గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 20 జూన్ 2016 (11:20 IST)

తిరుమలలో దాహం అన్న వారికి నీరు ఇవ్వకపోతే జంతువులై పుడతారు..! నిజమేనా?

మీరు చూస్తున్నది నిజమే. దప్పికగా ఉంది. కాస్త నీళ్లు ఇవ్వండి అంటూ ఎవరైనా భక్తుడు తిరుమల క్షేత్రంలో మిమ్మల్ని అడిగితే వెంటనే ఇచ్చేయండి. లేకుంటే ఖచ్చితంగా వచ్చే జన్మలో మీరు జంతువులై పుడతారని పురాణాలు చెబుతున్నాయి. ఇది నిజమని కూడా పురాణ పండితులు నిర్థారిస్తున్నారు. అసలు శ్రీవారు కొలువై ఉన్న తిరుమల గిరులలో ఎలాంటి దానాలు చేస్తే ఏవిధమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం...
 
తిరుమలలో మొదటగా ఎవరైనా అడిగితే చేయాల్సింది అన్నదానం. ఆ తర్వాత పితృదేవతలను సంతృప్తి పరిచే శ్రాద్ధవిధి. ఈ రెండు అత్యంత ఫలితాన్ని ఇస్తామని పురాణాలు చెబుతున్నాయి. అసలు విషయం ఏంటంట బంగారాన్ని దానం చేస్తే శాశ్వతమైన ఆనందప్రదమైన మోక్షం సిద్ధిస్తుందంట. అలాగే వస్త్రం దానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే స్వామివారికి గోదానం చేస్తే శాశ్వత విష్ణులోకంలో ఆ గోవుకు ఉన్న రోమముల సంఖ్య కనుగుణంగా పూజింపబడతారు. 
 
అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి. శ్రీనివాసుని పూజ కోసం కర్పూరం, చందనం, శంఖం ఆభరణాలను సమర్పించినట్లయితే మహాపాతకాలు నశిస్తాయి. స్వామికి భూములను విరాళంగా ఇస్తే సంసార బంధాలు తెగి గొప్ప గతిని పొందుతారు. స్వామివారికి రథాన్ని తయారు చేసేటపుడు నగదును అందజేస్తే కోటి కన్యాదానాలు, పదివేల గోవులను దానం ఇచ్చిన ఫలితం లభిస్తుంది. గొడుగు, విసన కర్రలు, చామరాలు, పుష్పమాలికలు, ఏనుగులు, గుర్రాలను సమర్పిస్తే చక్రవర్తి అవడమే కాకుండా పరమానందనాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. 
 
అష్టమి, చతుర్థశి, పున్నమి, సంక్రాంతి, అమావాస్య పర్వదినాల్లో స్వామివారికి ఉత్సవాలు చేయిస్తే వేలాది అపరాధాలు పోవడమే కాకుండా భోగ, మోక్షాలు లభిస్తాయి. స్వామి సన్నిధిలో ఆవునేతితో జ్యోతులను వెలిగిస్తూ తమను, తమ పూర్వీకులను స్మరించినట్లయితే అందరి పరమ పాతకాలన్నీ నశిస్తాయి. 
 
ఇలా ఒకటి కాదు.. ఎవరికి తోచిన దానాన్ని వారు చేస్తే ఖచ్చితంగా సుఖ.. సంతోషాలతో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఎక్కువమంది ప్రముఖులు స్వామివారికి ఆభరణాల రూపంలో కానుకలను సమర్పిస్తుంటారు. మరికొంతమంది నిత్యాన్నదాన పథకానికి చెక్కులను అందజేస్తుంటారు. ఇప్పుడర్థమయ్యిందా ఎందుకు శ్రీవారికి భక్తులు విరాళాలు అందిస్తున్నారో.... వెంకటరమణా... ఆపద్భాంధవా... గోవిందా.. గోవిందా...!