శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

గాల్ పండుగ విశిష్ట సంప్రదాయం

WD PhotoWD
ఏది నిజం శీర్షికలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో జరిగే ఓ ప్రత్యేక కర్మకాండను ఈ వారం మీకు పరిచయం చేస్తున్నాము. ఈ ఆచారాన్ని చూశాక మీరు భయభ్రాంతులకు గురి కావచ్చు. అయితే ఇది మేఘనాధుడిని గిరిజనులు కొలుచుకునే ప్రత్యేక కర్మకాండలో భాగం మరి. మధ్యప్రదేశ్ గిరిజనుల్లో బాగా ప్రాచుర్యం పొందిన గాల్ పండుగ సందర్భంగా, ఈ ఆచారాన్ని మనం చూడవచ్చు.

ఈ ప్రాంతంలోని గిరిజనులు తమ ఇలవేల్పు అయిన మేఘనాథుడిని తమ కోర్కెలు తీర్చమని మొక్కుకుంటారు. కోర్కెలు నెరవేరితే గాల్‌పై కోరిన సంఖ్యలో చుట్లు తిరుగుతామని మేఘనాథుడికి మొక్కుకుంటారు. గాల్ అంటే కాంటిలివర్ వంటి రూపంలో వెదురుతో తయారుచేయబడిన ఒక కొక్కీ. ఇది భూమికి కాస్త ఎత్తులో ఉంటుంది.
WD PhotoWD


భక్తులు తమ కోర్కెలు నెరవేరినప్పుడు ఈ వేదికపైకి ఎక్కుతారు. అక్కడ వారి వీపులపై రెండు పెద్ద ఇనుప కొక్కీలను తగిలిస్తారు. భక్తుడి శరీరం మొత్తం గాలిలో వేలాడుతూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎన్ని సార్లు గాల్‌పై వేలాడుతూ తిరుగుతామని భక్తులు మొక్కుకుని ఉంటారో, అన్ని సార్లు ఇలా గాలిలో భ్రమణం చేశాక తిరిగి కిందికి వస్తారు. ఇలా వెదురుతో చేయబడిన గాల్‌పై వేలాడి చుట్టూ తిరిగిన వారిని ‘పడియార్’ అని పిలుస్తారు. కొక్కీలపై ఇలా వేలాడి తిరుగుతున్నప్పుడు తమకు ఏ విధమైన నొప్పి కలగదని పడియార్లు చెబుతుంటారు.
WD
ఈ పడియార్లలో ఒకరైన భవార్ సింగ్ మాతో ఇలా చెప్పాడు. గత సంవత్సరం ఇక్కడకు వచ్చి తనకు మగ బిడ్డ పుట్టాలని మొక్కుకున్నాడట. సంవత్సరం లోపే తన కోరిక నెరవేరింది కాబట్టి కొక్కీకి వేలాడటం ద్వారా అతడు మొక్కు తీర్చుకుంటున్నాడు. మేఘనాధుడికి ఇలా కృతజ్ఞత తెలుపుతున్నాడు మరి.

ఈ సంప్రదాయం చరిత్రలో ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలీదు కానీ, శతాబ్దాలుగా గిరిజనులు ఈ ఆచారాన్ని విధిగా పాటిస్తున్నారు. రావణాసురుడి పుత్రుడైన మేఘనాధుడిని వీరు తమ దైవంగా భావించి పూజిస్తుంటారు. మేఘనాథుడి పట్ల గౌరవ సూచకంగా ఈ ఆచారాన్ని వారు పాటిస్తుంటారు.

ఈ ఆచారాన్ని పాటించడానికి ముందుగా పడియార్లు ద్రాక్ష సారా సేవిస్తారు. విపరీతంగా తాగుతారు కాబట్టి కొక్కీకి వాళ్ల వీపును వేలాడదీసినా నొప్పి అనిపించదు మరి. ఈ సందర్భంగా మరొక పడియార్ అయిన పర్మార్ సింగ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తాను ఈ సాంప్రదాయాన్ని పాటిస్తుంటానని కానీ తనకు ఎప్పుడూ నొప్పి అనిపించలేదని చెప్పాడు.
WD PhotoWD


ఈ ఆచారాన్ని పాటించేందుకు కొద్ది రోజులకు ముందుగా పడియార్ల వీపులపై పసుపును రాస్తారు. అయితే ఈ ఆచారాన్ని పాటిస్తున్నప్పుడు అనేకసార్లు పడియార్లు గాయపడుతుంటారు. ఒక్కోసారి వారి శరీరాలనుంచి రక్తం కారుతుంటుంది. వైద్యులు చెప్పేదాని ప్రకారం ఇది అనేక ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. అయితే ఇది తాము ఎన్నటికీ ఆపివేయకూడని సాంప్రదాయంలో భాగమని పడియార్ల విశ్వాసం. మరి, ఈ సంప్రదాయం గురించి మీరేమనుకుంటున్నారు?