తంజావూర్ సమీపంలో పవిత్ర స్మశానం

WD


Raju|
ఒక స్మశానం పవిత్రమైనదిగా బావించబడుతుందని, దానికి సమీపంలో ప్రవహించే ఒక నది గంగానదిలా పరిగణించబడుతుందంటే మీరు నమ్మగలరా? ఈ వారం ఏదినిజం శీర్షికలో భాగంగా ఈ వివరాలను మీ ముందు ఉంచుతున్నాం.

తంజావూరు పట్టణం సమీపంలోని ఒక నది గట్టున ఉన్న స్మశానాన్ని, గంగానది గట్టుమీద ఉండే ఘాట్‌ వంటి పవిత్ర స్థలంలా స్థానికులు భావిస్తున్నారు. తంజావూరులోని పలు కుటుంబాల పెద్దలు తాము చనిపోయాక తమను రాజగోరిలోనే పూడ్చి పెట్టమని లేదా దహనం చేయమని తమ కుటుంబ సభ్యులకు చెబుతుండటాన్ని మేము విన్నాము. అలాగే తమ అంత్యక్రియలను 'వడవారు' అని పిలవబడే నది గట్టుమీదే నిర్వహించమని వీరు కోరుకుంటూ ఉండటం కూడా మేము వినడం జరిగింది.

చెప్పాలంటే అంతటి పెద్ద ఘాట్... ఇప్పటి వరకూ మేము ఎక్కడా చూడలేదంటే నమ్మండి. ఎక్కడా చూడనంత సంఖ్యలో ఇక్కడ మరణించినవారు కొలువై ఉంటున్నారు. శవాలను పూడ్చే లేదా కాల్చేవారు చెప్పేదాన్ని బట్టి రోజులో ఏ సమయంలో అయినా ఇక్కడ 20 శవాలు కాలుతూ ఉంటాయని తెలిసింది.

అంత్యక్రియలు జరిపే ఘాట్‌కు అవతలివైపున మేం అనేక సమాధులను చూశాము. వాటి గురించి మేము విచారిస్తే, అవి తంజావూరు రాజకుటుంబానికి సంబంధించినవని, ఇతర ఘాట్లు బ్రాహ్మణులు, నాయక్‌లు మొదలైనవారివని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా కులాలవారీగా సమాధులు ఇక్కడ ఉంటూ ఉండటమే విశేషం.

కావేరీ ఉపనది అయిన వడవారు సాక్షాత్తూ గంగానదే అని స్థానికుల విశ్వాసం. చనిపోయిన తమ బంధువులను ఇక్కడ పూడ్చిపెట్టేవారు, దహనం చేసేవారు తర్వాత ఈ నదిలో స్నానమాచరిస్తారు. ఈ నదిలో ఒక్కసారి మునిగితే చావుకు సంబంధించిన అన్ని దోషాలు తొలిగిపోతాయని వీరు చెబుతారు.
మన దేశంలో ఆలయాలు, చర్చిలు, మసీదులు, బౌద్ధ ఆరామాలు జైన మందిరాలు లేని చోటు అంటూ ఉండదు. అయితే తంజావూరు వంటి చారిత్రక పట్టణంలో ఒక స్మశానాన్ని స్థానికులు పవిత్రమైనదిగా భావిస్తుండటమే విశేషం. ఆశ్చర్యకరమైన ఇటువంటి పవిత్ర స్థలాల గురించి మీరు విని ఉంటే దయచేసి మాతో పంచుకోండి.


దీనిపై మరింత చదవండి :