శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : గురువారం, 5 మే 2016 (17:00 IST)

భక్తులు సంతృప్తి చెందితేనే సేవకు ప్రతిఫలం : తితిదే ఈఓ సాంబశివరావు

భక్తులు సంతృప్తి చెందినపుడే సేవలకు ఫలితం లభించినట్లని, శ్రీవారి సేవలకు ఈ దృష్టిలో ఉంచుకుని మరింత సేవా నిరతితో సేవలందించాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని ఆస్థానమండపంలో శ్రీవారి సేవకులకు వేసవి అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. 
 
ఈసందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతలతో సేవకులు సేవాతత్పరతతో వ్యవహరించాలన్నారు. శ్రీవారి సేవకులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, చూడగానే చేతులెత్తి నమస్కరించేలా కట్టుబొట్టు ఉండేలా ఉండాలని సూచించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవకులు ఎంతో క్రమశిక్షణతో సేవలు అందిస్తున్నారని తెలిపారు. 
 
ఈ సంస్థ సహకారంలో తిరుమలలోని ఆస్థానమండపంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీవారి సేవకులకు శిక్షణ ఇస్తామన్నారు. ఇందులో పదినిమిషాల ధ్యానం, పది నిమిషాలు భజన, 30 నిమిషాల పాటు సేవ, శ్రీవారి ప్రాశస్త్యంపై తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఉపన్యాసం ఇస్తామన్నారు. చివరి 10 నిమిషాల పాటు సేవకుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటామన్నారు.
 
ఈ యేడాది నవంబర్‌ నెల వరకు ఈ శిక్షణ ఉంటుందన్నారు. తిరుమలలో శ్రీవారి సేవకులతో నిర్వహిస్తున్న లడ్డూ కౌంటర్లు విజయవంతంగా నడుస్తున్నాయని ఈఓ తెలిపారు. తితిదేలోని పలు విభాగాలపై శ్రీవారి సేవకులపై సర్వేలు కూడా నిర్వహిస్తున్నామని, భక్తులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు.