శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By WD

పక్షవాతాన్ని నయంచేసే పవిత్ర స్నానం

Shruti AgarwalWD
సనాతన సంప్రదాయాలకు, ఆచారాలకు భారత దేశం పుట్టినిల్లు. ఈ దేశంలో ప్రజలలో నెలకొన్న నమ్మకాలు, విశ్వాసాలు ఎన్నో అద్భుతాలకు ఆలవాలంగా నిలుస్తున్నాయి. అలాంటి అద్భుతాల శ్రేణిలో మేమందిస్తున్న ఈ అద్భుతం మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆ అద్భుతమేమిటో తెలుసుకుందాం... రండి.
ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో " భాడవ మాత " దేవాలయం కొలువై ఉన్నది. భాడవమాత దేవాలయం 700 సంవత్సరాల నాటిదని స్థానికులు విశ్వసిస్తారు. ఇక ఈ దేవాలయానికి గల విశిష్ఠత ఆధునిక వైద్య శాస్త్ర నిష్ణాతులకు సైతం అంతుపట్టనిదిగా ఉన్నది. ఆ విశిష్ఠత ఏమిటంటే... దేవాలయంలోని భావ్డీగా పిలువబడే కొలనులో స్నానమాచరించినట్లయితే పక్షవాతం తదితర వ్యాధులు ఇట్టే మాయమైపోతాయి.
Shruti AgarwalWD


పక్షవాత వ్యాథిగ్రస్తులకు భావ్డీ జలం మంత్ర జలంలా పనిచేసి వారి అనారోగ్యాన్ని మాయం చేస్తుంది. ఇదిలా ఉండగా భావ్డీ మాత దేవాలయం భీల్ గిరిజన తెగకు చెందిన ప్రజల విశ్వాసం నుంచి అవతరించిందని ప్రధాన నిర్వాహకుడు విశ్వనాథ్ గెహ్లట్ మాటల ద్వారా తెలుస్తున్నది. మరింత వింత కలిగించే విషయమేమిటంటే... దేవాలయ ప్రధాన అర్చకులుగా బ్రాహ్మణులకు బదులుగా భేల్ తెగకు చెందినవారు వ్యవహరిస్తుండడం...

ఇక దేవాలయ ప్రత్యేకతను గురించి విశ్వనాథ్ గెహ్లాట్ ఇంకా ఏమంటున్నారంటే... " ఎన్నెన్నో అద్భుతాలకు, ఆశ్చర్యపరిచే ఉదంతాలకు దేవాలయం పెట్టింది పేరు. దేవాలయంలోని అతి పురాతనమైన కొలనులో స్నానమాచరించిన పక్షవాత రోగగ్రస్థుల వ్యాధి ఇట్టే నయమైపోతుందని దేవాలయాన్ని సందర్శించే భక్తుల ప్రగాఢ విశ్వాసం." ఆయన ఇంకా ఇలా చెపుతున్నారు... " నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. తమ కోర్కెలు తీర్చమంటూ భక్తులు అశేషంగా దేవాలయాన్ని సందర్శిస్తారు.
మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

Shruti AgarwalWD
కొన్నేళ్ళ క్రితం భక్తుల రద్దీని నియంత్రించడంలో కొన్ని లోపాలు తలెత్తాయి. అందుకని అప్పట్నుంచి కొలనులో భక్తుల స్నానాన్ని నిషేధించాము. దానికి బదులుగా పవిత్ర జలాన్ని ట్యాంకులలో నింపి స్నానాలగదులలో ఏర్పాటు చేసిన కొళాయిల ద్వారా భక్తులు స్నానమాచరించే సదుపాయాన్ని కల్పించాం. స్త్రీ, పురుషులకు స్నానాల గదులను వేర్వేరుగా నిర్మించాం"
ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నేపధ్యంలో నిజ నిర్దారణ కోసం అంబారామ్జీ అనే భక్తునితో మాట్లాడగా.. ఆయన ఏమన్నారంటే..." గత మూడేళ్లుగా నేను పక్షవాతంతో బాధపడుతున్నాను. తొమ్మిదిరోజులపాటు ఇక్కడ నివాసం ఉండడంతో నాకు కొంత ఉపశమనం కలిగింది. మూడేళ్ళ తర్వాత, నేను నా కాళ్ళపై నిలబడగలుగుతున్నాను. మాత సంపూర్ణ ఆశీస్సులతో ఈ శనివారం లేదా ఆదివారం నాటికి నేను పూర్తి ఆరోగ్యవంతుడను కాగలనన్న ప్రగాఢ విశ్వాసం నాకుంది ".
Shruti AgarwalWD


ఈ విశ్వాసం కేవలం అంబరామ్జీకే పరిమితం కాలేదు. పవిత్ర స్థల మహత్యంతో తమకున్న వ్యాధులు నయం కావాలని, మాత కరుణాకటాక్షాలు తమపై ప్రసరించాలని వేడుకునేవారు దేవాలయ ప్రాంతంలో మనకు అడుగుడుగునా తారసపడతారు. ఇక అశోక్ సంగతికొస్తే... పక్షవాతం నయం కావాలని ఐదు రోజుల క్రితం అశోక్ దేవాలయానికి చేరుకున్నాడు. పవిత్ర జలాలతో స్నానమాచరించడంతో అశోక్ పూర్తి ఆరోగ్యవంతుడవుతాడన్న విశ్వాసం అశోక్ తల్లిదండ్రుల మాటల్లో ద్యోతకమైంది.

పవిత్ర జలాల మరో కోణాన్ని దుకాణ యజమాని రాధేశ్యామ్ తెలియజేసాడు. మానవ దేహంలో రక్త ప్రసరణను వృద్ది చేసే రసాయనాలు పవిత్ర జలాలలో ఉన్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కొలనులోని జలాలకు ఔషధ లక్షణాలు ఆపాదించి, పక్షవాత వ్యాధి నివారణలో, రసాయనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వారి పరిశోధనల్లో తేటతెల్లమయ్యిందని రాధేశ్యామ్ ద్వారా తెలుసుకున్నాం.
మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.

Shruti AgarwalWD
ఇక సైన్సు కోణం నుంచి విశ్వాసం వైపు తొంగి చూస్తే... ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి వేళల యందు భక్తుల శారీరక రుగ్మతలను పారద్రోలేందుకు భాడవ మాత దేవాలయ ఆవరణలో నడయాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుచేతనే రాత్రి పూట దేవాలయ పరిసర ప్రాంతాలలో భక్తులు నిద్ర చేయడమనేది అనాది కాలంగా వస్తున్న సాంప్రదాయంగా మారింది. ఇక భక్తులు మాతను ప్రసన్నం చేసుకోవడానికి కోళ్ళను, మేకలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
ఫోటో గ్యాలరీకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మాతకు హారతి ఇచ్చే సమయంలో గర్భగుడిలోకి చేరుకునే భక్త జన సందోహంతో దేవాలయం కిటకిటలాడుతూ ఉంటుంది. పవిత్ర జలాల ప్రాశస్త్యం సర్వత్రా వ్యాపితమై దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతుండగా... మరో వంక పవిత్ర జలాల మర్మమేమిటో వెలికితీసెందుకు శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తున్నారు. పక్షవాతం తదతిర నరాలకు సంబంధించిన వ్యాధులను నయం చేసే ఔషధ గుణం కొలనులోని జలాలకు ఉందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
Shruti AgarwalWD


ఇదిలా ఉండగా... నాణానికి మరోవైపు అన్న రీతిలో... పవిత్ర జలాల కారణంగా వ్యాధులు నయమైన దాఖలాలు లేవని కొందరు బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు. ఏడు శతాబ్దాలనాటి భాడవ మాత దేవాలయంలో అమ్మవారిని దర్శించుకునే ముందు కొలనులో స్నానమాచరించడం ఒక ఆచారంగా వస్తూ ఉన్నది. ఆచారంలో భాగంగా కొలనులోని జలాలకు వ్యాధులను నయం చేసే శక్తులు ఉన్నట్లు భక్తులు కనుగొన్నారు.

ఇంకేముంది నమ్మకానికి విశ్వాసం తోడై కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ దాకా ఆ నోటా ఈ నోటా ప్రాచుర్యం పొంది పక్షవాతాన్ని నయం చేసే పవిత్ర జలంగా భాడవ మాత దేవాలయంలోని కొలనులోని నీరు ప్రజలందరి చేత పూజనీయ యోగ్యతను ఆపాదించుకుని, దేవాలయాన్ని అద్భుతాల నెలవుగా మార్చింది.
మీరు చర్చలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి.