై ప్రేమలేని స్త్రీని కామించినచో వాని శరీరమునకు తాపము మాత్రమే కలుగును. తనపై ప్రేమ ఉన్న స్త్రీని కామించువానికి మంచి ఆనందము కలుగును'' అన్నది. 
 
రావణునితో ధాన్యమాలిని ఇట్లుపలికి, అతనిని కౌగిలించుకొని పైకి లేవదీసెను. అపుడాతడు నవ్వుచూ వెనుకకు మరలెను. దశకంఠుడు భూమిని కంపింపజేయుచున్నట్లు నడచివెళ్ళి, ప్రకాశించుచున్న సూర్యుని కాంతి వంటి కాంతిగల గృహములో ప్రవేశించెను. అతనితో కూడ వచ్చిన దేవకన్యలు, గంధ్వర్య కన్యలు, నాగకన్యలు నలువైపులా అతనిని పరివేష్టించి, ఆ శ్రేష్ఠమైన గృహములో ప్రవేశించిరి. 
 
రావణుడు ధర్మమార్గమునందు స్థిరముగా నిలిచి వున్న, భయముతో వణికిపోవుచున్న సీతను ఈ విధముగా భయపెట్టి, ఆమెను విడిచి మన్మథునిచేత మోహితుడై ప్రకాశించుచున్న తన గృహములోనికి ప్రవేశించెను. - దీవి రామాచార్యులు (రాంబాబు ---- ఇంకా వుంది (జానకి రామాయణం).