శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By Venkateswara Rao. I

కోరికలు నెరవేరితే జంట పాముల మొక్కుబడి

కోరికలు కోరుకోవడంలో మన దేశ ప్రజలకు ప్రపంచంలో ఎవరూ సాటిరారు. తమ కోరికలను తీర్చుకోవడానికి భారతీయులు ఏమైనా చేస్తారు. మధ్యప్రదేశ్‌లోని బర్హాన్‌పూర్‌లో ఉటావలి నది సమీపంలో ఉన్న నాగమందిర్ ఇలాంటి ఉదంతానికి తాజా ఉదాహరణగా నిలుస్తోంది. అనేకమంది ప్రజలు తమ కోరికలను తీర్చుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. తమ కోరికలు నెరవేరినప్పుడు ఈ మందిరానికి వారు జంటపాములను మొక్కుబడిగా ఇస్తుంటారు. వివరాల్లోకి వెళితే.....

బర్హాన్‌పూర్ పట్టణం శివార్లలో ఉటావలి నది నెలకొని ఉంది. ఈ నది సమీపంలో అద్వాల్ కుటుంబానికి చెందిన ఓ గుడి ఉంది. రుషి పంచమినాడు -గణేష్ చతుర్థి తర్వాతి రోజు- అనేక మంది ప్రజలు ఈ ఆలయానికి వస్తుంటారు. కొంతమంది కోరికలు అడగడానికి వస్తుంటే, మరి కొంతమంది కోరికలు తీరినవారు జంట పాములను మొక్కుబడిగా ఇవ్వడానికి వస్తుంటారు.

ఉద్యోగాలు కావాలని, వ్యాపారంలో లబ్ది చేకూరాలని కోరుకుంటూ ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. సంతానం కావాలని వచ్చేవారు, శారీరక, మానసిక సమస్యలు పరిష్కరించుకోవాలని వచ్చేవారితో రుషి పంచమి రోజున ఆలయం కిటకిటలాడిపోతుంది. తమ కోరికలు నెరవేరినవారు ఆ రోజున ఇక్కడికి వచ్చి ఆలయానికి జంట పాములను మొక్కుబడి కింద చెల్లిస్తారు. ఈ పాములను స్థానికంగా నివసించేవారి వద్ద భక్తులు కొనుక్కుంటూ ఉంటారు.
WD


గత 25 ఏళ్లుగా తాను ఇక్కడికి వస్తున్నట్లుగా దిలీప్ యాదవ్ అనే భక్తుడు తెలిపారు. కోరికలు నెరవేరినప్పుడల్లా ఇతను ఆలయానికి జంటపాములను నజరానాగా ఇస్తుంటారు. ఈ గుడికి వచ్చి కోరుకుంటే చాలు తమ కోరికలు అన్నీ నెరవేరుతాయని దిలీప్ యాదవ్ చెబుతారు.

WD
ఈ సంప్రదాయం వెనుక ఓ గాథ ఉన్నది. దానిప్రకారం ఒకానొకప్పుడు కొంతమంది సైనికులు గుర్రాలపై అడవులలో ప్రయాణిస్తూ ఉండేవారు. దారిపక్కన ముళ్లలో ఇరుక్కుపోయి బయటకు రాలేక విలవిల్లాడుతున్న పాము ఒకటి మానవ రూపం దాల్చి వారిని సాయం అడిగిందట. సైనికులు ఆ ముళ్లను తొలగించి పామును రక్షించారట.

అప్పుడు తనకు సాయం చేసిన వారిని ఆ సర్పదేవత ఆశీర్వదించింది. ఈ ఆలయానికి ఎవరు వచ్చి వరాలు కోరుకున్నా అవి నెరవేరుతాయని ఆ సర్పదేవత ఆశీర్వదించిందట. అప్పటినుంచి సర్పదేవత కొలువై ఉన్న ఈ అద్వాల్ నాగమందిరాన్ని తరతరాలుగా ఆద్వాల్ కుటుంబం కాపాడుకుంటూ వస్తోంది. అందుకనే వారు నాగమంత్రి అని పిలువబడుతున్నారు.

కోరికలు నెరవేర్చుకోవడానికి సుదూర ప్రాంతాలనుంచి కూడా భక్తులను రప్పించుకునే ఏకైక నాగమందిరం ఇదేనని అద్వాల్ కుటుంబానికి చెందిన అనిల్ భవసాగర్ చెప్పాడు. పూజలు, విశ్వాసాల వరకు మాత్రమే ఈ ఉదంతం పరిమితమైతే ఏ ప్రమాదమూ లేదు. అయితే నిస్సహాయ జంతువులకు హానికరంగా మారినప్పుడు ఇది తప్పుడు తంతు అవుతుంది.

రిషిపంచమి ముందురోజున పాములు పట్టేవారు ఈ పాములను పట్టుకుని వాటిని దుర్భర పరిస్థితుల్లో ఉంచుతారు. అయితే విశ్వాసం, సాంప్రదాయం పేరుతో ఈ తంతును కొనసాగించడం మంచిదేనా! కేవలం విశ్వాసాలకోసం, నమ్మకాల కోసం పాములను పట్టి బంధించి, బాధించడం సమంజసమేనా.... దయచేసి ఈ ఉదంతంపై మీ అభిప్రాయాలు మాకు పంపిచండి.