గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2016 (10:54 IST)

తిరుమల శ్రీవారి సేవలో చిరంజీవి... చూసేందుకు ఎగబడిన భక్తులు... గంటలో శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సోమవారం పలువురు వీఐపీలు దర్శనం చేసుకున్నారు. వీరిలో రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి కూడా ఉన్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో చిరంజీవి తన కుటుంబ సమేతంగా స్వామిసేవలో పాల్గొన్నారు. 
 
ఇటీవల వివాహమైన తన చిన్న కుమార్తె శ్రీజ వివాహం తర్వాత మొదటిసారి స్వామి వారిని చిరంజీవి దర్శించుకున్నారు. అలాగే పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత, ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీ రావులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, చిరంజీవిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. 
 
మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనం గంటలోనే భక్తులకు లభిస్తోంది. తిరుమల మొత్తం ఖాళీగా కనిపిస్తోంది. వీఐపీలు మినహా తిరుమలలో సామాన్య భక్తులు తక్కువగా కనిపిస్తున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నారు. 
 
అలాగే కాలినడక భక్తులు ఒక కంపార్టుమెంటులో వేచి ఉన్నారు. సర్వదర్శనంతోపాటు కాలినడక భక్తులకు గంటలోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. ఆదివారం శ్రీవారిని 79,646 మంది భక్తులు దర్శించుకోగా, ఆలయ హుండీ ఆదాయం రూ.2.48 కోట్లుగా వసూలైంది.