గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By Venkateswara Rao. I

నల్ల శాలువా కప్పి బాదితే రోగాలు మటుమాయం

ఎలాంటి మందులూ వాడకుండా నల్లశాలువాను ధరించడం ద్వారా వ్యాధులను నయం చేయవచ్చా? ఏది నిజం శీర్షికలో భాగంగా ఈ వారం ఇటువంటి అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాం. దుర్గామాత ఆశీస్సులతో ఎలాంటి వ్యాధినైనా నయం చేస్తానని చెబుతున్న ఒక అసాధారణ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాం...

మధ్యప్రదేశ్‌లోని బర్హాన్‌పూర్‌కు చెందిన బడగావ్ గ్రామంలో గణేష్ భాయి అనే వ్యక్తి నివశిస్తున్నాడు. వ్యాధులకు అతడు చేసే చికిత్స వింతగా ఉంటుంది. తన శాలువాను రోగికి కప్పి, తర్వాత రోగిని చేతులతో కుళ్లబొడుస్తాడు. అతను అవలంభించే ఈ పద్ధతితోపాటు దుర్గామాత ఆశీర్వాద బలమూ తోడవడంతో ఎయిడ్స్, మధుమేహం, పక్షవాతం, పోలియో, కేన్సర్ వంటి వ్యాధిగ్రస్తుల రోగాలను మాయం చేస్తానంటున్నాడు.

ఈ కొత్తరకం చికిత్సకోసం అనేకమంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ చికిత్స కోసం ఒక్కో రోగి మూడు నుంచి 5 సార్లు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. గణేష్ భాయి వైద్యం ప్రజల్లో బాగా పేరు పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి జనం వస్తుండటం కద్దు.
WD


మీరు నమ్మండి నమ్మకపోండి ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతుంది మరి. ప్రతిరోజు ఇక్కడికి వందలాది మంది భక్తులు వస్తుంటారు. స్థానిక పోలీసులు గణేష్ భాయి పట్ల అపార విశ్వాసం ప్రకటిస్తూ, భక్తులను శ్రద్ధగా చూసుకుని ఇబ్బందులు లేకుండా చేస్తారు కూడా.

WD
ఇక్కడ మరో విశేషమేమిటంటే తనను బాబా, మహరాజ్ వంటి పేర్లతో పిలిస్తే గణేష్ భాయి అస్సలు ఒప్పుకోడు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే తన చికిత్సతో ప్రజలు తమ వ్యాధులను ఎలా నయం చేసుకుంటున్నారనే విషయం కూడా తనకు తెలీదు మరి. దుర్గా దేవి ఆశీర్వాదం, అద్భుత మహిమ వల్లే ఇదంతా జరుగుతుందని అతడి విశ్వాసం.

గణేష్ భాయి భక్తులలో ఒకరు అతనికి 12 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూమిలో దుర్గామాత ఆలయాన్ని కట్టేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం అతడు భక్తులనుంచి విరాళాలను కూడా స్వీకరిస్తున్నాడు. అన్ని ఇతర వ్యాపారాల్లాగే గణేష్ భాయి వ్యాపారం కూడా జోరుగానే ఉంది. గణేష్ భాయి భక్తులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. డాక్టర్ కంటే గణేష్‌ భాయినే ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారంటే ఆశ్చర్యపడాల్సింది లేదు.
WD


ఈ ఉదంతంలో అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే... గణేష్ భాయి నిజంగా రోగికి చికిత్స చేస్తున్నాడా? లేక స్థానిక యంత్రాంగం సహాయంతో అమాయక ప్రజలను కొల్లగొడుతూ, వారిచ్చే డబ్బులతో ఆటాడుకుంటున్నాడా? ఈ విషయంలో మీ అభిప్రాయాలు తెలుసుకోగోరుతున్నాం. ఈ కొత్త తరహా చికిత్సా విధానంపై దయచేసి మీ అభిప్రాయం మాకు వ్రాయండి...