మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By PNR

కాలిమా దేవిని శాంతపరిచే రక్తార్పణ

WD PhotoWD
ప్రస్తుత ఆధునిక యుగంలో రక్తార్పణ జరుగుతుందని మీరు భావిస్తారా? ద్రవిడ సంస్కృతిలో తమ ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పలు రకాల పూజలతో పాటు.. బలిదానాలు, రక్తార్పణలు చేసేవారట. ఇలాంటి కథలను చదువుతుంటే మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఈ వారం 'ఏది నిజం' శీర్షికలో అతి పురాతనమైన ఆచారాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ ఆచారం ప్రకారం పురుషులు ముళ్ళ కర్రలపై దొర్లుతూ ఇష్టదైవమైన కాలిమా దేవికి రక్తార్పణ చేసే ఉత్సవాన్ని మీరు చదవండి.

'అడవి' అనే ఈ పురాతన ఆచారం (ముళ్ళ కర్రలపై దొర్లుట) కేరళ రాష్ట్రంలోని కురంపాలా దేవి ఆలయంలో జరుగుతుంది. ఈ ఆలయం ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి వంద కిలోమీటర్ల దూరంలో వెలసి వుంది. ప్రత్యేక సంప్రదాయం పేరుతో నిర్వహించే ఈ ఉత్సవం ప్రతి ఐదేళ్ళకొకసారి జరుగుతుంది. పాదయాణిలోని తొమ్మిదో రోజున అడవి ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆచారంలో భక్తులు తమ రక్తాన్ని కాలిమా దేవికి అర్పించి ప్రసన్నం చేసుకుంటారు.

సంగమ కాలం నుంచి ఈ ఆచారం జరుగుతున్నట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. వేలన్ అనే పూజారి కురుంపాలా ఆలయాన్ని దాటుకుని వెళేటపుడు, ఆలయంలో కొన్ని ప్రత్యేక పూజలు చేసేవాడట. ఆ సమయంలో వేలన్‌తో ఉన్న అడవి అనే పేరుగల వ్యక్తిని ఈ ఆలయంలోని దేవత తనలో లీనం చేసుకున్నట్టు, అప్పటి నుంచి ఈ దేవతకు రక్తార్పణ చేస్తూ పూజలు చేయడం ప్రారంభించినట్టు పురాణాలు చెపుతున్నాయి.

WD PhotoWD
ఈ ఆలయంలో జరిగే పాదయాణి ఉత్సవాల్లో తొమ్మిదో రోజున ఆలయం చుట్టూత ముళ్ళ కర్రలను వేస్తారు. ఇందులో పాల్గొనే భక్తులకు ఆలయ పూజారి విబూదితో దీవిస్తాడు. సాయంత్రం పలు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అనగా అర్థరాత్రి సమయంలో అడవి ఆచారం ఆరంభమవుతుంది. పూజారి నుంచి విబూది స్వీకరించిన భక్తులు ముళ్ళ కర్రలపై పరుండి దొర్లుతారు.

ఇలా ఆలయం చుట్టూత తిరిగిన తర్వాత భక్తుల శరీరంలో గుచ్చుకున్న ముళ్ళులను పూజారి తొలగిస్తారు. ముళ్లులను తొలగించడం వల్లే రక్తాన్ని తీసుకెళ్లి కాలిమా దేవికి సమర్పిస్తారు. ఈ ఉత్సవంలో పాల్గొని, రక్తాన్ని సమర్పించిన భక్తులు ఆ ఆచారంపై స్పందిస్తూ... ఇలా చేయడం వల్ల తమకు ఎలాంటి శ్రమ, కష్టంగా లేదని అంటున్నారు.

ఇలాంటి పురాతనమైన ఆచారం ఇంకా కొనసాగడం పట్ల మీరేమంటారు. దీనిపై మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి.