మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. »
  3. ఏది నిజం
  4. »
  5. కథనం
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

పాపాలు పోవాలంటే...పెళ్లాం దెబ్బలు తినాల్సిందే

WD
మన దేశంలో వివిధ మత ఆచారాలతోపాటు మూఢ విశ్వాసాలూ ఉన్నాయి. వాటిలో కొన్ని అంధ విశ్వాసాలు నవ్వుతెప్పించేవిగానూ ఉంటాయి. అయితే ఇవన్నీ మత విశ్వాసం, మూఢాచారాలతో పెనవేసుకుని సాగుతున్నాయి. ఏదినిజం శీర్షికలో భాగంగా ఈసారి పంజాపూర్‌ గ్రామంలో భిన్నమైన తరహాలో సాగుతున్న మతాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం.

ఇక్కడి ఉత్సవాలు కేవలం మత విశ్వాసానికి మాత్రమే పరిమితం కాక సరదాగా నవ్వించే రీతిలో ఉంటాయి. ఇది వాస్తవం! దేవాస్ జిల్లాలోని పంజాపూర్ గ్రామంలో గంగౌర్ ఉత్సవాలను గ్రామస్తులు విభిన్న రీతిలో కొనియాడుతున్నారు. ఆ గ్రామంలో తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకునేసరికి వారు చేపట్టే ప్రత్యేక తరహా మత ఆచారం గంగూర్ సంబరాల ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యాన్ని చాటి చెప్పేలా నిలుస్తోంది.
WD


ఈ ఆచారం ప్రకారం ఓ పొడవైన స్తంభాన్ని భూమిలో నాటుతారు. బ్రౌన్‌షుగర్ వంటి మాదకద్రవ్యం కలిగిన ఓ సంచిని ఆ స్తంభానికి కడతారు. దాని చుట్టూ చింతచెట్టు రెమ్మలను పట్టుకుని గ్రామ మహిళలు నిల్చుంటారు. కొయ్యల సాయంతో స్తంభానికి కట్టిన మత్తుమందు సంచిని పట్టుకునే క్రమంలో వారి కోటను ఛేదించేందుకు గ్రామంలోని మగవాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో మహిళలు వారిని తమ చేతిలోని కర్రలతో కొడుతూ అడ్డుకుంటారు. అయినప్పటికీ మగవాళ్లు తమ చేతిలోని కొయ్యలతో వారి దాడిని ఎదుర్కుంటూ, లక్ష్య ఛేదన దిశగా ముందుకు సాగుతారు.
WD
పెళ్లిలో ఏడడుగులు చుట్టూ తిరిగే సంప్రదాయమున్నట్టే ఆ సంచిని తీసుకునేందుకై వారు కూడా ఏడు విడతలుగా ప్రయత్నిస్తారు. ఏడు పర్యాయాలు మహిళల చేతిలో దెబ్బలు తప్పించుకుంటూ మగవాళ్లు ఆ స్తంభాన్ని అక్కడి నుంచి పెకిలించి వేసేందుకు ప్రయత్నిస్తారు. భూమిలో దాన్ని నాటిన చోట ఉన్న గుంతను పూడ్చేంతవరకు కూడా ఆడాళ్ల దగ్గర మగాళ్లు దెబ్బలు తినే ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ తమ భేదాలు మరచి, ఆడుతూ పాడుతూ సంబరాలను ఆనందంగా ముగిస్తారు. భార్యలు తమ భర్తల క్షేమంకోసం, తమ పెళ్లి పవిత్రతను రక్షించాలని ప్రార్థిస్తారు. ఆ తర్వాత శక్తిమాతను గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి గోధ్ భరాయ్ (పిల్లల కోసం ప్రార్థన) సంప్రదాయాన్ని ముగిస్తారు.

పురుషులు తమ భార్యలపై ఏడాది పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నా, స్త్రీలు మాత్రం తమ భర్తలు క్షేమంగా ఉండాలని ఆ రోజు తమ శక్తిమాత గంగౌర్‌ను ప్రార్థిస్తున్నారని గ్రామస్తుల విశ్వాసం. తాము చేసిన ప్రక్షాళన చేసుకునేందుకే మగవారు ఆ రోజున భార్యల చేతిలో దెబ్బలు తింటారు.
WD


దీనిపై గ్రామ పెద్ద మాట్లాడుతూ సంబరాలను ఘనంగా జరుపుకునే క్రమంలోనే గ్రామస్తులు ఈ తంతు నిర్వహిస్తున్నారని చెప్పారు. పలు గ్రామాల నుంచి ప్రజలు ఈ సంబరాలలో పాల్గొంటున్నారన్నారు. మహిళలు దేవతలతో సమానమని, వారిపై కిరాతక చర్యలకు పాల్పడటం ద్వారా మంచి కన్నా చెడు అధికంగా జరుగుతుందని మగవాళ్లకు తెలియజెప్పడమే ఈ తంతు ఉద్దేశ్యమని చెప్పారు. మీరు ఈ ఆచారం గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు మాకు పంపండి.