గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (16:07 IST)

గుణాతీతుడు అని ఎవడ్ని పిలుస్తారు? గీతలో కన్నయ్య ఏం చెప్పాడు?

గుణాతీతమైన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? గుణాతీతుడు ఎటువంటి లక్షణాలను కలిగి వుంటాడు? ఆ స్థాయిని చేరుకోవాలంటే ఎలాంటి మానసిక స్థితి, ఆచార వ్యవహారాలు కావాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే.. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇచ్చిన అద్భుతమైన విశ్లేషణ ద్వారా తెలుసుకోవచ్చు. 
 
సాత్త్వికమైన బుద్ధి కలిగి, సరైన జ్ఞానాన్ని సంపాదించి, ఆత్మస్థైరాన్ని పెంపొందించుకుని సాత్త్వికమైన తపస్సు ద్వారా, యజ్ఞం, దానాల ద్వారా గుణాతీత లక్షణం సాధించవచ్చునని కన్నయ్య గీతలో వివరిస్తాడు. 
 
సత్వగుణము కార్యరూపమైన సత్ఫలితములు సాధించగల ఉజ్వల ప్రకాశాన్ని కలిగిస్తుంది. రజోగుణం కార్యరూపమైన ప్రవృత్తిని మాత్రమే చూపుతుంది. తమోగుణం కార్యరూపమైన మోహమును కలిగిస్తుంది. ఈ మానసికమైన అవస్థలు తమంతట తామే ఏర్పడినప్పుడు గుణాతీతుడు ద్వేషింపడు. వానిని గురించి విచారపడడు. అవి వాటికై అవి తొలగినప్పుడు వాటికై ఆకాంక్షింపడు. అతడు ఎల్లప్పుడు అతీతమైన ఒకే స్థితిలో స్థిరంగా ఉంటాడు. 
 
గుణాతీతుడు అని పిలువబడేవాడు మానావమానాలను సమానంగా భావిస్తాడు. మిత్రులయందు మమకారముగానీ, శత్రువులయందు వికారము గానీ కలిగి ఉండడు. ఇద్దరియందూ సమభావాన్ని ప్రదర్శిస్తాడు. తను చేయాల్సిన కర్మలన్నింటినీ విద్యుక్తధర్మంగా భావించి త్రికరణశుద్ధిగా నిర్వహిస్తాడు. అయినప్పటికీ ఆయా కర్మల కర్తృత్వంపై అభిమానము లేక ఫలాలను భగవదార్పణం చేసేవాడు గుణాతీతుడు అనబడతాడు.