గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By Raju

అసురుడిని పూజించే గ్రామం...

WD PhotoWD
రాక్షసుడిని పవిత్రమైన దేవుడిగా కొలిచి మొక్కడం మనం ఎక్కడైనా విన్నామా? ఏది నిజం సీరీస్‌లో భాగంగా ఈసారి మిమ్మల్ని ఆ రాక్షసుడి దగ్గరికే తీసుకుపోతాం మరి. చాలామంది భక్తులు ఇతగాడిని తమ ఇంటి ఇలవేల్పుగా నమ్ముతున్నారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో నందూర్ నింబాదిత్య అనే గ్రామం ఉంది. ఇక్కడ మీరు రాక్షసుడి ఆలయాన్ని చూడవచ్చు. ఇక్కడి ప్రజలు నింబాదిత్య పేరున్న రాక్షసుడికి పూజలు చేస్తూండటం విశేషం. ఈ ప్రాంతం విశేషం ఏమిటంటే ఇక్కడ నివసిస్తున్న వారు ఆంజనేయుడి పేరు ఉచ్ఛరించరు. పైగా ఈ ప్రాంతం సమీపంలో ఆంజనేయుడి దేవాలయం మచ్చుకైనా కనబదు.

ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్న దాని మేరకు రాముడు తన భార్య సీతను వెదకడంలో భాగంగా కేదారేశ్వర్‌లో ఉన్న వాల్మీకి మహర్షిని సందర్శించినపుడు ఇక్కడ కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో నింబాదిత్య భక్తిప్రపత్తులతో రాముని సేవించి, మెప్పించాడు. ఈ క్రమంలో రాముడి సేవకుడిగా మారాడు. అతని సేవలకు మెచ్చిన రాముడు ఈ గ్రామంలో చిరకాలం వెలసి ఉంటావని వరం ప్రసాదించాడు.


ఈ గ్రామ ప్రజలు నింబాదిత్యను ఇంటి ఇలవేల్పుగా భావించి పూజిస్తారు కాబట్టి ఇకపై వారు హనుమంతుడిని ప్రార్థించరని రాముడు చెప్పాడు. బయటి ప్రాంత
WD PhotoWD
నుంచి ఎవరైనా హనుమాన్ పేరుతో ఈ గ్రామాన్ని సందర్శించినట్లయితే మొదట అతడు తన పేరును మార్చుకున్న తర్వాతే గ్రామంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.

ఈ గ్రామ ప్రజలు దేశంలోనే సుప్రసిద్ధమైన బ్రాండ్ కారును ఎట్టి పరిస్థితుల్లోను ఉపయోగించరని ఏక్‌నాథ్ జనార్ధన్ పాల్వే అనే ఉపాధ్యాయుడు తెలిపారు ఆ కంపెనీ హనుమంతుడి పేరును కలిగి ఉండటమే ఇందుకు కారణం. ఈ గ్రామంలోని అనేక మంది ప్రజలు బ్రతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళతారు కానీ... నింబాదిత్య జాతర సమయంలో తప్పనిసరిగా తమ నివాస ప్రాంతాన్ని చేరుకుంటారు.

WD PhotoWD
ఒకసారి ఈ ప్రాంతంలో బురద నేలలో చెరకు బండి దిగబడిపోయింది. దాన్ని బయటకు లాగడానికి ఎన్నివిధాలుగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. అప్పడు వాహనం కేబిన్‌లో ఉన్న హనుమంతుడి ఫోటోను తొలగించాల్సిందిగా గ్రామంలో ఒకరు సలహా ఇచ్చారు. అలా ఫోటోను కేబిన్‌లోంచి తీసివేసిన తర్వాత బురదనేలలోంచి ట్రక్కును అవలీలగా లాగగలిగారు.

నింబాదిత్య ఆలయాన్ని హేమంద్‌పంతి అనే అతను నిర్మించాడని పోలీస్ కానిస్టేబుల్ అవినాశ్ గార్జే పేర్కొన్నారు. ఈ గ్రామం మొత్తం మీద ఇదొక్కటే రెండు అంతస్థులను కలిగి ఉంది. ఎందుకంటే.. నింబాదిత్యపై భక్తిభావంతో ఈ గ్రామస్థులు తమకోసం రెండంతస్థుల భవంతులను నిర్మించుకోలేదు. ఈ ఆలయం ముందు పెద్ద మర్రి చెట్టు ఉంది. ఈ రాక్షసేశ్వరుని పట్ల ప్రజలు ఎంత వీరారాధన కలిగి ఉన్నారంటే ఇక్కడి ప్రతి భవంతిమీద, షాపులపై, వాహనాలపై నింబాదిత్య ఆశీస్సులతో కూడిన సూక్తులు రాయబడి ఉంటాయి. గ్రామానికి బయటినుంచి వచ్చే అందరికీ ఇవి కనిపిస్తాయి.

ఈ గ్రామంలో ఇళ్లమీద, మోటారు బైకుల మీద, షాపుల మీద అన్ని చోట్లా నింబాదిత్య పేరు కనబడుతుంది. ఈ గ్రామంలో హనుమంతుడిని అపశకుని (దురదృష్టాన్ని కొనితెచ్చేవాడు) అని పిలుస్తారు. మరోవైపు నింబాదిత్యను ప్రజలు ఇంటి ఇలవేల్పుగా భావిస్తుంటారు. ఒక రాక్షసుడిని ఇంటి ఇలవేల్పుగా ప్రజలు పూజించడం వింతగా ఉంటుంది కానీ, ఇది నింబాదిత్య గ్రామానికి సంబంధించిన వాస్తవం.
ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే దయచేసి మాకు వ్రాయండి.