శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By WD

నిప్పుతో చెలగాటం

WD
మండుతున్న పుల్లలతో దేహానికి మర్ధనం, తగలబడుతున్న బొగ్గులపై నృత్యం చేసినప్పటికీ గాయాలు కనిపించవు. ఏదినిజం శీర్షికలో భాగంగా కేరళలోని పాలక్కడ్‌కు చెందిన షోరనూర్ సమీపంలోని ఒక చిన్న పల్లెటూరికి మిమ్మల్ని తీసుకు వెళ్తున్నాం. భక్తి పారవశ్యంలో శరీరాన్ని కాల్చుకునే కొందరు ప్రజలు మనకు అక్కడ కనిపిస్తారు. మండుతున్న పుల్లలతో శరీరానికి మర్ధనం చేసుకున్నప్పటికీ వారి దేహాలపై ఎలాంటి గాయాలు కనిపించవు. ముఖంపై నొప్పి తాలూకు బాధ అసలే ఉండదు.

శబరిమల యాత్రను ప్రారంభించే ముందు అయ్యప్ప జ్యోతి ఉత్సవాన్ని భక్తుల బృందం చేపడుతుంది. ఈ ఉత్సవాన్ని ప్రధానంగా కేరళలోని మధ్య మరియు ఉత్తర ప్రాంతాలలో నిర్వహిస్తుంటారు. అంతేకాక భారతదేశంలోని పలు ప్రాంతాలలో అయ్యప్ప జ్యోతి ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఒక భక్తుడు, ఒక కుటుంబం, ఒక సంస్థ లేదా భక్త జన బృందం అయ్యప్ప జ్యోతి ఉత్సవాన్ని జరుపుకుంటారు.
WD


అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి కొబ్బరి ఆకులు, కొబ్బరి చెట్టు కాండంతో శబరిమల దేవాలయాన్ని పోలినట్లుగా ఉండే దేవాలయాన్ని ఉత్సవంలో భాగంగా నిర్మిస్తారు. దేవాలయ నిర్మాణ రూపకల్పనలో నిష్ణాతులైన బృందం పాలుపంచుకుంటుంది. దెయ్యాలు నివసిస్తుంటాయని చెప్పబడే 'పాల' చెట్టు తాలూకు కొమ్మలు, సాంప్రదాయబద్ధమైన 'తాలప్పొలి' (దీపాలతో కూడిన పళ్ళాలు) మరియు డప్పు వాయిద్యాలతో కూడిన ఊరేగింపు సాయంకాలానికి ఉత్సవం జరిగే ప్రాంతానికి చేరుకుంటుంది.
WD
అయ్యప్ప భజనలు, పూజలను ఘనంగా జరుపుతారు. పురావృత్త సంబంధితమైన ముస్లిం వ్యాపారి, వావర్ యోధునితో అయ్యప్ప స్వామి చేసిన యుద్ధానికి కన్నులకు కట్టినట్లుగా అయ్యప్ప భక్తులు అభినయిస్తారు. బాగా పొద్దుపోయిన అనంతరం, దాదాపు అర్థరాత్రి కావొస్తుండగా అసలు కార్యక్రమం మొదలవుతుంది. భక్తులలో కొందరు కాలుతున్న రెండు పుల్లలతో తమ దేహాన్ని మర్ధన చేసుకోవడం ప్రారంభిస్తారు.

మర్ధన కార్యక్రమాన్ని 'చెండా' (డప్పు) వాయిద్యానికి అనుగుణంగా కొనసాగిస్తుంటారు. ఇలా గంటసేపు నిప్పు పుల్లలతో మర్ధన చేసుకున్నప్పటికీ వారి దేహాలపై చిన్నపాటి గాయం కూడా కనిపించదు. అయ్యప్ప స్వామి కృపతోనే వారికి ఎటువంటి హాని కలగలేదని భక్తులు విశ్వసిస్తుంటారు.
WD


'కనల్ ఆట్టమ్'గా ప్రసిద్ధి పొందిన తగులబడుతున్న బొగ్గులపై నడిచే కార్యక్రమంలో భక్తులు పాల్గొంటారు. అయితే ముందుగా పొందిన శిక్షణ కారణంగా వారికి ఎలాంటి గాయాలు కలగవని కొందరు తేల్చిచెప్పగా, అయ్యప్ప నామస్మరణ మహిమతో సాహస కార్యంలో పాల్గొన్న వారికి ఎటువంటి గాయాలు కలగవని భక్తుల విశ్వసిస్తుంటారు. ఈ ఉదంతంపై మీ అభిప్రాయాన్ని దయచేసి మాకు తెలియజేయండి.