గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (11:21 IST)

తొండమాన్‌ చక్రవర్తికి అభయమిచ్చి శ్రీవారు శిలగా మారాడు...!

తొండమాన్‌ చక్రవర్తి. ఈయన విగ్రహం తిరుమల శ్రీవారి ఆలయం లోపలి భాగంలో ఇప్పటికీ ఉంటుంది. కారణం స్వామివారికి ఇష్టమైన భక్తుడు తొండమాన్‌. శ్రీవారి పేరు మీద ఎన్నో కట్టడాలను ఈయన నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
 
అలాంటి తొండమాన్‌ చక్రవర్తి కారణంగానే స్వామివారు శిలగా మారాడని కూడా పురాణాల్లో ఉన్నాయి. ఆనంద నిలయంలో శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిలు ఇద్దరు సరసల్లాపాలతో మునిగి ఉన్నారు. ఆ సమయంలో ప్రభువైన తొండమాన్‌ చక్రవర్తి రహస్య బిల మార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామీ వేంకటేశా... భక్తవత్సలా.. కాపాడు అంటూ వేడుకొన్నాడు.
 
తొండమాన్‌ శరణుకోరగానే శ్రీవారు తొండమాన్‌.. ముందు నా పాదాలను వదులు. అసలు ఏం జరిగిందో చెప్పు. నీకు ఏం భయం లేదు. ఎందుకింత ఆందోళనగా ఉన్నావు. నీ శరీరం చూడు.. ఎంత వణుకుతుందో. ముచ్చెమటలతో నీ దేహమంతా తడిసిపోయింది. ఎంత మాత్రం ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత తొండమాన్‌ పాదాల మీద నుంచి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొచ్చాడు.
 
నేను ఒక  ఘోరమైన పాపాన్ని చేశాను. ఆ మహాపాపాన్ని నేను తెలిసి చేశానో, తెలియక చేశానో నాకు అంతుబట్టడం లేదు. దానిని తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తున్నది స్వామి. శరణాగతవత్సులుడైన నీవు నాకు అభయ ప్రధానం చేయడం వల్ల నాకు పూర్తిగా ధైర్యం కలుగుతుంది. నేను చేసిన ఘోరమైన పాపాన్ని వివరిస్తాను స్వామి అన్నాడు.
 
రెండేళ్ళకు పూర్వం ఒకరోజు కూర్ముడు అనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు కాశీ క్షేత్రానికి పోతూ తన భార్యా పిల్లతో కలిసి నా దగ్గరకు వచ్చాడు. గర్భవతి అయిన తన భార్యను ఐదేళ్ల కుమారుడిని నాకు అప్పచెబుతూ నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్యాపిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు అని చెప్పాడు తొండమాన్‌. ఆ తర్వాత బ్రాహ్మణుని కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలుగజేశాను. అంతేకాదు వారికి ఇతరుల వల్ల హాని కలుగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా ఏర్పాటు చేశాను. కానీ విధి బలీయము. కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్న నాకు వారి సంగతి పూర్తిగా మరిచిపోయాను.
 
ఇలా రెండేళ్ళు గడిచిన తర్వాత కూర్ముడు తన కాళీ యాత్రను ముగించుకుని నా దగ్గరికి వచ్చాడు. నా భార్యాపిల్లలు ఎలా ఉన్నారు. నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చిందని అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాక. వెంటనే తాళం వేసిన భవనం వద్దకు వెళ్ళాను. గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి. బ్రాహ్మణునికి ఏం చెప్పాలో తెలియక... అన్నీ అబద్ధాలు చెప్పాను. నీకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అందరూ కలిసి మా వాళ్లలో వేంకటాచలపతి వెళ్ళారు. మరో రెండు రోజుల్లో వస్తారని చెప్పాను అని తప్పించుకుని ఇక్కడకు వచ్చానని చెప్పాడు తొండమాన్‌.
 
వెంటనే శ్రీవారు నువ్వు చేసింది మహాపాపం. నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావడంతో నీకు సాయం చేస్తున్నాను. వెంటనే అస్థికలను నా దగ్గరికి తీసుకురా అంటూ స్వామివారు తొండమాన్‌ చక్రవర్తికి తెలిపాడు. తొండమాన్‌ తీసుకువచ్చిన అస్థులను స్వామివారు పాండవ తీర్థానికి తీసుకెళ్ళారు. అ పక్కనే ఉన్న దేవఖాతంలో గొంతు వరకు నీళ్ళలో మునిగి అస్థుల్ని ఒడ్డు మీద ఉంచి వాటి మీద నీళ్ళు చల్లాడు. అంతే ఆ విప్రుని భార్యాపిల్లలు సజీవులయ్యారు. ఈ విచిత్ర సంఘటనకు దేవతలు పూలవాన కురిపించారు. అప్పటి నుంచి ఆ తీర్థం అస్థితీర్థం అని ప్రసిద్ధికెక్కింది. నరకంలో ఉన్న వారి అస్థుల్ని కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు.