శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (13:58 IST)

తీర్థయాత్ర: తిరువూరు వెళ్లండి.. దోషాలు తొలగించుకోండి!

నవగ్రహ దోషాలే కాదు.. వాస్తు దోషాలతో పాటు అనేక దోషాలు తొలగిపోవాలంటే హనుమంతుడిని పూజించాల్సిందే అంటున్నారు... ఆధ్యాత్మిక నిపుణులు. అనేక దోషాలకు హనుమంతుడి దర్శనమే విరుగుడు.
 
కొన్ని పుణ్యక్షేత్రాల్లో వెలసిన హనుమంతుడిని పూజిస్తే విశేష ఫలితాలు చేకూరుతాయి. అలాంటి ప్రాచీన హనుమంతుడి క్షేత్రాల జాబితాలో కృష్ణా జిల్లా 'తిరువూరు' కీలకమైంది. ఇక్కడి స్వామి దాసాంజనేయుడుగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.
 
కాకతీయుల కాలంలో అనేక ప్రదేశాల్లో శివాలయాల నిర్మాణం జరిగింది. కొన్ని శివాలయాల ప్రాంగణంలో వాళ్లు వేణుగోపాలస్వామిని ప్రతిష్ఠించారు. మరికొన్ని ప్రదేశాల్లో శివాలయంతో పాటుగా శివాంశ సంభూతుడైన హనుమంతుడి ఆలయాలను నిర్మించారు. అలా కాకతీయ 'గణపతిదేవుడు' ఇక్కడి శివాలయం, హనుమంతుడి ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. 
 
అయితే కాలక్రమంలో ఇక్కడి శివలింగం ఏమైందన్నది ఎవరికీ తెలియదు గానీ..దాసాంజనేయస్వామిగా పేరొందిన హనుమంతుడు మాత్రం భక్తులచే పూజలందుకుంటున్నాడు. 
 
మనసులోని ధర్మబద్ధమైన కోరికను స్వామికి చెప్పుకుని మండలం పాటు రోజుకి పదకొండు ప్రదక్షిణలు చేసి... ముగింపు రోజున స్వామివారికి తమలపాకులతో పూజ చేయించవలసి వుంటుంది.
 
ఈ విధంగా చేయడం వలన నలభై రెండో రోజున ఆ కోరిక నెరవేరుతుందని చెబుతుంటారు. ఈ స్వామి అనుగ్రహంతో సంపదలు, సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం లభిస్తుంది.